Wednesday, February 21, 2024

తొమ్మిదేళ్ళు!

- Advertisement -
- Advertisement -

వరుసగా రెండుసార్లు దేశాధికార పీఠాన్ని అలంకరించిన ప్రధాని మోడీ పాలనకు ఈ నెల 30 తేదీతో తొమ్మిదేళ్ళు పూర్తి అవుతాయి. తల్లి నవమాసాలు మోసి నవనవలాడే బిడ్డను ప్రసాదిస్తుంది. ప్రధాని మోడీ నవ సంవత్సరాల ఏలుబడిలో ఎవరికి ఏ ఫలం అందిందో అందరికీ తెలిసిన విషయమే. అయినా మరొక్కసారి ఆ చేదు నిజాలను ప్రస్తావించుకోడం అవసరం. మోడీ ఉద్దేశంలో ప్రజలంటే అడుక్కు తినేవారు, తాము ఎటు తిరగమంటే అటు తిరిగేవారు తప్ప తమను ఆదరించి అధికారం అప్పగించిన వారు కాదు. తమ పార్టీకి ఎన్నికల విరాళాలుగా అపారమైన ధనరాశులిచ్చి ఓట్లు కొనుక్కోడానికి, ఓటర్లను మతం మత్తులో ముంచే భారీ ప్రచారాన్ని విజయవంతంగా చేపట్టడానికి తోడ్పడే కార్పొరేట్ శక్తులే అంటే అదానీ, అంబానీ వంటివారే ఆయనకు బాగా కావలసినవారు. వారి ముందు సాధారణ ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు అందరూ బలాదూరే.

మోడీ అధికారం చేపట్టిన (2014) నాటికి దేశం అప్పు రూ. 65 లక్షల కోట్లు కాగా, అదిప్పుడు రూ. 155.77 లక్షల కోట్లని (2023 మార్చి నాటికి) లెక్క. అయినా ప్రజలకు వీసమెత్తు సుఖమూ, శాంతి లేవు. పెట్రోల్, డీజెల్ లీటరు ధర రూ. 100 దాటిపోయి సాధారణ ప్రజల మూలుగులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. రష్యా నుంచి చవకగా అందివస్తున్న క్రూడాయిల్‌ను భారీగా దిగుమతి చేసుకొంటున్నాము. దాని ఫలితాన్ని మాత్రం మోడీ ప్రభుత్వం ప్రజలకు అందించడం లేదు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు దానిని అమ్మి అవి సొమ్ము చేసుకోడానికి తోడ్పడుతున్నది. ఆ సంస్థలు ఆ క్రూడాయిల్‌ను శుద్ధి చేసి అత్యధిక ధరలకు యూరపు దేశాలకు అమ్ముకొంటున్నాయి. యూరపు దేశాలు ఉక్రెయిన్ యుద్ధం పరంగా రష్యాను వ్యతిరేకించి దాని ఆయిల్‌ను కొనబోమని బహిష్కరించాయి.

అదే క్రూడాయిల్ ఇండియాలో శుద్ధి అయి తమకు వస్తుంటే ఆనందంగా స్వీకరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో 9.79 లక్షల ఉద్యోగాల ప్రకటిత ఖాళీలు వుండగా, ప్రధాని మోడీ మాత్రం అతి కష్టంగా లక్ష ఖాళీలను కూడా ఇంత వరకు భర్తీ చేయలేదని వార్తలు చెబుతున్నాయి. రోజ్‌గార్ మేళా పేరుతో ప్రధాని ఇస్తున్న ఉద్యోగ నియామక పత్రాలు గణనీయమైనవి కావని విమర్శకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని, మీరు ఇచ్చిన 71 వేల నియామక పత్రాలు అందులో ఎంత, ఏమేరకు అని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. తాను అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని 2013లో నరేంద్ర మోడీ వాగ్దానం చేశారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తూ ఇంకొక వైపు వివిధ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలంటూ లేని పరిస్థితిని సృష్టిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ వ్యవసాయమే వెన్నెముకగా వుంది.

అత్యధిక శాతం ప్రజానీకం దాని మీదనే ఆధారపడి బతుకుతున్నది. చిన్న, పెద్ద కమతాలను సాగు చేసుకొంటూ లేదా వాటిలో వ్యవసాయ కూలీలుగా ఉపాధి చేసుకొంటూ బతుకుతున్నారు. అటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ల దయాదాక్షిణ్యాల మీద విడిచిపెట్టడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం సిద్ధం చేసిన అతి పెద్ద కుట్రను రైతులే ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సమ్మె చేసి భగ్నం చేయగలిగారు. అందుకోసం మోడీ ప్రభుత్వం పార్లమెంటు చేత హడావిడిగా ఆమోదింప చేసిన మూడు చట్టాలను అతి కష్టం మీద రద్దు చేయించుకోగలిగారు. ఆ క్రమంలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా అనేక ప్రజా సమస్యలను మోడీ ప్రభుత్వం పరిష్కరించక పోగా తానే వాటిని సృష్టించి ప్రజలను భయోత్పాతంలో ముంచి వేసింది. ఇవన్నీ ఇలా వుండగా దేశ మౌలిక స్వరూపాన్నే మార్చివేసే పథకాన్ని అమలు పరుస్తున్నది. భిన్న మతాల , భాషల, ప్రాంతాల, సంస్కృతుల దేశంగా శతాబ్దాల తరబడి కొనసాగుతున్న భారత సంస్కృతిని ఒకే మత సంస్కృతిగా మార్చివేసి మైనారిటీలను రాచిరంపాన పెట్టే వ్యవస్థను నెలకొల్పడానికి సాగుతున్న దగా గురించి వివరించి చెప్పనక్కర లేదు.

ఆకాశంలో సగం వంటి మహిళా లోకాన్ని అడుగు బయటపెట్టకుండా నాలుగు గోడలకే పరిమితం చేసే దుష్ట ఆలోచన తెర వెనుక సాగుతున్నది. భారతీయ మహిళలు పురుషునికి దాస్యం చేయడమే సరైన పద్ధతంటూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేతే సెలవిచ్చిన సందర్భాలున్నాయి. ప్రజలకు తాత్కాలికంగా ఎదురవుతున్న ఆకలి, నిరుద్యోగం వంటి సమస్యలను ఎప్పుడైనా పరిష్కరించుకోవచ్చు. కాని సెక్యులర్ రాజ్యాంగాన్ని కొనసాగనిస్తూనే అది బోధిస్తున్న వైవిధ్యాన్ని బలి తీసుకోడం వల్ల దేశానికి అపరిమితమైన హాని కలుగుతుంది. అలాగే న్యాయ వ్యవస్థను తక్కువగా చూసే ధోరణిని బాహాటంగా ప్రదర్శిస్తున్నారు. ప్రజాసామ్యమంటే ప్రజల ప్రతినిధులకు సంపూర్ణ అధికారాన్ని అప్పగించడమేనని ఢిల్లీ పరిపాలనా వ్యవహారాలపై సుప్రీంకోర్టు సుస్పష్టంగా ఇచ్చిన తీర్పు ను ఆర్డినెన్స్ మార్గంలో కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం గొప్పతనాన్ని ఏమని పొగడగలం?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News