Wednesday, May 21, 2025

ఇరు జట్లకు కీలకం

- Advertisement -
- Advertisement -

నేడు ఢిల్లీతో ముంబై ఢీ

ముంబై: ఐపిఎల్ సీజన్ 2025లో భాగంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ (MI vs DC) తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో గెలిచే జట్టుకు ప్లేఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకున్నాయి. ఢిల్లీ ఆరంభ దశలో బాగా ఆడగా ముంబై మధ్యలో పుంజుకుంది.ఇటు ముంబై అటు ఢిల్లీ మరో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై ప్లేఆఫ్‌కు చేరుకుంటోంది. ఒక వేళ ఓడినా మరో ఛాన్స్ ఉంటుంది. ఢిల్లీ ఓడితే (MI vs DC) మాత్రం నాకౌట్ రేసుకు దూరమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ 13 పాయింట్లతో ఉండగా ముంబై ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. సొంత గడ్డపై పోరు జరుగుతుండడం ముంబైకి సానుకూలంగా మారింది.

ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే కీలక ఆటగాళ్లు విల్ జాక్స్, రికెల్‌టన్‌లు జట్టుకు దూరం కావడం కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఈ సీజన్‌లో వీరిద్దరూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జాక్స్, రికెల్‌టన్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడైన ఆటను కనబరిచారు. వీరి లేని లోటును పూడ్చడం అనుకున్నంత తేలికేం కాదు. అయితే జానీ బెయిర్‌స్టో, చరిత్ అసలంక జట్టులోకి రావడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. బెయిర్‌స్టోకు ఐపిఎల్‌లో మంచి రికార్డు ఉంది. అసలెంకలో కూడా అపార ప్రతిభ దాగివుంది. రిచర్డ్ గ్లీసన్ కూడా జట్టులోకి వచ్చాడు.

ఆశలన్నీ ఇద్దరిపైనే..

ఇదిలావుంటే ముంబై ఆశలన్నీ ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌పైనే నిలిచాయి. ఈ సీజన్‌లో ఇద్దరు అత్యంత నిలకడైన ఆటతో జట్టును ఆదుకుంటున్నారు. రోహిత్, సూర్యలు ఫామ్‌లో ఉండడం ముంబైకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా వీరిద్దరూ చెలరేగేందుకు సిద్ధమయ్యారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికి ఉంది. తిలక్‌వర్మ, అసలంక, కెప్టెన్ హార్దిక్ పాండ్య, బెయిర్‌స్టో తదితరులతో ముంబై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బౌల్ట్, బుమ్రా, కర్ణ్ శర్మ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న ముంబై ఈ మ్యాచ్‌లో ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలిచి తీరాల్సిందే..

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సింది. ఓడితే ఢిల్లీ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తోంది. దీంతో ఢిల్లీకి ఇది చాలా కీలకమైన పోరు అని చెప్పక తప్పదు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ మెరుగైన ఆటను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. ఓపెనర్‌గా దిగిన కెఎల్ రాహుల్ అద్భుత సెంచరీ సాధించాడు. ఢిల్లీ 200కి పైగా పరుగులు సాధించినా బౌలింగ్ వైఫల్యంతో ఓటమి పాలుకాక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని భావిస్తోంది. అయితే పటిష్టమైన ముంబైని ఓడించాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News