Thursday, October 10, 2024

అక్టోబర్ 16న విచారణకు రండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఇడి కేసులో అక్టోబర్ 16న విచారణకు హాజరు కావాలని సిఎం రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో మంగళవారం జరిగిన విచారణకు నిందితుడు మత్తయ్య జెరూసలేం హాజరు కాగా రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. నిందితులు ఎందుకు హాజరు కావడం లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ దశలో మంగళవారం విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు వేసిన పిటిషన్లను అనుమతించిన కోర్టు, అభియోగాల నమోదుపై విచారణ కోసం వచ్చే నెల 16 హాజరు కావాలని రేవంత్ రెడ్డితో పాటు నిందితులందరినీ ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలంటూ బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వేసిన పిటీషన్‌ను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసును భోపాల్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం లేదని, ఊహాజనితమైన అంశాలతో స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ వేశారని న్యాయస్థానం వెల్లడించింది. ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ కేసు విచారణ కొనసాగిస్తున్న నాంపల్లి న్యాయస్థానం మాత్రం తదుపరి విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించడం సంచలనంగా మారింది.

2015లో రాష్ట్రంలో జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో నామినేటేడ్ ఎంఎల్‌ఎ స్టీఫెన్‌సన్‌ను టిడిపికి మద్ధతుగా వ్యవహరించమని డబ్బు ఆశచూపిన ఆరోపణలపై అప్పటి టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై ఎసిబి కేసు నమోదు చేసిన విషయం విదితమే. స్టీఫెన్ సన్ ఇంట్లో రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో ఉన్నట్లు ఉన్న వీడియోలు అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీంతో కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ దీనిపై సుధీర్ఘంగా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగానే నాంపల్లి కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, సండ్ర వెంకట వీరయ్య, వేం కృష్ణ కీర్తన్‌కు సమన్లు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News