Friday, April 26, 2024

వేయి ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న నాగార్జున..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, నిఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి(గ్రీన్ ఫండ్) ద్వారా రెండు కోట్ల రూపాయల చెక్ కు అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.

మన పరిసరాలు, రాష్ట్రం, దేశం కూడా ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎం.పీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలు సార్లు మొక్కలు నాటానాని నాగార్జున తెలిపారు. గత బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కార్యక్రమం సందర్భంగా అడవి దత్తతపై సంతోష్ గారితో చర్చించానని, ఆ రోజు వేదికపై ప్రకటించినట్లుగానే ఇప్పుడు అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు పార్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా అడవి దత్తతకు నాగార్జున ముందకు రావటాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. చెంగిచర్ల ఫారెస్ట్ బ్లాక్ లో దివంగత అక్కినేని నాగేశ్వర రావు పేరుపై అర్బన్ పార్కు అభివృద్దితో పాటు, ఖాళీ ప్రదేశాల్లో దశల వారీగా లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఈరోజు నుంచే ప్రారంభించనున్నట్లు ఎంపీ వెల్లడించారు. దేశంలో ఏ పెద్ద నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక్క హైదరాబాద్ కే ఉందని, రాజధాని చుట్టూ ఉన్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమిని పరిరక్షించటం, పునరుద్దరణ చేయటం, అర్బన్ పార్కుల ఏర్పాటుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తమ వంతు ప్రయత్నం చేస్తుందని సంతోష్ అన్నారు. దీనికోసం సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Nagarjuna Plant Saplings at Chengicherla Forest Area

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News