Wednesday, May 29, 2024

ఆ వ్యాఖ్యలు ముస్లింలనుద్దేశించి కాదు

- Advertisement -
- Advertisement -

పేద కుటుంబాలలోనే అధిక సంతానం ఉంది
హిందూ-ముస్లిం అంటూ మాట్లాడిన రోజున ప్రజా జీవితానికి అర్హుడిని కాను
ముస్లింలలో నా ప్రతిష్టను ప్రత్యర్థులు నాశనం చేశారు
మా ఇంట్లో ముస్లిం కుటుంబాలు ఉండేవి
ఇప్పటికీ నాకు ముస్లిం మిత్రులు ఉన్నారు
ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్ ఇంటర్వూలో ప్రధాని మోడీ స్పష్టీకరణ

వారణాసి: చొరబాటుదారులు, ఎక్కువమంది సంతానం ఉన్నవారు అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం వివరణ ఇచ్చారు. తాను కేవలం ముస్లింల గురించి మాత్రమే మాట్లాడలేదని, పేద కుటుంబాల గురించి మాట్లాడానని ఒక ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ప్రధాని స్పష్టం చేశారు. హిందూ-ముస్లిం అంటూ తాను మాట్లాడిన రోజున తాను ప్రజా జీవితానికి అర్హుడిని కానని మోడీ ప్రకటించారు. ముస్లింల పట్ల చూపే ప్రేమను తాను మార్కెటింగ్ చేసుకోనని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఓటు బ్యాంకు కోసం పనిచేయనని, తాను సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ను నమ్ముతానని ఆయన చెప్పారు. ఎక్కువ మంది సంతానం గురించి మాట్లాడిన ప్రతిసారి ఆ ప్రస్తావన ముస్లింల గురించే అని మీకు ఎవరు చెప్పారు? ముస్లింల పట్ల ఎందుకు ఇంత అన్యాయంగా ఉంటున్నారు? పేద కుటుంబాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. పేదరికం ఉన్న చోట ఎక్కువ మంది పిల్లలు ఉంటారు.

వారి సామాజిక నేపథ్యం ఏదైనా కానివ్వండి. నేను హిందువులు లేదా ముస్లింలు అని ఎప్పుడూ ప్రస్తావించలేదు. స్తోమతను బట్టే సంతానం సంఖ్య ఉండాలని మాత్రమే నేను చెప్పాను. మీ పిల్లల సంరక్షణను ప్రభుత్వం తీసుకునే పరిస్థితి తీసుకురానివ్వకండి అని ప్రధానిస్పష్టం చేశారు. గుజరాత్‌లో గోద్రా రైలు దగ్ధం ఘటన అనంతరం జరిగిన అల్లర్ల గురించి ప్రస్తావిస్తూ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2002(గోద్రా అల్లర్లు) తర్వాత ముస్లింలలో తన ప్రతిష్టను ప్రత్యర్థులు నాశనం చేశారని ప్రధాని చెప్పారు. ఇది ముస్లింలకు సంబంధించిన సమస్య కాదు. కొందరు ముస్లింలు మోడీకి మద్దతుగా ఉన్నప్పటికీ ఇది చేయండి..అది చేయండి అంటూ ప్రభంజనంలా జరిగే ప్రచారం వారిపై ప్రభావం చూపుతుంది.

మా ఇంట్లో నా చుట్టూ ముస్లిం కుటుంబాలే ఉండేవి. మా ఇంట్లో ఈద్ కూడా జరుపుకునేవారం. ఇతర పండుగలు కూడా మా ఇంట్లో జరిగేవి. ఈద్ రోజున మా ఇంట్లో వంట ఉండేది కాదు. అన్ని ముస్లిం కుటుంబాల నుంచి మా ఇంటికి భోజనం వచ్చేది. ఇప్పటికీ నాకు చాలా మంది ముస్లిం మిత్రులు ఉన్నారు. 2002 తర్వాత(గోద్రా) నా ప్రతిష్ట నాశనం అయ్యింది అని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ముస్లింలు మీకు ఓటు వేస్తారా అన్న ప్రశ్నకు ఈ దేశ ప్రజలు నాకు ఓటు వేస్తారు అని మోడీ జవాబిచ్చారు. హిందూ-ముస్లిం అంటూ నేను మాట్లాడిన రోజున ప్రజా జీవితంలో ఉండేందుకు నేను అర్హుడిని కాను. హిందూ-ముస్లిం అంటూ మాట్లాడను. ఇది నా ప్రతిజ్ఞ అంటూ ప్రధాని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News