Friday, September 20, 2024

అప్పుడు రాసి..ఇప్పుడు వద్దంటారా..!:మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

‘చెరువులే మన భాగ్యవనరులు‘ అని పత్రికల్లో మంత్రిగా వ్యాసాలు రాసిన హరీష్ రావు ఇప్పుడు హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ కోసం ఆవిర్బవించిన హైడ్రాను ఆడిపోసుకోవడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.అనసూయ సీతక్క అన్నారు. నాడు చెరువుల పరిరక్షణపై సుభాషితాలు పలికి, ఇప్పుడు విమర్శలు చేయడం మీకే చెల్లిందని చురకలంటించారు. ‘గంగాళంలా ఉండే చెరువులు తాంబాళంలా మారినయి,.వాటిని తిరిగి గంగాళంగా మార్చుతాం’ అన్న నాటి మీ మాటలను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. చెరువుల పరిరక్షణపై రెండు నాల్కల మీ ధోరణిని విడనాడాలని సూచించారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారం అనుభవించిన మీరు హైదరాబాద్ చెరువులు విధ్వంసానికి గురవుతుంటే ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు.

చెరువుల పట్టణంగా వర్దిల్లిన హైదరాబాద్‌లోని చెరువులను చెరబట్టిన కబ్జాకోరులు వాటిని చెంబులుగా మార్చినప్పుడు మీరు నిర్లక్ష్యం చూపారని, మీ హయంలో రాజధానిలో వందలాది చెరువులు కనుమరుగమయ్యాయని అన్నారు. వర్షా కాలంలో వరద నీరు పోయే దారి, ఉండే దారి లేక ఏటా పదుల సంఖ్యలో ప్రజలను బలిగొన్నా మీరు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. చెరువోద్దారకులుగా చిత్రించుకునే మీ హయంలో హైదరాబాద్ చెరువులు సర్వనాశనం అయ్యాయన్న వాస్తవం అందరికి తెలుసునని అన్నారు. మిషన్ కాకతీయ పేరుతో హడావుడి చేసిన మీరు హైదరాబాద్‌లో ఒక్క చెరువును కూడా కాపాడ లేదని దుయ్యబట్టారు. వాటి సర్వేను పూర్తి చేయకుండా, వాటి హద్దులు గుర్తించకుండా కుట్రపూరితంగా వ్యవహరించిన మీ తీరును రాజ్యంగ బద్ద సంస్థ కాగ్ 2020లోనే తప్పుబట్టిందని మంత్రి సీతక్క గుర్తు చేశారు. మీ నిర్లక్షపు ఆనవాళ్లను నివేదిక రూపంలో ప్రజల ముందుంచిందని వివరించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకు కొమ్ముకాసి చెరువుల సహజ మరణానికి కారణమయింది మీ ప్రభుత్వమేనని విమర్శించారు. హైదరాబాద్ సమశితోష్ణస్థితిని కాపాడే చెరువులను బతికించుకోకపోతే ఉక్కపోత, వేడి, వరదలే హైదరాబాద్ కు శాపంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. ప్రకృతి ఆస్థులు, ప్రభుత్వ ఆస్థులు మిగిలితేనే హైదరాబాద్ కు భవిష్యత్తు అనే సదుద్దేశంతో మా ప్రభుత్వం హైడ్రాను ప్రారంభిస్తే ఆదిలోనే మీరు అడ్డుకునే ప్రయత్నం చేయడం హైదరాబాద్ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా విఘాతం కలిగించే అంశమని గుర్తించాలని మంత్రి సూచించారు. అందుకే చెరువులను చెరబట్టిన పెద్దలను కాపాడే మీ ప్రయత్నాలను మానుకుని, హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణకు నడుంబిగించిన ప్రజా ప్రభుత్వానికి సహకరించాలని పేర్కొన్నారు. లేకపోతే హైదరాబాద్ ప్రజల చీత్కారాలకు గురి కాకతప్పదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News