Monday, April 29, 2024

వాళ్లిద్దరూ అబద్ధాల కోరులే: ఖర్గే

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : బిజెపికి బిఆర్‌ఎస్ బి టీం అని, ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్‌లు అబద్దాల కోరులని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గంజ్‌ మైదాన్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి తొమ్మిదేండ్లుగా 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా దేశంలోని నిరుద్యోగులను మోసం చేసిన ఘనత ప్రధాని మోడీ దని అన్నారు. దేశంలోని యువతకు ఉద్యోగాలివ్వకుండా వారిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని స్థాయిలో అబద్దాలు చెప్పవచ్చా? ప్రజల్ని మోసం చేయవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. ఏటా నెండు మూడు వేల ఉద్యోగాల్చి, వారితో ఫోటోలు దిగడం, ఫోజులివ్వడం మాత్రమే మోడీకి తెలుసని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీకి మాట ఇచ్చి మోసం చేసిన చరిత్ర ఇక్కడి సిఎం కెసిఆర్‌దని అన్నారు.

అంతే కాకుండా తెలంగాణా ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలను మోసం చేశారని, 5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ప్రతి పౌరుని నెత్తిన బారం మోపారని అన్నారు. అందుకని మాట ఇచ్చి మోసం చేయడంలో కెసిఆర్ కూడా సిద్ధహస్తుడని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను నమ్మరాదని పేర్కొన్నారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని వీరు ప్రశ్నిస్తున్నారని, దేశాని స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయనన్నారు. అనేక ప్రణాళికలను రచించి, వాటిని అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి నిరుపేదలకు ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని ఖర్గే అన్నారు. దేశంలోని అనేక పరిశ్రమలను, ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కాదా అని అడిగారు. తెలంగాణా రాష్ట్రం ఇచ్చి ఇక్కడి ప్రజలను బలోపేతం చేసింది కూడా తమ పార్టీ అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో బిహెచ్‌ఇఎల్,బిడిఎల్, ఓడిఎఫ్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అందువల్ల ఎవరు ఏంచేశారో ప్రజలకు తెలుసునని చెప్పారు.

కర్టాటకలో 5 గ్యారంటీలకు గాను 4 ఇప్పటికే అమలు చేస్తున్నామని, మరొకదాన్ని కూడా త్వరలో అమలు చేస్తామని అన్నారు. ఇక్కడి బిఆర్‌ఎస్ నేతలకు లగ్జరీ బస్ ఏర్పాటు చేస్తామని, వారిని కర్టాటకకు తీసుకుని రావాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సూచించారు. పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తొలుత కుంగి పోయిన మేడిగడ్డ బ్యారేజీని చూసి, ఆ తర్వాత కర్ణాటకకు వెళ్లి అక్కడి కరెంట్ సరఫరాను చూసొద్దామని, దీనికి కెసిఆర్ రెడీనా అని సవాల్ విసిరారు. ప్రగతి భవన్‌కు రావాల్నా? ఫామ్ హౌస్‌కు రావాల్నా? అని ఆయన అడిగారు.కాళేశ్వరంలో ఇసుక తీయడం వల్ల మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని చెప్పడానికి ఇఎన్‌సికి సిగ్గు లేదా అని అన్నారు. ఇలాంటోళ్లను కొరడాతో కొట్టి జైలులో వేయాలన్నారు.తెలంగాణాకు సోనియాగాందీ ఆరు గ్యారంటీలను ప్రకటించిందని, తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు.

కర్ణాటక మంత్రి బోస్‌రాజు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే, సీనియర్ నాయకులు శ్రీధర్‌బాబు,హనుమంతరావు, దామోదర్‌రెడ్డి, రాజనర్సింహ,కుసుమ్‌కుమార్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి,నిర్మలా జగ్గారెడ్డి,సురేష్‌షెట్కార్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News