Friday, May 3, 2024

అసమాన ప్రతిభాశాలి సాంకృత్యాయన్

- Advertisement -
- Advertisement -

రాహుల్ సాంకృత్యాయన్ (1893 ఏప్రిల్ 9 – 1963 ఏప్రిల్ 14) అసమాన ప్రతిభాశాలి. ఆయన మేధస్సును కొలవడానికి ఏ కొలబద్ద సరిపోదంటే అతిశయోక్తి కాదేమో. కాలాలకు అతీతంగా యావత్ ప్రపంచ చరిత్రలోనే స్వయం కృషితో మహా పండితుడైన వ్యక్తి మరొకరు లేరని మేధావులు భావించడాన్ని బట్టి ఆయన ప్రతిభ తేటతెల్లం అవుతున్నది. ముప్పైకి పైగా భాషలు, వాటి యాసలు నేర్చుకుని అధికారికంగా చదువుకోక పోయినా విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదగడాన్ని బట్టి ఆయన గొప్పతనం స్పష్టమవుతున్నది. రాహుల్ సాంకృత్యాయన్ నిరంతర లోక సంచారిగా పేరొంది, 45 సంవత్సరాల పాటు యాత్రల్లోనే గడిపారు.

లోతైన తాత్విక చింతనకలిగిన సాంకృత్యాయన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి బౌద్ధ భిక్షువుగా మారి అనంతరం మార్క్సిస్ట్ సోషలిస్టుగా పరివర్తన చెందారు. సాంకృత్యాయన్ భారత జాతీయోద్యమంలో కూడా కృషి చేశారు. జాతీయోద్యమానికి అనుకూలంగా, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3 సంవత్సరాల కారాగార శిక్షను అనుభవించారు. 1940వ దశకం ప్రారంభంలో ఆయన పూర్తిగా భౌతికవాద భావాలను స్వీకరించి, కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యునిగా చేరి జీవితాంతం కమ్యూనిస్ట్‌గా ఉన్నారు. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షునిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు.

పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికితీసి, వాటిని అనువాదం చేసి, ప్రపంచానికి తెలియపరచడంలో రాహుల్ అపారమైన కృషిని బౌద్ధులు ఎంతో విలువైనదిగా గుర్తించారు.యునైటెడ్ ప్రావిన్సెస్ (యుపి) రాష్ట్రంలోని అజామ్‌గఢ్ జిల్లాలో 1893 ఏప్రిల్ 9లో సనాతన ధర్మాన్ని పాటించే బ్రాహ్మణ కుటుంబంలో కేదార్‌నాథ్ పాండే జన్మించారు. బౌద్ధాన్ని స్వీకరిం చాక, తన పేరును రాహుల్ సాంకృత్యాయన్‌గా మార్చు కున్నారు.ప్రాథమిక విద్య ఉర్దూ మాధ్యమంలో చదివారు. తొమ్మిదేళ్లప్పుడే ప్రపంచం ఏమిటో చూడాలని ఇంట్లోంచి పారిపోయాడు సాంకృత్యాయన్. 8వ తరగతితోనే అతని చదువు ఆగిపోయింది. కాశీ విద్యాపీఠ్‌లో సంస్కృతం నేర్చుకున్నారు. ఆర్యసమాజంలో చేరి హిందూమత వ్యాప్తి కి కొన్నాళ్లు కృషి చేశారు. ఆయన నిత్యసంచారిగా వేలాది కి.మీ కాలినడకన చుట్టివచ్చారు. మూడు బౌద్ధ వేదాలనూ జీర్ణించుకుని త్రిపిటకాచార్య అయ్యారు. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్ రష్యా ఎక్కడ తిరిగితే అక్కడి భాష నేర్చుకున్నారు. అరబిక్, భోజ్‌పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళీస్, తమిళం, ఉర్దూ లాంటి భాషలు అవలీలగా ఆయన నేర్చుకుని పట్టు సాధించారు.

పదమూడో శతాబ్దంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాల యాలను భక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధ భిక్షువులు పవిత్రమైన గ్రంథాలతో పారిపోయారనీ, ఆ విలువైన సంస్కృత పుస్తకాల్ని టిబెట్‌లోని ఆరామాల్లో భద్రపరిచి వుంచారనీ ప్రచారంలో ఉంది. అయితే ఆరు వందల ఏళ్లుగా వాటిల్లో ఏముందో చూసినవారు లేరు. సాంకృత్యాయన్ వాటి కోసం అన్వేషిస్తూ, దారి కూడా సరిగాలేని కొండల్లో నడుస్తూ, కశ్మీర్, లడఖ్, కార్గిల్ మీదుగా టిబెట్ వెళ్లారు. అక్కడ పుస్తకాలైతే లభించాయి గానీ అవి సంస్కృతంలో లేవు. అన్నీ భోటి భాషలో ఉన్నాయి. రాహుల్ కంచర గాడిదల మీద వాటిని తరలించుకొచ్చారు. ఆ గ్రంథాలన్నీ పాట్నా మ్యూజియంలో ఉన్నాయిప్పుడు. మరో మూడుసార్లు టిబెట్ వెళ్లి, టిబెటన్ నేర్చుకుని, దాని వ్యాకరణ పుస్తకాలు రాశారు.

టిబెటన్- హిందీ నిఘంటువు కూర్చారు.నాటి సోవియట్ యూనియన్‌లోని అనేక రిపబ్లిక్కులలో ఆయన విస్తృతంగా పర్యటించి, సంస్కృతం, పాళీ భాషలో లిఖించబడిన అనేక శాసనాలను, రాతి ఫలకాలనూ కనుగొన్నారు. 70 సంవత్సరాల వయసులో మరణించే సమయానికి, ఆయన దాదాపు 140 పుస్తకాలు రాశారు. జీవితంలో మొత్తం జ్ఞాపకశక్తిని కోల్పోయారు. వందలాది పుస్తకాలు కూడా కంఠోపాఠంగా కలిగిన మహా జ్ఞాని, విజ్ఞాన ఖని చివరి రోజుల్లో తన పేరేమిటో తనే చెప్పుకోలేని మతి మరుపులోకి జారిపోయారు. 1963 ఏప్రిల్ 14లో శ్రీలంకలో ఆచార్యుడుగా పని చేస్తూ, ఆయన అంతిమ శ్వాస విడిచారు. ఆయన స్మృతి చిహ్నం డార్జిలింగ్ నగరంలో బౌద్ధమత పద్ధతిలో నిర్మించబడింది. 1958లో సాహిత్య అకాడమీ పురస్కారం, 1963లో పద్మభూషణ్ బిరుదులు ఆయనకు లభించాయి.

రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News