Saturday, December 14, 2024

నిమ్స్‌లో విద్యార్థినులను పరామర్శించిన మంత్రి సురేఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌: నగరంలోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజలను మంత్రి కొండా సురేఖ మంగళవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధవహిస్తుందని భరోసానిచ్చారు. వారిని ఓదార్చారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని నిమ్స్ డైరక్టర్ బీరప్ప, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్, నెఫ్రాలజీ గంగాధర్ లు మంత్రికి సునిశితంగా వివరించారు.

వారికి అందిస్తున్న చికిత్స వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా వసతి, భోజన సదుపాయాలను కల్పించాలని నిమ్స్ డైరక్టర్‌కు మంత్రి సురేఖ సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ చికిత్స పొందుతున్న ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం స్థిమితపడుతండగా, మరొక విద్యార్థికి ఇంటెన్సివ్ చికిత్సను అందిస్తున్నారని మంత్రి తెలిపారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులు హాస్టల్‌లో పెట్టిన ఆహారంతో అస్వస్థతకు గురి కాలేదని, ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాలు తినడం వలనే అస్వస్థతకు గురయ్యారని, అదే ఆహారాన్ని తిన్న సిబ్బంది ఆరోగ్య పరిస్థితి బాగానే వున్నట్లు అధికారులు తెలిపారని మంత్రి సురేఖ వివరించారు. ఏదేమైనప్పటికీ పరీక్షకు పంపిన ఆహారపదార్థాల రిపోర్టులు వచ్చాక ఈ సంఘటనకు బాధ్యులు అధికారులని తేలితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు.

హరీశ్‌రావు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ఏదో సాకు దొరికింది కదా అని ప్రభుత్వంపై బురదజల్లేలా మాట్లాడారని మంత్రి సురేఖ ఆరోపించారు. వాస్తవావస్తవాలు తెలుసుకోకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హాస్టళ్ళ నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. విద్యారంగ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలతో కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటులో ఎంతో నిబద్ధతతో ముందుకు వెళుతున్నారని మంత్రి అన్నారు. విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ రంగాలపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎంతో కచ్చితమైన ప్రణాళికతో పనిచేస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, అర్థరహితంగా ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకోవద్దని సూచించారు.

విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి

ఇప్పటి వరకు తను తెలిసిన సమాచారం ప్రకారం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో వేర్వేరు సంఘటనల్లో 36 మంది విద్యార్ధులు వివిధ కారణాలతో చనిపోయారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. 36 మంది విద్యార్థుల మరణాలు ఆంటే చిన్న విషయం కాదని, ఏవరేజ్ గా నెలకు ముగ్గురు ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థులు మరణిస్తున్నారంటే ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలని కోరారు. వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కి గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు.

దాదాపు 600 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ ఫాయిజనింగ్ బారిన పడ్డారని, పాములు, ఎలుకల కాట్ల ఘటనలు తరచుగా జరుగుతున్నాయని అన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించినట్లు తెలిపారు. ఎనిమిదో తరగతి బాలిక మహాలక్ష్మి, తొమ్మిదో తరగతి బాలిక జ్యోతి లను మెరుగైన చికిత్స కోసం నిమ్స్ తరలించారని తెలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని తెలిపారు. మహాలక్ష్మి కోలుకున్నా జ్యోతి ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 9వ తరగతి చదువుతున్న శైలజ అనే బాలిక వెంటిలేటర్‌పై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని తెలిపారు. గత పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో తల్లి తండ్రుల నమ్మకాన్ని పోగొట్టే విధంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల లో పరిస్థితులు దిగజారాయని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News