Friday, September 13, 2024

కోల్‌కతా హత్యాచార ఘటన: దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కోల్‌కతాలో వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య సంఘటనలపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు గత కొన్ని రోజులుగా కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) శనివారం దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చింది. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సమ్మె పాటిస్తున్నారు. ఐఎంఎ 24 గంటల నిరసనకు దేశం లోని అనేక ప్రైవేట్ ఆస్పత్రులు కూడా మద్దతు ప్రకటించాయి.

ఈ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు దేశం లోని ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఓపీడీ సేవలు నిలిచిపోయాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు సమ్మెలోకి దిగారు. కొంతమంది అత్యవసర రోగులు, ఐసీయులో చేరిన రోగులకు మాత్రమే వైద్యులు, నర్సులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ లోని ఎయిమ్స్, సఫ్దర్‌గంజ్ లోని ప్రధాన ఆస్పత్రులకు చెందిన కొందరు వైద్యులు నిర్మాణ్‌భవన్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా ఐదో రోజుకు చేరింది. కోల్‌కతా వంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.

బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, వైద్యులకు కేంద్ర రక్షణ చట్టం అమలు చేయాలని, సెక్యూరిటీ ఆడిట్ , సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అందుబాటు లోకి రావాలని, ఆసుపత్రిలో అమర్చిన కెమెరాల పూర్తి నివేదిక తీసుకు రావాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. గురుగ్రామ్‌లోని డాక్టర్లతోపాటు లయన్స్ క్లబ్ సభ్యులు, ఇతర సంస్థల ప్రతినిధులు శనివారం ఉదయం ఢిల్లీలోని జాన్‌హాలులో సమావేశమై సమ్మెకు తమ మద్దతు తెలియజేశారు. అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించి బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అస్సాం, మిజోరం, హర్యానా, పంజాబ్ , తెలంగాణ రాష్ట్రాలలో కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.

మరోవైపు సిబిఐ దర్యాప్తు
కోల్‌కతా ఆసుపత్రిలోని కొందరు వైద్యులు, విద్యార్థులను సిబిఐ పిలిపిస్తోంది. కొంతమంది ఆసుపత్రి గార్డులు, కోల్‌కతా పోలీస్ భద్రతా సిబ్బంది కూడా సిబిఐ పరిశీలనలో ఉన్నారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గురించి సిబిఐకి కొంత కీలక సమాచారం లభించింది. విచారణలో భాగంగా ఘోష్‌ని ప్రశ్నిస్తున్నారు. సిబిఐ గత మూడు రోజుల్లో 10 మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News