Tuesday, January 31, 2023

తునికాకు కూలీలకు బోనస్ డబ్బులు

- Advertisement -

అధికారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్ : గిరిజనులు, కూలీలకు ఉపాధి కల్పించే తునికాకు (బీడీఆకు) సేకరణ బోనస్ (నెట్ రెవెన్యూ) ను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అరణ్యభవన్‌లో కూలీలకు తునికాకు సేకరణ పెండింగ్ బోనస్ చెల్లింపులు, ఈ సీజన్ లో తునికాకు సేకరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… బోనస్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగిందని, వీలైనంత త్వరగా కూలీలకు బోనస్ డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 30 జిలాల్లోని 37 డివిజన్లలో విస్తరించిన అటవీ ప్రాంతాల్లో సేకరించిన బీడీ ఆకులను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా సేకరిస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఇరు రాష్ట్రాల నెట్ రెవెన్యూ షేర్ లను తేల్చడం, కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో వారి వివరాల సేకరణ వల్ల బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. తునికాకు సేకరించే కూలీల పేర్లు, బ్యాంక్ ఖాతాల వివరాల సేకరణ పూర్తైందని, దాదాపు రూ. 233 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉందని చెప్పారు.

వేసవిలో సుమారు 2. 50 లక్షల మంది గిరిజన, గిరిజనేతర కూలీలకు ఆదాయం సమకూర్చిపెట్టే తునికాకు సేకరణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అడవిపై స్థానిక ప్రజలకే పూర్తి హక్కులు ఉన్నాయని, అటవీ సంపదపై వచ్చే ఆదాయం కూడా ఆ ప్రాంత ప్రజలకే చెందాలనే ఉద్దేశ్యంతో రాయల్టీ డబ్బులను కూలీలకు బోనస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అటవీ శాఖ స్పెషల్ సిఎస్ శాంతికుమారి, పిసిసిఎఫ్ ఆర్.ఎం. డొబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ విసి & ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు పిసిసిఎఫ్ వినయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles