Sunday, September 15, 2024

మరోసారి పార్లమెంట్‌లో భద్రత వైఫల్యం

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు యువకుని యత్నం
ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపు గోడ దూకి పార్లమెంట్ అనెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించిన యువకుడు
అతనిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేసిన సిఐఎస్‌ఎఫ్
నిందితుడు యుపి అలీగఢ్ వాసి మనీశ్‌గా గుర్తింపు
న్యూఢిల్లీ : నిరుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకువెళ్లడం కలకలం రేపింది. తాజాగా మరొకసారి పార్లమెంట్‌లో భద్రత వైఫల్యం బయట పడింది. ఒక యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించాడు. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంట్ అనెక్స్ భవనం ఆవరణలోకి గోడ దూకి లోపలికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.

శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో 20 ఏళ్ల యువకుడు ఒకడు ఇంతియాజ్ మార్గం వైపు ఉన్న గోడ దూకి పార్లమెంట్ అనెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు. అలా గోడ దూకి లోపలికి ప్రవేశించిన ఆ యువకుని కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సిఐఎస్‌ఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిందితుడి వద్ద ఎటువంటి ఆయుధాలూ లేవని నిర్ధారణ అయిన తరువాత అతనిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుని ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మనీశ్‌గా గుర్తించారు. అతనిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి అక్కడ అధికారులు ప్రశ్నించారు. ఎత్తుగా ఉన్న ఆ గోడను అలా ఎక్కాడు అని తెలుసుకునేందుకు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

అదే విధంగా పార్లమెంట్ ప్రాంగణంలోకి ఎందుకు ప్రవేశించాడనేది కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, మనీశ్ తన పేరు సరిగ్గా చెప్పలేకపోవడంతో అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలియజేశారు. నిరుడు డిసెంబర్ 13న పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకువెళ్లడం కలకలం రేపిన విషయం విదితమే. లోక్‌సభలోని పబ్లిక్ గ్యాలరీ వద్ద కూర్చున్న యువకులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. పసుపు రంగు పొగ వెదజల్లుతూ వారు ఎంపిలను భయభ్రాంతులకు గురి చేశారు. ఆ సంఘటన తరువాత పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిని మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News