ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై శనివారం ఓ వ్యక్తి నీటితో దాడి చేశాడు. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో తన మద్దతుదారులతో కలసి పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై ఒక వ్యక్తి నీళ్లు విసిరాడు. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకున్న భద్రతా సిబ్బంది, ఆప్ కార్యకర్తలు అతడిని చితకబాదారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అశోక్ షా గుర్తించారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ దాడి వెనుక బిజెపి ఉన్నట్లు ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
ఢిల్లీలో శాంతి భద్రతలు కుప్పకూలాయని, కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అయితే..బిజెపి మాత్రం కేజ్రీవాల్ పాత జిమ్మిక్కులను మళ్లీ చేస్తున్నారంటూ ఆరోపించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్టా కేజ్రీవాల్ మళ్లీ తన జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని బిజెపి ఢిల్లీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఆరోపించారు. గతంలో తనపైన ఇంకును చల్లించుకుని, లెంపదెబ్బ కొట్టించుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు ఈ నాటకానికి తెరతీశారని ఆయన చెప్పారు. తన రాజకీయ వ్యూహం విఫలం కావడంతో ఆయన కొత్త ఆట ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. నిందితుడిని ప్రశ్నిస్తే నిజం బయటకు వస్తుందని ఆయన చెప్పారు.