Saturday, May 18, 2024

రేవణ్ణపై లుక్ ఔట్ నోటీసు జారీ.. అరెస్టుకు రంగం సిద్ధం

- Advertisement -
- Advertisement -

తండ్రీ కొడుకులపై సిట్ దర్యాప్తు వేగవంతం
ప్రజ్వల్ తిరిగి వచ్చాక చట్టపరమైన చర్యలు
కర్నాటక హోం మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: తన కుమారుడు, హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణతో కలసి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హోలెసరసీపూర్ జెడిఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లుక్ ఔట్ నోటీసు జారీచేసినట్లు కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర శనివారం వెల్లడించారు. మాజీ మంత్రి రేవణ్ణకు సిట్ రెండవ సమన్లు జారీచేసిందని, నేటి సాయంత్రం లోగా ఆయన ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుట హాజరుకావలసి ఉందని పరమేశ్వర తెలిపారు. రేవణ్ణపై లుక్ ఔట్ నోటీసు ఇదివరకే జారీ అయిందని, రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్‌పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. తన కుమారుడి లాగే రేవణ్ణ కూడా విదేశాలకు వెళ్లిపోతారని భావించే లుక్ ఔట్ నోటీసు జారీ చేయడం జరిగిందని పరమేశ్వర చెప్పారు.

మైసూరు కిడ్నాపింగ్ కేసులో రేవణ్ణ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసిందని విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. మైసూరు కిడ్నాప్ కేసులో ఒక అరెస్టు జరిగిందన్న విలేకరుల ప్రశ్నకు& అలాంటివి జరుగుతూనే ఉంటాయి.. అరెస్టులు జరుగుతూనే ఉంటాయని..లుక్ ఔట్ నోటీసులు జారీచేశాము.అనేక పరిణామాలు జరుగుంటాయి..అన్నీ ప్రజల దృష్టికి రాకపోవచ్చు అని పరమేశ్వర వ్యాఖ్యానించారు. రేవణ్ణ ఇంట్లో పని చేసిన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత ఆదివారం హసన్ జిల్లాలోని హోలెనరసీపుర పోలీసు స్టేషన్‌లో తండ్రీ కొడుకులపై లైంగిక వేదింపుల ఆరోపణలపై మొదటి కేసు నమోదైంది.

లైంగిక వేధింపుల బాధితురాలిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణపై గత గురువారం మైసూరులో రేవణ్ణతోపాటు ఆయన సహచరుడు సతీష్ బాబన్నపై రెండవ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో రెండవ నిందితుడైన సతీష్ బాబన్నను అరెస్టు చేశారని, కాని మొదటి నిందితుడు రేవణ్ణను ఇంకా అరెస్టు చేయలేదని విలేకరులు ప్రశ్నించగా ఆయనకు(రేవణ్ణ) అవకాశం ఇచ్చారని, సిఆర్‌పిసి సెక్షన్ 41ఎ కింద నోటీసు ఇచ్చారని, ఆయన సిట్ ఎదుట హాజరుకావలసి ఉంటుందని పరమేశ్వర తెలిపారు. రేవణ్ణకు రెండవ నోటీసు ఇచ్చారని, దానికి 24 గంటల వ్యవధి మాత్రమే ఉందని(శనివారం సాయంత్రంతో ముగుస్తుంది), ఆ తర్వాత చట్టపరమైన చర్యలను సిట్ తీసుకుంటుందని హోం మంత్రి చెప్పారు.

ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు గురించి ప్రశ్నించగా విదేశాల నుంచి ఆయన తిరిగి రాక తప్పదని, ఈరోజు రాకపోయినా రేపు, ఎల్లుండి లేదా ఆ తర్వాతైనా తిరిగి రాక తప్పదని, ఆ తర్వాత చట్టపరంగా ఏం జరగాలో అది జరుగుతుందని పరమేశ్వర తెలిపారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవె గౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 26న పోలింగ్ జరిగిన హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి-జెడిఎస్ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు అనేకం ఇటీవల గత కొద్ది రోజులుగా హసన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై దర్యాప్తున కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 26న ముగిసిన మరుసటి రోజు ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం.

సిట్ ఎదుట ప్రజ్వల్ హాజరుకావడానికి ఆయన తరఫు న్యాయవాది వారం రోజుల వ్యవధి కోరగా అటువంటి నిబంధన ఏదీ లేనందున అది సాధ్యం కాదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. గన్‌తో తనను బెదిరించి తనపై అత్యాచారం జరిపాడంటూ ప్రజ్వల్‌పై ఒక జెడిఎస్ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం(మే 1) బెంగళూరులో ప్రజ్వల్‌పై రెండవ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అనంతరం అత్యాచార దృశ్యాన్ని వీడియో తీసిన ప్రజ్వల్ తాను అడిగినప్పుడు తన కోరిక తీర్చకపోతే ఈ వీడియోను వైరల్ చేస్తానని బెదిరించినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో తెలిపింది. కాగా..శనివారం బాధితురాలి సమక్షంలో హోలెనరసీపురలోని రేవణ్ణ ఇంటి వద్ద సిట్ బృందం స్పాట్ మహజర్ నిర్వహించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News