లండన్: వన్డేలో దక్షిణాఫ్రికా క్రికెటర్ మాథ్యూ బ్రీట్జ్కేచరిత్ర సృష్టించాడు. వన్డే చరిత్రలో మొదటి ఐదు ఇన్నింగ్స్‌లలో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 26 ఏళ్ల బ్రీట్జ్కే లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. వరుసగా 150, 83, 57, 88 పరుగులు చేసిన బ్రీట్జ్కే.. ఈ మ్యాచ్ లో మరో 85 పరుగులు చేసి వరుసగా ఐదవ హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు పేరిట ఉన్న దీర్ఘకాల రికార్డును బ్రేక్ చేశాడు. సిద్దు కెరీర్ బిగినింగ్ లో వరుసగా నాలుగు అర్ధ శతకాలు సాధించి రికార్డు సృష్టించాడు.
కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ 49 పరుగులు, ర్యాన్ రికెల్టన్ 35 పరుగులు, స్టబ్స్ 58 పరుగులు, బ్రేవిస్ 42 పరుగులు, కార్బిన్ బాష్ అజేయంగా 32 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అదిల్ రషీద్ రెండు వికెట్లు, జాకబ్ బెథెల్ ఒక వికెట్ తీశారు.