Saturday, March 22, 2025

ముంచుకొస్తున్న గడువు.. తేలని అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

రేపటితో ముగియనున్న ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల నామినేషన్ గడువు ఇంకా అభ్యర్థులను
ఖరారు చేయని ప్రధాన పార్టీలు ఏ క్షణాన్నయినా నలుగురు అభ్యర్థులను ప్రకటించే అవకాశం
ఎంఎల్‌సి బరిలో ఇద్దరు బిఆర్‌ఎస్ అభ్యర్థులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు సోమవారం(మార్చి 10)తో ముగియనున్నది. ఇప్పటివరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ కోటా ఎంఎల్‌సి అభ్యర్థులను ఖరారు చేయలేదు. తాజా రాజకీయ పరిణామాలు, ఎంఎల్‌ఎల సంఖ్య బలాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో నాలుగు సీట్లను అధికార కాంగ్రెస్, ఒక స్థానం ప్రతిపక్ష బిఆర్‌ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది. కాగా, నామినేషన్ దాఖలు గడువు సమీపిస్తున్న నేపథ్యం లో కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే పలువురు అభ్యర్థుల ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు ఎంఎల్‌సి స్థానాలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కెసి వేణుగోపాల్,

మీనాక్షి నటరాజన్ తదితరులతో సిఎం ఆదివారం ఉదయం ఫోన్‌లో సంప్రదింపులు జరిపిన తరువా త ఏ క్షణాన్నయినా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికలలో బిఆర్‌ఎస్ తరపున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. బిఆర్‌ఎస్‌కు ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎంఎల్‌సి సీటు వస్తుంది. కానీ రెండో అభ్యర్థిని నిలబెట్టాలం టే పార్టీని వీడి వెళ్లిన ఎంఎల్‌ఎలు కూడా బి ఆర్‌ఎస్ రెండో అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఒక అభ్యర్థి ఇప్పటికే పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. రెండో అభ్యర్థిపైనా అధినేత కెసిఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం.

బిఆర్‌ఎస్ పార్టీ మొత్తం 39 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ వల్ల అక్కడ సీటును కోల్పోయింది. మిగిలిన 38 మందిలో పదిమంది ఎంఎల్‌ఎలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం గులాబీ పార్టీకి 28 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. పార్టీని వీడిన వారందరూ అధికార పార్టీకి మద్దతు ఇస్తారా..? లేక తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మళ్లీ సొంత పార్టీకి అండగా నిలుస్తారా..? అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రాథమికంగా ఒక ఎంఎల్‌సి స్థానంలో మాత్రం సత్యవతి రాథోడ్‌కు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. బిసి వాదంపై చర్చోపచర్చలు నడుస్తున్న నేపథ్యంలో దాసోజు శ్రవణ్ లేదా సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

మార్చి 29 నాటికి ముగియనున్న ఎంఎల్‌సిల పదవీకాలం
రాష్ట్రంలో మార్చి 29 నాటికి ఐదుగురి ఎంఎల్‌సిల పదవీకాలం ముగియనుంది. పదవీకాలం ముగిసే వారిలో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ స్థానాలకు ఈనెల 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుదని ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News