ఓ యువతిని వన్‌సైడ్ లవ్ చేసిన యువకుడు 8 సంవత్సరాల తర్వాత ప్రియురాలి భర్తను హత్య చేసిన ఘటన ఈనెల 10న అర్ధరాత్రి కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఆంద్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన పంపేన అయ్యప్ప స్వామి (27) 9వ తరగతి చదివాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో మేనత్త ఇంటిదగ్గర పెరిగాడు. ఈ సమయంలో శ్రావణి సంధ్య అనే అమ్మాయి ని వన్‌సైడ్ లవ్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను బంధువులతో అడిగిపించాడు. పెళ్లి చేయడానికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
యువతికి రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ మండలం, ములగాడు గ్రామానికి చెందిన కాళ్ల వెంకటరమణ(32)కు శ్రావణ సంధ్యను ఇచ్చి వివాహం జరిపించారు. శ్రావణ సంధ్య కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్ ఫేస్-1లో నివాసం ఉంటున్నారు. కక్షపెంచుకున్న అయ్యప్ప స్వామి 8 సంవత్సరాల తర్వాత ప్రియురాలి భర్త గుండెల్లో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి పరారైయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వామి కోసం వెతకడం ప్రారంభించారు. కాగా పరారీలో స్వామిని గురువారం అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.