Thursday, May 2, 2024

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గణేష్ పేరును తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ పేరును అధికారికంగా ఏఐసిసి విడుదల చేసింది. గత ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీచేసిన నారాయణన్ శ్రీగణేశ్‌ను హస్తం పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. ఈమేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన బిఆర్‌ఎస్ నేత లాస్య నందిత ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనే ఈ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది. మరోవైపు బిఆర్‌ఎస్, బిజెపిలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.

మాజీ మంత్రి జె.గీతారెడ్డి శిష్యుడు శ్రీగణేశ్
మాజీ మంత్రి జె.గీతారెడ్డి శిష్యుడిగా సుపరిచితుడైన శ్రీగణేశ్ 2014 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం యత్నించారు. 2018 ఎన్నికల్లోనూ విశ్వప్రయత్నం చేశారు. అయితే ఆయనకు రెండుసార్లు నిరాశే ఎదురైంది. దాంతో చివరి నిమిషంలో కాషాయ కండువా కప్పుకొని, గత ఎన్నికల్లో బిజెపి టికెట్ తెచ్చుకున్నారు. అనంతరం ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు రావడంతో మల్కాజిగిరి ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో బిఆర్‌ఎస్‌లో చేరారు.

2023 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ తనకే దక్కుతుందని ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణం చెందడంతో ఆయన వారసురాలిగా కుమార్తె లాస్యనందితకు బిఆర్‌ఎస్ టికెట్ కేటాయించింది. దాంతో శ్రీగణేశ్ మళ్లీ బిజెపి కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 41 వేల ఓట్లు సాధించి, రెండోస్థానంలో నిలిచిన గణేష్ మరోసారి ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తారని బిజెపి శ్రేణులు భావించగా ఆయన అనూహ్యంగా హస్తం గూటికి చేరడం విశేషం.గద్దర్ కూతురు వెన్నెలకు కాకుండా శ్రీ గణేష్ కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

అద్దంకికి మళ్లీ నిరాశే!
అయితే కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్లు సమాచారం. కానీ అద్దంకి దయాకర్‌ను కాదనీ ఇటీవల బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ గణేష్‌కు ఏఐసిసి టికెట్ ఇచ్చింది. దీంతో టికెట్ ఆశించినట్లు తెలుస్తున్న అద్దంకి దయాకర్‌కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అద్దంకి తుంగతుర్తి టికెట్ ఆశించారు. చివరకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మందుల సామేల్‌కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. తర్వాత ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ అద్దంకి ఆశించారు. పార్టీ పెద్దలు సైతం అద్దంకి దయాకర్‌కు ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించి చివరి నిమిషంలో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్‌కు పార్టీ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయన టికెట్ ఆశించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News