మనీలా: భారతదేశపు ఎన్‌జిఒ ’ఎడ్యుకేట్ గర్ల్’కు ఈ ఏటి ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం విజేతగా నిలిచింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని బడీడు బాలికలు మధ్యలో చదువు మానేసి బతుకు అంధకారం అయిన వారికి సరైన విద్య కోసం ఈ భారతీయ స్వచ్ఛంద సేవా సంస్థ జరిపిన విశేష కృషికి ఫలితంగా ఈ అవార్డును ఆదివారం ఈ పురస్కార నిర్వాహకులు మనీలాలో ఆదివారం ప్రకటించారు. ది ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్ గ్లోబలీ పేరిట వెలిసిన ఈ సంస్థ బాలికలకు విద్య కోసం సంస్థగా పేరొందింది. ఆసియా ప్రాంతపు నోబెల్ పురస్కారంగా గుర్తింపు దక్కించుకున్న మెగాసెసె ఈసారి తొలిసారిగా భారతీయ సంస్థకు అందింది. ఈ విషయాన్ని రామన్ మెగసెసె అవార్డు ఫౌండేషన్ (ఆర్‌మాఫ్) ఓ ప్రకటనలో తెలిపింది.
ఆసియాలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక విఫపరిణామాల నుంచి విముక్తికి పాటుపడే నిస్వార్థ సంస్థలకు మరింత స్ఫూర్తిదాయకంగా ఉండేలా ఈ పురస్కారాలు ప్రతి ఏటా ప్రకటించడం ఆనవాయితీగా ఉంది. ఇక ఈ పురస్కారం మరో ఇద్దరికి వ్యక్తిగతంగా దొరికింది. మాల్దీవులకు చెందిన షాహీనాకు పర్యావరణ పరిరక్షణలో సేవలకు , ఫిలిప్పైన్స్‌కు చెందిన ఫ్లావియానో అంటోనియో ఎల్ విలానూవాకు ప్రజా సేవలో ఈ అవార్డు వచ్చింది. ఈ 67వ మెగాసెస్ పురస్కారాన్ని విజేతలకు నవంబర్ 7వ తేదీన మనీలాలోని మెట్రోలిపాలిటన్ థియేటర్‌లో జరిగే కార్యక్రమంలో బహుకరిస్తారు. ఈ అవార్డు భారత్‌కు దక్కడం గర్వకారణం అని ఎడ్యుకేట్ గర్ల్ సంస్థ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్ ముంబైలో స్పందించారు.
దేశంలోని మారుమూల ప్రాంతంలో 2007 సంవత్సరంలో ఒక్క బాలికకు విద్యకు సాయం అందించి ఆరంభం అయిన ఈ సంస్థ లక్షానికి ఇప్పుడు మరింత స్ఫూర్తి,, బలం చేకూరిందని హుస్సేన్ ఈ అవార్డు రావడంపై తమ ప్రకటన వెలువరించారు.ఈ పురస్కారాన్ని తాను తమ టీం బాలిక కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని చెప్పారు. మారుమూల ప్రాంతాలలో, ప్రత్యేకించి రాజస్థాన్ ఒడిషా ఇతర ప్రాంతాలలో పేదకుటుంబాల ఆడపిల్లలు చదువుకు దూరం కావడం బాధాకరం అని, వీరికి తమ వంతుగా న్యాయం కల్పించేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరంభంలో దీనిని కేవలం చదువుకునే పిల్లలకు చదువు అనే ఆలోచనతోనే పెట్టామని, అయితే తరువాతి క్రమంలో ఈ అవసరం పెరిగి ఇప్పుడు ఇది స్వచ్ఛంద సంస్థగా ఎదిగిందని వివరించారు.