Wednesday, July 9, 2025

శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు.. నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

కాఠ్‌మాండు : శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు తమ దేశంలోనే జన్మించాడని ఆయన పేర్కొన్నారు. సోమవారం కాఠ్‌మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాల్ లోనే జన్మించాడని ఓలి పునరుద్ఘాటించారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని, ఈ విషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించవద్దని పిలుపునిచ్చారు.

రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరని ప్రశ్నించారు. రాముడు పుట్టిన స్థలం నేపాల్‌లోనే ఉందని, అది ఇప్పటికీ అక్కడే ఉందన్నారు. దీన్ని తాము అంతగా ప్రచారం చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. అది కొందరిని బాధిస్తుందని తాను భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన శివుడు , విశ్వామిత్రుడు కూడా తమ దేశం లోనే జన్మించారని పేర్కొన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని, వాల్మీకి రామాయణం లోనే ఇది కూడా ఉందన్నారు. ఇక గతం లోనూ ఓలి ఇలాంటి వివాదాస్పద ప్రకటనలే చేశారు.

2020లో అయోధ్య తమ దేశం లోని చిత్వాన్ లోని థోరిలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడే రాముడు పుట్టాడని ఆయన అన్నారు. అలాగే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా తమ దేశంలోనే ఉందన్నారు. అప్పట్లో ఓలి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో నేపాల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది . ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. రాముడు జన్మస్థలంపై అనేక అభిప్రాయాలు ఉన్నాయని , రామాయణంపై విస్తృతమైన సాంస్కృతిక, భౌగోళిక అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్పారని తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News