Monday, April 29, 2024

అటు అబ్బాయి ఇటు బాబాయ్..

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర వేదికగా రాజకీయాలు విచిత్రంగా మారాయి. ఎన్‌సిపి కేంద్ర బిందువుగా మారిన రాష్ట్ర రాజకీయాల పరిణామాలతో ఇప్పుడు జాతీయ స్థాయిలో బాబాయ్ ఓ వైపు, అబ్బాయ్ మరో వైపు చేరారు. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల భేటీకి శరద్ పవార్ ఎన్‌సిపి ఒరిజినల్ తరఫున హాజరవుతున్నారు. కాగా ఆయన అన్నకొడుకు అజిత్ పవార్ ఢిల్లీలో జరిగే బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ భేటీకి ఎన్‌సిపి చీలిక వర్గం తరఫున వెళ్లుతున్నారు. బిజెపికి, కాంగ్రెస్‌కు ఇది జాతీయ స్థాయి రాజకీయ కీలక సమావేశాల ఘట్టం అయింది. శరద్ పవార్‌ను కాదని మహారాష్ట్రలో బిజెపి, షిండే వర్గపు శివసేన ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ సోమవారం తమ పూర్వపు నేత శరద్ పవార్‌ను తన బృందంతో ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. ఆదివారం కూడా అజిత్ తన అనుచర గణంతో పవార్ నివాసానికి వెళ్లి వచ్చారు.

తాము ఆయన ఆశీస్సులు తీసుకున్నట్లు, ఆయన ఏమీ చెప్పనట్లు వివరించారు. పవార్‌తో దూరం అయిన తరువాత అజిత్ వర్గం ఆయన వద్దకు వెళ్లడం రెండు రోజుల్లో ఇది రెండోసారి అయింది. శరద్ పవార్‌ను తాము స్థానిక వైబి చవాన్ సెంటర్‌లో కలిసినట్లు అజిత్ వర్గం తెలిపింది. అజిత్ పవార్ ఆయన వెంట 15 మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు. తాము శరద్ పవార్‌ను కలుసుకుని పార్టీ సమైక్యంగా ఉండేలా చూడాలని కోరామని, ఇంతకు మించి ఏమీలేదని ఈ వర్గానికి చెందిన రాజ్యసభ ఎంపి ప్రఫుల్ పటేల్ విలేకరులకు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిక , శరద్‌తో విభేధించడం వంటి అంశాలలో ఎటువంటి సర్దుబాట్లు లేవని పటేల్ స్పష్టం చేశారు. తమ మధ్య నమ్మక దూరం పెరిగిందని, ఇక అటు వెళ్లడం కుదరదని తెలిపిన ప్రఫుల్ ,

ఇప్పుడు శరద్ పవార్‌ను కలుసుకోవడం కేవలం ఆయన పట్ల తమకు ఉన్న గౌరవ మర్యాదలను చాటుకునేందుకే అని చెప్పారు. ఇక ఢిల్లీలో జరిగే ఎన్‌డిఎ భూటీకి అజిత్ పవార్ వెళ్లుతున్నారని వివరించారు. కాగా ఎన్‌సిపి చీలిక వర్గం శరద్ పవార్‌ను కలుసుకోవడం విఫలయత్నం అని ఎన్‌సిపి జాతీయ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో తెలిపారు. ఇప్పటికే విశ్వాసపు బ్రిడ్జి నుంచి చాలా నీరు కొట్టుకుపోయిందన్నారు. తాము పవార్‌ను సముదాయించగలమని మరాఠీలకు తెలియచేసుకునే క్రమంలోనే వీరు అక్కడికి వెళ్లారని, అయితే ఇది విఫలమైందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News