Saturday, April 20, 2024

‘కృష్ణా’పై గేట్లు బార్లా

- Advertisement -
- Advertisement -

నారాయణపూర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు గేట్లు ఎత్తివేత
ఉప్పొంగిన ఉప నదులు జూరాలకు పోటెత్తిన వరద శ్రీశైలానికి
2.71లక్షల క్యూసెక్కుల విడుదల.. 10గేట్లు ఎత్తివేత సాగర్‌కు 4లక్షల
క్యూసెక్కుల వరద.. 22గేట్ల ఎత్తివేత పులిచింతల దిగువన ప్రమాద
హెచ్చరికలు జారీ ఇప్పటికే 970 టిఎంసిలు సముద్రం పాలు

మన తెలగాణ/హైదరాబాద్/నాగర్‌కర్నూల్: పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వానాకాల సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు పలుమార్లు కృష్ణానదికి భారీగా వరదలు వచ్చాయి. శుక్రవారం నాడు కృష్ణానదికి తెలుగు రాష్ట్రాల ముఖద్వారంలో ఉన్న జూరాల ప్రాజెక్టు మొదలుకొని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ వర కూ అన్ని ప్రధాన ప్రాజెక్టుల గేట్లు బార్లా తెరుచుకున్నాయి. లక్షల క్యూసెక్కుల వరద నీరు నదిలో ప్రవహిస్తుండడంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ , పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేశారు. సాధారణంగా ప్రతియేటా కృష్ణానది ప్రా జెక్టుల పరిధిలోని ఆయకట్టుకు అవసరమైన సాగునీటికి కొరత ఏర్పడుతూ రాష్ట్రాల మధ్య గొడవలు కాని ఈ ఏడాది ఆయకట్టుకు పుష్కలంగా నీరందడమే కాకుండా, ఇప్పటికే రికార్డు స్థాయి లో 970టిఎంసిల కృష్ణా జలాలు ప్రకాశం బ్యా రేజీ నుంచి వృథాగా సముద్రంలో కలిసిపోయా యి. గత రెండు రోజులుగా రాయలసీమ , దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

హంద్రీ, హగరి, వేదివతి, తుంగభద్ర తదితర ఉపనదులు భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కృష్ణా నదిలో వదర ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. జూరాల ప్రాజెక్టులోకి ఉదయం ఆరు గంటలకు 1.55లక్షల క్యూసెక్కులు ఉన్న వరద ప్రవాహం సాయంత్రానికి 2.56లక్షల క్యూసెక్కులకు పెరిగి పోయింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి రిజర్వాయర్ నుంచి 2.71లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలిపెడుతున్నారు. అటు తుంగభద్రలో కూడా వరద ప్రవాహం భారీగా పెరిగింది. సుంకేసుల బ్యారేజి 32గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద

ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉదయం 2.79లక్షల క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రానికి 3.95లక్షలకు చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. రిజర్వాయర్ నుంచి 4.53లక్షల క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేస్తున్నారు. పాటు శ్రీశైలం తిరుగు జలాలపై ఆధారపడ్డ హాంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, మహాత్మ గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సాగు నీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి కోసం రెండు లక్షల 84వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్ని పూర్తి స్థాయిలో నిండుకుండలా ఉండడంతో వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాంకు లక్షా 65వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, వరదను యథావిధిగా దిగువకు వదులుతున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు మరో వారం రోజుల పాటు వరద కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జున్ సాగర్ ప్రాజెక్టు వద్ద అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎగువ నుంచి 3.46లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి వచ్చిననీటిని వచ్చినట్టుగా బయటకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 3.02లక్షల క్యూసెక్కలు నీరు చేరుతోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి 3.29లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణానదికి ఇరువైపులా అధికారులు వరద హెచ్చరికలకు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీకి 1071టిఎంసిలు:

ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదీజలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎగువ నుంచి బ్యారేజీలోకి 1.64లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రధాన కాలువలకు 6763 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. బ్యారేజీ క్రస్ట్‌గేట్ల మీదుగా 1.57లక్షల క్యూసెక్కుల నీరు దిగువన సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. ఈ వానాకాలం ప్రారంభమయ్యాక జూన్ నుంచి ఇప్పటివరకూ ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి 1071టిఎంసీల వరదనీరు చేరింది . అందులో 970టిఎంసీల కృష్ణానదీజలాలు క్రష్ట్‌గేట్లు దాటుకుని దిగువనదిలోకి విడుదలయ్యాయి. ఇక్కడి నుంచి మరే ప్రాజెక్టు లేకపోవటంతో నీరంతా వృధాగా సముద్రంలో కలిసిపోయింది. ప్రకాశం బ్యారేజి నుంచి ప్రధాన కాలువలకు కేవలం 102టిఎంసీల నీటిని మాత్రమే ఏపి ప్రభుత్వం ఉపయోగించుకోగలిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News