న్యూఢిల్లీ: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ప్రస్తుతం చీటింగ్ కేసులో చిక్కుకున్నాడు. ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా నిర్మాణంలో సౌబిన్ ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అతను తన తండ్రి, మరో వ్యక్తితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. అయితే, ఈ సినిమా నిర్మాణానికి సహకరించిన తనను చీట్ చేశారని సిరాజ్ అనే వ్యక్తి నటుడు సౌబిన్ ఫిర్యాదు చేశాడు.
ఈ సినిమా కోసం రూ.7 కోట్లు పెట్టుబడి పెట్టానని.. సినిమా విడుదలైన తర్వాత లాభాలలో 40 శాతం ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ‘మంజుమ్మెల్ బాయ్స్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని, కానీ ఇచ్చిన మాట ప్రకారం.. లాభాల్లో వాటా ఇవ్వకుండా తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, ఎర్నాకులం పోలీసులు సౌబిన్ , ఇతరులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సౌబిన్.. ఇటీవల ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించాడు. ఈ నెల 5, 6 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సైమా అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావడానికి అనుమతి కోరుతూ సౌబిన్ కోర్టులో పిటిషన్ వేశారు.
సౌబిన్ షాహిర్ ఒక ప్రముఖ నటుడని, జాతీయ స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషలతో అలరిస్తూ మలయాళ చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని ఆయన న్యాయవాదులు వాదించారు. దుబాయ్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరైతే అది మలయాళ చిత్ర పరిశ్రమకు గౌరవప్రదమైన విషయం అవుతుందని అన్నారు. అంతేకాకుండా, సౌబిన్ బాధ్యతాయుతమైన నటుడు కాబట్టి.. కోర్టు అనుమతిస్తే వేడుక తర్వాత వెంటనే ఇండియాకు తిరిగి వస్తారని హామీ ఇచ్చారు. అయితే, కోర్టు మాత్రం అతని అభ్యర్థన తిరస్కరించినట్లు తెలుస్తోంది.
కాగా, సౌబిన్ ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలో కనిపించాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దయాళ్ పాత్రను ఆయన పోషించారు. అంతేకాదు, హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి మోనిక సాంగ్ లో డ్యాన్స్ అదరగొట్టాడు. ఈ సాంగ్ బాగా వైరల్ అయ్యింది.