Saturday, April 20, 2024

జ్ఞాపక శక్తిని పెంచే పుట్టగొడుగులు

- Advertisement -
- Advertisement -

పుట్టగొడుగుల యాక్టివ్ కాంపౌండ్ (క్రియాశీల సమ్మేళనం) తో జ్ఞాపకశక్తి పెంపొందుతుందని ఆస్ట్రేలియా లోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. హెరిసియమ్ ఎరినేసియస్ అనే తెగకు చెందిన లయన్స్ మేన్ మష్‌రూమ్ పుట్టగొడుగుల లోని యాక్టివ్ కాంపౌండ్ మెదడు లోని నాడులను అభివృద్ధి పరిచి, జ్ఞాపకశక్తిని పెంచుతుందని తమ పరిశోధనల్లో తేలిందని వివరించారు. క్వీన్స్‌ల్యాండ్ యూనివర్శిటీకి చెందిన క్వీన్స్‌ల్యాండ్ బ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ ఫ్రెడరిక్ మెయునియర్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు సాగాయి. హెరిసియమ్ ఎరినేసియస్ అనే పుట్టగొడుగుల్లోని యాక్టివ్ కాంపౌండ్స్‌ను ఈ పరిశోధకుల బృందం కనుగొన గలిగింది.

ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ న్యూరో కెమిస్ట్రీలో వెలువడింది. లయన్స్‌మేన్ పుట్టగొడుగుల నుంచి సేకరించిన పదార్ధాలు ఆసియా దేశాల్లో కొన్ని శతాబ్దాలుగా సంప్రదాయ వైద్య విధానంలో వినియోగిస్తున్నారు. అయితే శాస్త్రీయంగా ఈ పుట్టగొడుగుల సామర్ధం మెదడు కణాలపై ఎలా ప్రభావం చూపిస్తుందో కనుగొనడానికే పరిశోధనలు చేపట్టామని ప్రొఫెసర్ ఫ్రెడరిక్ పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో లయన్స్‌మేన్ పుట్టగొడుగులు మెదడు కణాలను అభివృద్ధి చెందించడంలో చెప్పుకోదగిన ప్రభావం చూపించాయని, అలాగే జ్ఞాపకశక్తి ఇతోధికంగా పెంచాయని చెప్పారు. ప్రయోగశాలలో హెరిసియమ్ ఎరినేసియస్ పుట్టగొడుగుల నుంచి వేరు చేసిన కాంపౌండ్స్ తాలూకు న్యూరోట్రాఫిక్ ప్రభావాలను మెదడు కణాలపై ప్రయోగించి చూశారు.

యాక్టివ్ కాంపౌండ్స్ న్యూరాన్ల ను పెంపొందించడం ఆశ్చర్యం కలిగించిందని , అవి విస్తరించి ఇతర న్యూరాన్లతో అనుసంధానం కావించాయని చెప్పారు. సూపర్ రీసల్యూషన్ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి తాము జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూడగలిగామని, పుట్టగొడుగుల పోషకాలు , వాటి యాక్టివ్ కాంపొనెంట్స్ భారీగా గ్రోత్ కోన్ల సైజును పెంచాయని, మెదడు కణాలకు ఇవి చాలా ముఖ్యమని తెలియజేశారు. ఈ మెదడు కణాలే తమ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని గమనించి మెదడు లోని ఇతర న్యూరాన్లతో కొత్త సంబంధాలు ఏర్పరుస్తాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News