Tuesday, November 28, 2023

మహిళలతో నేలపై కూర్చుని మంత్రి దంపతుల భోజనాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మహబూబాబాద్: దేశానికి తెలంగాణ పల్లెలు పట్టుగొమ్మలుగా మార్చేందుకు గతంలో ఎన్నడూ లేనిరీతిలో గ్రామాల అభ్యున్నతికోసం విపరీతంగా నిధులు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో తొర్రూరు మండలం చింతలపల్లి, హచ్చుతండా, కొమ్మనపల్లి తండా గ్రామాలను కలిపి చింతలపల్లిలో, గుర్తూరు, సోమారం, జమిస్తాన్‌పురం గ్రామాలను కలపి సోమారంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మెళనాలు కార్యక్రమాలకు మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిధిగా, ఆత్మీయ అతిథిగా ఆయన సతీమణి ఉషాదయాకర్‌రావులు పాల్గొన్నారు. పెద్దెత్తున పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు సమ్మెళనాలకు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను ముఖ్య నాయకులు, కార్యకర్తల ద్వారా మాట్లాడించి అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి సందేశాన్ని చదివివినిపించారు. కార్యక్రమాలను ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యాను. సీఎం కేసీఆర్ దయవల్ల మంత్రినయ్యానని వివరించారు. గ్రామాలను అభివృద్ది పర్చే అదృష్టం నాకు కలిగింది. ఒక్కో గ్రామానికి కోటి రూపాలయులకు పైగా నిధులు ఖర్చు చేస్తూ గ్రామ సమగ్రాభివృద్ది చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక మహిళలు, యువత ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు.

మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పాలకుర్తి నియోజకవర్గంలోనే పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టామన్నారు. అలాగే యువతకు కూడా ఉచిత శిక్షణా శిభిరాలు, ఉద్యోగ మేళా కార్యక్రమాల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కల్పించే బృహత్తర ప్రక్రియకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. పాలకుర్తి నియోజకవర్గంలో పదివేల మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యం పెట్టుకున్నామన్నారు. అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ అని ఎంత చేసినా.. చేయాల్సింది ఇంకా ఉంటుందన్నారు. అర్హులైన పేదలందరికీ ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతామని నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి పేర్కోన్నారు.

నా దృష్టికి తెచ్చిన సమస్సలు పరిష్కరిస్తా..

ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి జరగాల్సిన అభివృద్ది చేస్తానని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ మేరకు ఇండ్లు, ఫించన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు, కొన్ని సామాజిక కులాలకు కమిటీ హాళ్లు, దేవాలయాల అభివృద్దిపై కూడా అక్కడికక్కడే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

తండాలు, గూడాలను గ్రామపంచాయితీలు చేశాం..

రాష్ట్రంలో కొత్త పంచాయితీరాజ్ చట్టం రావడంతోపాటు 3146 గూడాలు, తండాలను కొత్తగా గ్రామపంచాయితీలుగా మార్చామని తెలిపారు. స్థానిక సంస్థల చరిత్రలో తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినన్ని నిధులు గతంలో ఎప్పూడూ రాలేదన్నారు. సీఎం దూరదృష్టితో కేంద్ర ఫైనాన్స్ కమీషన్ నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు అందాయన్నారు. అతి తక్కువ జనాభా కలిగిన గ్రామానికి కూడా రూ. ఐదు లక్షలకు తగ్గకుండా నిధులు కేటాయించబడ్డాయన్నారు. బృహత్ పల్లెప్రకృతి కార్యక్రమాల ద్వారా అన్ని గ్రామాల్లో నర్సరీలు, వనాలు, క్రీడాప్రాంగణాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు అయ్యాయని వివరించారు. గ్రీనరి పెరిగి కల్లాలు, రైతు వేధికలు వచ్చాయని, ప్రతీ గ్రామంలో ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందుబాటులోకి రావడంతో ఏ ప్రమాణాల ప్రకారంలోనైనా రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని మంత్రి పేర్కోన్నారు. ఇంటింటి శుద్ది చేసిన తాగునీరు మిషన్ భగీరథ ద్వారా అందుతున్నాయన్నారు. పారిశుద్యం మెరుగుపడడంతో పాటు సాగునీరు, ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇరవైనాలుగు గంటలపాటు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రబుత్వానిదే అని స్పష్టం చేశారు.

ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి వరాలు..

ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ప్రజలతో మమేకమై కలియతిరుగుతూ వారితో కలసి నేలపై కూర్చోని భోజనాలు కూడా తన సతీమణి ఉషాతో చేయడం విశేషం. ఆత్మీయంగా ప్రతీ ఒక్కరినీ పలుకరిస్తూ వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. అంతేకాకుండా చింతలపల్లి గ్రామానికి దుర్గమ్మ గుడికి, మహిళా భవనానికి, గ్రామ పంచాయితీ భవనానికి నిధులు మంజూరుచేస్తామని ప్రకటించారు. ఆయా గ్రామాల్లో పదో తరగతి పూర్తి చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. అంజనేయస్వామి గుడికి, బొత్తల తండాలో దుర్గమ్మ గుడికి, అంతర్గత రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చిరు. ఉషాదయాకర్‌రావు మంట్లాడుతూ.. గతంలో ఎన్నికలప్పుడే నాయకులు మాయ మాటలు చెప్పేవారు. కానీ ఈరోజు కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుల వల్ల గ్రామాలు అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ఎవరో ఏదో చెప్పారని వారి మాయ మాటలు నమ్మి మోసపోకండి అని పేర్కోన్నారు. దయన్నా మీకు ఎంతో చేశారు. ఇంకా చేసే మనోదైర్యాన్ని, అవకాశాలను ఇవ్వండి అని కోరారు. నేను, దయాకర్‌రావులు కలసి నియజకవర్గ అభివృద్దికి పాటుపడుతున్నామని చెప్పారు.

మహిళలతో కలసి ఆత్మీయ సహంపక్తి భోజనాలు..

బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి దంపతులు మహిళలతో కలసి నేలమీద కూర్చోని సహంపక్తి భోజనాలు చేశారు. మహిళలతో ముచ్చటిస్తూ సరదాగా గడుపుతూ కూరలో ఉప్పు, కారం సరిపోయిందా.. అంటూ అప్యాయంగా పలుకరిస్తూ మంత్రి దంపతులు మమేకమైయ్యారు. ఈ కార్యక్రమాల్లో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత, రైతు, మహిళా విభాగం నాయకలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News