Sunday, May 5, 2024

గోవులను కసాయిలకు అమ్ముతోన్న ఇస్కాన్: మేనకా గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ (ఇస్కాన్)పై బిజెపి ఎంపి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ తీవ్రస్థాయి ఆరోపణలకు దిగారు. ఇస్కాన్ భారతదేశాన్ని భారీ స్థాయిలో మోసగిస్తోన్న చీటర్ అని మేనకా గాంధీ విమర్శించారు. ఇస్కాన్ గోశాలల్లోని ఆవులను కసాయిలకు విక్రయిస్తున్నారని ఈ ఎంపి తెలిపారు. తరువాత ఈ మూగజీవాల పరిస్థితి ఏమిటనేది చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మేనక జంతువుల హక్కుల ఉద్యమకర్తగా కూడా పేరొందారు. ఇస్కాన్ ఈ దేశంలో పెద్ద మోసకారి సంస్థ అయిందని, ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో నిధులు, పలు ప్రయోజనాలను పొందేందుకు ఈ సంస్థ తెలివిగా గోశాలలను నిర్వహిస్తూ ఉంటుందని, వీటిని అడ్డుపెట్టుకుని చవకగా ప్రభుత్వం నుంచి భూములను స్థలాలను పొందుతుందని చెప్పిన మేనకా గాంధీ ఈ విధంగా దక్కించుకుంటున్న గోవులు చివరికి వధశాలలకు వెళ్లుతున్నాయని ఆరోపించారు. తాను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో ఉన్న ఇస్కాన్ గోశాలకు వెళ్లామని, అక్కడ గోశాల ఉంది కానీ అక్కడ గోవులు లేవని, వీటిని విక్రయించినట్లు తేలిందని చెప్పారు.

ఇస్కాన్ నుంచే ఎక్కువగా భారీ సంఖ్యలో ఆవులు అమ్ముడుపోతున్నాయని తెలిపారు. గోశాలల్లో వట్టిపోయిన ఆవులు లేవు. పాలిచే ఆవులు లేవని వివరించారు. పేరుకు గోశాల ఉందన్నారు. హరే రామ హరే కృష్ణ నామ జపం చేస్తూ రోడ్లపై తిరుగుతూ , తాము కేవలం పాలు తాగి బతుకుతామని చెప్పే ఈ సంఘం వారు ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను ఇస్కాన్ జాతీయ అధికార ప్రతినిధి యుధిష్టర్ గోవింద దాస్ ఖండించారు. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు తగవని తెలిపారు. తమ సంస్ధ ఎల్లవేళలా గోవులు, ఎద్దులు ఇతరత్రా మూగజీవాల పరిరక్షణలో ముందు ఉంటుందని చెప్పారు. భారతదేశంలోనే కాకుండా , ఎక్కువగా బీఫ్ తినే పలు దేశాల్లోనూ తమ సంస్థ గోవులను కాపాడి గోశాలలు ఏర్పాటు చేసి పరిరక్షణ చర్యలకు దిగుతోందని, మేనకా గాంధీ వంటి వారు చిరకాలంగా ఇస్కాన్ శ్రేయోభిలాషులుగా ఉన్నారని, ఆమె ఇటువంటి ఆరోపణలకు దిగడం విస్మయం కల్గించిందని తెలిపారు. గోవులను చేరదీసే సంస్థలు గోవులను విక్రయానికి పంపిస్తాయా? నిజనిర్థారణ లేకుండా ఇటువంటి ఆరోపణలు ఎందుకు ? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News