Thursday, June 13, 2024

అనుబంధ వారధి ‘జీవనది’

- Advertisement -
- Advertisement -

తెలుగు సాహిత్యంలో ఏక వస్తుకమైన కవిత్వపు సంకలనాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా అమ్మ, నాన్న మొదలైన కుటుంబ అనుబంధాలపై అనేక సంకలనాలు వచ్చాయి. స్త్రీ జీవితంలో అమ్మ పాత్ర ఎంత గొప్పదో, భార్య పాత్ర కూడా అంతే గొప్పది. భార్య కవిత్వ వస్తువుగా గతంలో స్మృతి సాహిత్యం వచ్చి ఉండవచ్చు కానీ అర్ధాంగి ఔన్నత్యాన్ని కీర్తిస్తూ రాసిన కవిత్వం అర్ధాంగికే అంకితం ఇచ్చిన సందర్భం నేనైతే గమనించలేదు. బహుశా కొండకచో ఉన్నా అత్యంత అరుదైన విషయమే అని చెప్పాలి. ఈ అరుదైన కవిత్వ సంపుటి ఇప్పుడు సూర్యాపేట నుంచి వెలువడింది. తెలుగు సాహిత్యంలో నిశ్శబ్దంగా సీరియస్ గా కవిత్వాన్ని రాస్తున్న జీ.వి ( గొడితాల వెంకటేశ్వర్లు ) ’జీవనది’ పేరుతో వెలువరించిన కవిత్వం రాశిలో చిన్నది కావచ్చు కానీ వాసిలో ఎన్నదగినది. తెలుగు సాహిత్య చరిత్రలో తన స్థానాన్ని పదిలపరుచుకునే అర్హత కలిగినట్టిది. తన వివాహ రజతోత్సవ కానుకగా తన శ్రీమతి సునితకు ఈ కావ్యం అంకితం ఇచ్చారు. ఈ కవిత్వం సార్వజనీనం. ప్రతి పాఠకుడు ఈ కవిత్వంలో తమ తమ అర్ధాంగిని దర్శిస్తారు.

ప్రాచీన కవులు కూడా స్త్రీని నదితో పోల్చారు. పురుషుడిని సముద్రంతో పోల్చారు. అభివ్యక్తి రూపం మారినా జీ.వి సైతం తన అర్ధాంగిని జీవనది తో పోల్చడం అత్యంత సముచితంగా కనిపిస్తుంది. భార్యను నిశ్శబ్దంగా నట్టింట్లో ప్రవహించే జీవనదిగా అభివర్ణిస్తారు. ‘సిరుల ఝరిగా నడిచి వచ్చి /ఇరుల దారిలో/ ఎన్ని కడగండ్లను కలుపుకుంతుందో!/ఇక్కట్ల దరులనుఒరుసుకుంటూ/ఓదార్పు కొంగు పరుచుకుంటూ/
ప్రవహిస్తూనే ఉంటుంది’ కష్టసుఖాలలో తోడునీడగా నిలిచే భార్య జీవిత ప్రయాణాన్ని నదీ ప్రవాహంతో పోల్చి చెప్పే అనేక ప్రతీకలు ఈ కవితలో కనిపిస్తాయి. ఈ కవి తనను తాను రెప్పల తీరం దాటని సముద్రంగా పోల్చుకుంటూ కిన్నెరసానిలా తనలో ఏకమయ్యే ఆమె తన జీవనది అని ప్రకటిస్తాడు. ‘శాంతి పావురం’ అనే కవితలో ‘నేను మంగళసూత్రం మాత్రమే ముడివేశానని/ ఆమె నన్ను మనస్సూత్రంతో ముడి వేసుకుందని‘ శబ్ద చమత్కారంతోతెలియజేస్తారు.

‘తొలిసారి తల్లి గూడు విడిచి నాతో ప్రయాణమై/ భుజం మీద వాలినప్పుడే తెలిసింది/ శాంతి పావురమని/ నాకున్న కాకి బలగంలో కోకిల ఆమె’ అంటూ తన అపారమైన ప్రేమను ప్రకటిస్తారు. స్త్రీలు సహజంగానే సహనమూర్తులు. కష్ట సుఖాలను సమంగా స్వీకరించగల ధీమంతులు. సంసారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు పురుషులు అసహనాన్ని ప్రకటించినా, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినా నిగ్రహంతో ముందుకు పోయే ఆత్మస్థైర్యం వారి సొంతం.‘రెండున్నర దశాబ్దాల సంసార సాగరంలో/ అప్పుడప్పుడు నేను ఆగ్రహ కెరటమయితే/ ఆమె ఎప్పుడూ అనుగ్రహ తరంగమే‘ (జమిలి పోగు) అని నిజాయితీగా స్త్రీ పురుష స్వభావాన్ని కవిత్వీకరించారు. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. నిజమే. స్త్రీ లేని ఇల్లు దిగులు గూడే. అందుకే/ ‘ఆమె వచ్చాకే వాకిలి అద్దమైంది. నిత్యం దుమ్ము గంధాన్ని అలుముకునే గడప ముఖం/ నేను నిద్ర లేవక ముందే ముఖం నిండా పసుపు పూసుకొని రాత్రి కురిసిన వలపు గీతాలన్నీ/ రంగవల్లులై ముంగిట్లో వాలేవి ‘( ఆమె వచ్చాక)/ ప్రతిరోజు ఉదయాన్నే ప్రతి ఇంటి గడప ముందు కనిపించే సుందర దృశ్యాన్ని ఈ కవితలో పాఠకుల మనోఫలకంపై అందంగా చిత్రించాడీ కవి. స్త్రీ లేని గృహంలో ఈ సుందర దృశ్యాన్ని ఊహించలేము. కవిత చివరిదాకా ఇట్లా ఇల్లాలు ఇల్లును సర్దుతున్న వైనాన్ని అందంగా వ్యక్తీకరిస్తూనే చివరలో ఓ బరువైన వాక్యంతో ఈ కవితను ముగిస్తారు.

‘ ఏమైనా/ ఆమె వచ్చాక/ నాకు మిగిలిన అందం ఆనందం/ నా వెంటే ఉంటుంది నేను పోయాక‘ కవిత్వ అల్లికలో నిపుణతను సాధించిన కవి మాత్రమే ఇట్లాంటి ముగింపు ఇవ్వగలడు. భర్త ఆరోగ్యాన్ని కాపాడడంలో భార్య నిత్యం అప్రమత్తురాలై ఉంటుంది. అందుకే భార్యను వైద్యురాలితో పోల్చాడు కవి/‘మెడలో స్టెతస్కోపు/చేతిలో కొలబద్ద లేదు కానీ/నన్ను నన్నుగా ఆరోగ్యీకరించడానికి/మధ్యాహ్నం డబ్బాలో/ఎంత పెట్టాలో ఏం పెట్టాలో/ తెలిసిన ఆమె చేతి చలువ/ అప్పుడప్పుడు నా కళ్ళను చెమరుస్తుంది’ భోజనం ముందు కూర్చునే వరకు కూడా ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో ఆలోచించలేని పురుషులకు ముందుచూపుతో వాళ్లకు ఇష్టమైనవి చేసి పెట్టడంలో ఇల్లాలు పడే శ్రమ వెలకట్టలేనిది. నిరంతరం పనిచేసే ఆ శ్రమజీవిని కవి అలారంతో పోల్చాడు. ఈ సంపుటిలో చమత్కారం మేళవించబడ్డ కవిత ‘మంచిదనీ’.ఈ కవిత ఎత్తుగడ పాఠకునికి ఆసక్తి కలిగిస్తుంది. నాకు తాగుడు అలవాటు లేదు అస్సలు అలవాటు లేదు అంటూ మొదలయ్యే ఈ కవితలో తన శ్రీమతి తాగమని బతిమాలుతున్నట్లు, తానే విరక్తిని కనపరుస్తున్నట్లు చివరిదాకా ఆసక్తిని కలిగిస్తుంది.

చివరకు శ్రీమతి తాగమన్నది మంచినీళ్లు అని తెలిసినప్పుడు పాఠకుడి ముఖంపై నవ్వు చుక్కలు మొలుస్తాయి. కవి సూక్ష్మ పరిశీలనను పట్టి చూపే కవిత ‘ఏ…’. సాధారణంగా పురుషులు తాము అధికులమనే భావంతో స్త్రీని రావే పోవే ఏందే అనే పదాలు వాడడం గమనిస్తూ ఉంటాం. ఈ పిలుపులో పురుష అహంకారం స్పష్టంగా ధ్వనిస్తుంది. అదే పదాన్ని స్త్రీ పురుషుడి పట్ల ఉపయోగించినప్పుడు ఎనలేని ఆప్యాయత కనబడుతుంది. ఈ చిన్న అంశాన్ని కవిత్వ వస్తువుగా జీవి అందమైన కవితను రాశాడు. వివాహమైన తొలి రోజుల్లో పుట్టిల్లు ప్రేమపూర్వకంగా ఇచ్చిన కానుకలు కొన్ని జీవితాంతం గుర్తుంటాయి అని చెప్పడానికి కవి తన శ్రీమతికి తన తండ్రి ఇచ్చిన జడగంటలు మరచిపోని జ్ఞాపకం గా తలపోస్తాడు.
సంసార రథానికి స్త్రీ పురుషులు రథచక్రాలు. జీవి స్త్రీ పురుషులను శబ్దార్థాలతో పోలుస్తూ తాత్విక ధోరణిలో అందమైన మినీ కవితను మన ముందు ఉంచారు. శబ్దమే ప్రధానం/ అర్థం అప్రదానం/శబ్ద రహిత అర్థం అర్థరహితమే/ శబ్దం నిశ్శబ్దమైతే/అర్థం ఎంత బలమైందైనా శూన్యమే/ అందుకే ఆమె నా శబ్దం / నేను ఆమె అర్థం మాత్రమే… ఈ కవితను ఎంతైనా వ్యాఖ్యానించవచ్చు. స్త్రీ లేని పురుషుడు అర్ధరహితం అని మర్మగర్భంగా ఈ కవితలో చెప్పారు. జీవీ వృత్తిరీత్యా తెలుగు పండితులు. పిల్లలకు వ్యాకరణం నేర్పుతున్నవారు.

జీవితాన్ని వ్యాకరణంతో అన్వయం చేసి ’జీవన వ్యాకరణం’ రచించారు. వ్యాకరణ సూత్రాలలో ఆలుమగల అనుబంధాన్ని అందంగా ఇనుమడింపజేశారు. ‘నేను ఆది నుండి నఞ్ తత్పురుషాన్ని /ఆమె తొలి నుండే బహువ్రీహి/అయినా ద్వంద్వమై/ ఏక’రూపకం’గా కలిసిన మాకు / ద్విగువుతో పండింది జీవితం ‘సమాసాలను జీవిత ప్రయాణాన్ని చెప్పడానికి ఎంత చక్కగా ఉపయోగించుకున్నాడో కదా! అట్లాగే అలంకారాలను, పద్య వృత్తాలను, సంధులను కూడా అలవోకగా జీవితానికి అన్వయింపజేశారు. కౌటుంబిక బంధాలను చక్కగా ఆవిష్కరించిన మరొక కవిత రక్తసంబంధం.
వృక్షం పచ్చగా ఉన్నప్పుడే/ చిగురించిన శాఖలు విశాలమవుతాయని/ వేళ్ళు అనుకున్న రక్తసంబంధాన్ని తెగ నరుక్కోవడం తెలివి తక్కువ తనమని సందేశం ఇస్తారు. జీవి ప్రగతి కాముకుడు. గతంలో వీరి కవిత్వమంతా సమాజ హితాన్ని కాంక్షించి అభ్యుదయ పథంలో సాగటమే నాకు తెలుసు. అందుకే జీవనది నన్ను కాస్త ఆశ్చర్యపరిచింది. ఇంతటి సామాజిక చింతనాపరుడిలో ఇంత గొప్ప భావుకుడు దాగున్నాడా అనిపించింది. అగ్ని ధారలు కురిపించిన దాశరథి అమృత జల్లులు కురిపించే ప్రేమ కవిత్వం సైతం రాశాడు. జీవిని చదివినప్పుడు దాశరథి గుర్తుకు రావడం అసహజమేమీ కాదు. వీరి కలం నుండి ఇప్పటికీ ఎన్నో గ్రంథాలు రావాల్సి ఉంది. ఇకముందు అయినా వీరి కవిత్వమంతా గ్రంథ రూపంలో తెలుగు సాహిత్యానికి అతి త్వరలో అందుతుందని ఆశపడుతున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News