అవును
ఇపుడు వేపపూత కాదు
గుండెకు ఊపిరిలూదే
జ్ఞాపకాల పూత కావాలి
వసంతుని రాకతో
మకరందాలు పూయించే
కోకిల గానానికి సరికొత్త గొంతు
జ్ఞాపకమై నిలవాలి
ఆమని, యామినిలను
నేత్రపర్వం చేసేలా విచ్చేసే
పండుగ పండు వెన్నెలంత
జ్ఞాపకంలా అల్లుకుపోవాలి
ఆశలు, ఆశయాలు జీవన
జలపాతాలుగా మారుతున్నప్పుడు
విశ్వావసు నామ సంవత్సరమంతా
జ్ఞాపకాల జోలపాడాలి
షడ్రుచుల్ని అరిషడ్వర్గాల్లో చేర్చిన కవి
జ్ఞాపకంలా వెన్నంటి ఉండాలి
సుప్రభాత సమయ కాంతులు
సుస్వప్న ఏకాంత సంగ్రామాలు
నడుమ కదలాడుతూ
ఇంటి గుమ్మాల మీద ఆనంద
ఆచ్ఛాదనలుగా వేలాడే మామిడాకులు,
పచ్చదనాల జ్ఞాపకాలై తట్టిలేపాలి
మనోనివాసాలు ఓపికలేని
ఒంటరితనాన్ని మోస్తున్నా
బంతిపూల పరిమళాలు
అనుబంధాల జ్ఞాపకాలై ప్రజ్వలించాలి
ఆలోచనల ఆవరణంతా అల్లుకుంటున్న రంగవల్లులకు ఉదయింపజేసే రోజుల్ని
జ్ఞాపకాలుగా అద్దిఉంచాలి శతాబ్ధాలుగా
ఎన్ని ఉగాదులు, పర్వదినాలూ
వచ్చి వెళ్లాయో ఎన్ని ఉపదేశాలు
ఇచ్చి వెళ్లాయో తెలియదు కానీ
గడచిన జ్ఞాపకాలే కదా
గడపగడపా గుర్తుచేస్తున్నది.
హృదయాల్ని ఎన్ని తుఫాన్లు
ముంచి వెళ్లాయో
ఎన్ని సుడిగుండాలు అల్లకల్లోలం చేసి వెళ్లాయో తెలియదు కానీ
ఒకప్పటి సమూహాల సందడి
దృశ్యాలే కదా జ్ఞాపకాలై అలరిస్తున్నది.
ఒక్కొక్కప్పుడు ఏదీ లేనితనంతో
మిగిలిపోయి వేడుకల్ని వెదుక్కోవటం
మొదలుపెట్టాక పండుగన్నీ
ఒకప్పటి జ్ఞాపకాలై పలకరించాయి
సాంప్రదాయాలన్నీ బహుమతి చిత్రాలుగా
ఆత్మీయుల పలకరింపులన్నీ
మాధ్యమాల దిశగా
అమ్మచేసే అనుభూతుల వంట
ఆన్లైన్ దిశగా అపురూపంగా కొనుక్కునే
కొత్తబట్టలు అలవాటుగా
జీవన ప్రయాణం మారినప్పుడు
జ్ఞాపకాల పూతయినా హృదయాలకు
లేపనంగా అద్దాలి కదా?
రండి, బాగా వెతుకుదాం
మనం పోగొట్టుకున్నవన్నీ
తప్పక దొరుకుతాయి
కాలం మన శరీరమ్మీది
ఆభరణం కాదు కదా?
ఇష్టం లేకుంటే తీసేసి మరొకటి
వేసుకోవడానికి వాస్తవం అంచున
ఊయలలూగే సంబరాలు,
ఉగాదులు, ఉషస్సుల ఊసులన్నీ
ఒకప్పుడు పూర్తిచేయాల్సిన
దీర్ఘకావ్యపు జ్ఞాపకాలే
రండి.. బాగా వెతుకుదాం
కనీసం మనిషిని బతికించే జ్ఞాపకాలనైనా
శైలజామిత్ర
జ్ఞాపకాల పూత కావాలి..
- Advertisement -
- Advertisement -
- Advertisement -