ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2026, జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు (నాలుగు రోజుల పాటు) జాతర జరుగనుందని పూజారుల సంఘం ప్రకటించింది. సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం 2026 మేడారం మహాజాతర తేదీలను ఖరారు చేసి దేవాదాయ శాఖకు పంపించింది. త్వరలోనే దేవాదాయ శాఖ దీనికి ఆమోదం తెలుపనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మల జాతర వచ్చే ఏడాది జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగనుండగా,
28వ తేదీన కన్నెపల్లి నుంచి సారలమ్మ, 29వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారం గద్దెలకు చేరుకుంటారని పూజారుల సంఘం తెలిపింది. 30వ తేదీన భక్తులు సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక 31వ తేదీన అమ్మవార్ల వనప్రవేశం అనంతరం ఈ జాతర ముగుస్తుందని పూజారుల సంఘం ప్రకటించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మేడారం మహాజాతరను నిర్వహిస్తుం టారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ఈ మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.