Sunday, October 6, 2024

బిఆర్‌ఎస్ బిసి నేతను పార్టీ అధ్యక్షుడిని చేయగలదా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బిసిల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు బిసిలను అణగదొక్కిన బిఆర్‌ఎస్‌కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. స్థానిక సంస్థల్లో బిఆర్‌ఎస్ బిసిలకు వాటా ఇవ్వలేదని, దమ్ముంటే బిఆర్‌ఎస్ ప్రెసిడెంట్ గా బిసిని చేయాలని ఆయన సవాల్ విసిరారు. బిసిల విషయంలో రేవంత్ మాటమీద ఉన్నారన్నారు. కాంగ్రెస్ మూలసూత్రం కూడా అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడమేనని ఆయన తెలిపారు. పిసిసి ఎంపిక విషయంలో పొన్నం, సీతక్కల పేర్లు కూడా వచ్చాయని, కానీ, వారిద్దరూ తన పేరు చెప్పడం సంతోషమన్నారు. తనను ఒక ధ్యేయంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిని చేసిందని అధిష్టానం కోరిన విధంగా ముందుకు పోవాలన్నదే తన తపన అని తెలిపారు.

బిజెపి, బిఆర్‌ఎస్ మాటలు ఎవరూ నమ్మరు
ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే గగ్గోలు పెడుతున్నారని, బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కల అని ఆయన అన్నారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, బిజెపి, బిఆర్‌ఎస్ మాటలు ఎవరూ నమ్మరన్నారు. బిఆర్‌ఎస్ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని ఆయన ఆరోపించారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ఐదేళ్లపాలన ఉంటుందన్నారు. కులాన్ని పక్కన పెట్టి బిసిలుగా ఐక్యం అవ్వాలని, బిసిలుగా ఎదగాలంటే కులాన్ని పక్కన పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం పక్కా అని ఆయన అన్నారు. అంకుఠిత దీక్షతో రాహుల్ బడుగు, బలహీనవర్గాల కోసం పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. తాను రాహుల్ గాంధీ వదిలిన బిసి బాణాన్ని అని, సోనియా గాంధీ పంపిన సందేశాన్ని అని, మల్లికార్జున ఖర్గే పంపిన సైన్యాన్ని అని ఆయన పేర్కొన్నారు.

బిసి బిడ్డను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే దమ్ము బిజెపికి ఉందా?
తమ పార్టీలో పొన్నం ప్రభాకర్, కేశవరావు, విహెచ్ లాంటి వారు ఎందరో బిసిల కోసం కొట్లాడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, తాను, పొన్నం ప్రభాకర్ అందరం రాహుల్ గాంధీ సైనికులమని ఆయన అన్నారు. బిసి కులగణన జరిగిన తరువాతే రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఒక బిసి బిడ్డను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే దమ్ము బిజెపికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అసలు చురుగ్గా పనిచేసిన బిసి బిడ్డ బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారో దానికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్‌కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇచ్చి బిజెపి చేతులు దులుపుకుందని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు 42 శాతం నుంచి 23 శాతానికి రిజర్వేషన్‌లను తగ్గించారో బిజెపి ముందు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి దేవుడి పేరిట, మతాల పేరిట ఓట్లు అడిగే పార్టీ అని, బిఆర్‌ఎస్ సెంటిమెంట్ రాజకీయం చేస్తుందని, ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News