Saturday, September 21, 2024

ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు

- Advertisement -
- Advertisement -

భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రకృతే ఆధారం. ఇది సృష్టి, స్థితి, లయలకు కారణమైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. ఈ రోజు మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450 కోట్ల సంవత్సరాలలో అభివృద్ధి చెందిందని జీవశాస్త్ర చరిత్ర చెబుతోంది. డార్విన్ సిద్ధాంతం ప్రకారం జీవ పరిణామానికి, జీవుల వికాసానికి ప్రకృతి పుట్టినిల్లు. మనం పీల్చేగాలి, తాగే నీరు, తినే ఆహారం, పండించే నేల, భూమిలోని ఖనిజాలు, రాయి, కాంతి, ఉష్ణం, చెట్లు, జంతువులు అన్నీ ప్రకృతిలో భాగాలుగా ఉంటూ సమతుల్యతను కాపాడుతున్నాయి. ప్రకృతి మన మనుగడకు తోడ్పడుతూ రోజువారీ జీవన వినియోగానికి ఉపయోగపడే అనేక అవసరాలను నిస్వార్థంగా తీరుస్తున్నది. అందుకే ప్రకృతిని తల్లి అని అంటారు. ప్రకృతి మనకు భౌతికావసరాలనే కాకుండా మానసికోల్లాసం, మనశ్శాంతి, మానసిక ఆరోగ్యం, రసాత్మకత అంతిమ ఆనందం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో భారతీయ పర్యావరణ సంస్కృతి మహోన్నతమైంది.

అనాది నుండి కూడా భారతీయులు ‘ప్రకృతిని ఆవిష్కరించుకోవడం ద్వారా మనల్ని మనం ఆవిష్కరించుకోవచ్చు’ అనే నైతిక తాత్విక చింతనను కలిగివుండి ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనే భావనతో ప్రకృతిని ఆరాధిస్తూ, కాపాడుతూ ప్రకృతితో సామరస్య జీవనం గడిపేవారు. కానీ ఈ చరాచర జగత్తులో భాగమైన నేటి ఆధునిక మానవుడు అభివృద్ధి, విలాసవంతమైన జీవితం, శాస్త్ర పురోగతిల నెపంతో నేడు తనతో పాటు ప్రకృతిలో కోట్లాది జీవరాశులున్నాయని, ప్రకృతి సమస్త జీవరాశుల ఉమ్మడి ఆస్తి అనే విచక్షణను కోల్పోయి ప్రకృతిపై దాడి చేస్తూ అడవుల విధ్వంసం, ఆవాస ప్రాంతాల విధ్వంసం జీవ వైవిధ్య విధ్వంసం లాంటి రకరకాల విధ్వంసాలకు పాల్పడుతున్నాడు. ఈ కారణంగా ప్రకృతి ప్రమాదంలోకి నెట్టివేయబడటంతో అసంఖ్యాక వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి.

జీవించే హక్కును సైతం హరించి వేస్తున్న ప్రకృతి విధ్వంసం అనే సమస్య అణుబాంబు కన్నా ప్రమాదకరమైనదని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచటానికి, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రతి సంవత్సరం జులై 28న ప్రపంచ ప్రకృతి సంరక్షణ దినోత్సవం (వరల్డ్ నేచర్ కంజర్వేషన్ డే) నిర్వహిస్తున్నాయి. గత సంవత్సరం ప్రకృతితో సామరస్య జీవనం గడపటం అనే నినాదంతో నిర్వహించగా, ఈ సంవత్సరం 28 జులై 2023 న ఫారెస్ట్స్ అండ్ లైవ్లీ హుడ్ -సస్టేనింగ్ పీపుల్ అండ్ ప్లానేట్ అనే ఇతివృత్తంతో ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

ఈ రోజు ప్రధానంగా అసాధారణ వాతావరణ మార్పులు, భూతాపం, తీవ్రమైన చలి, ఓజోన్ పొర క్షీణత, అడవుల కార్చిచ్చు, సునామీలు, కొండ చరియలు విరిగిపడటం, ఎల్ నినో, -లానినో పరిస్థితులు, హీట్ వేవ్స్, తుపానులు, వరదలు, కాలుష్యం, కోవిడ్ -19 లాంటి మహమ్మారి, వ్యాధులు ప్రబలడం వంటి తీవ్ర పర్యావరణ సమస్యలు, -పరిష్కార మార్గాలు, సహజ వనరుల సంరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణల గురించి చర్చనీయాంశాలుగా ఉంటాయి. ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సంస్థలతో పాటు జాతీయ పర్యావరణ పరిరక్షణ సంస్థలు కూడా 2030 సంవత్సరాన్ని మైలు రాయిగా ఎంచుకొని, వారు రూపొందిస్తున్న పలు పరిశోధన అంశాలతో కూడిన పర్యావరణ వ్యూహాల అమలు, వాటి లక్ష్యసాధనకు పాలకులు, ప్రజలు సమష్టిగా నిరంతరం కృషి చేయాలని లేనిచో సమీప కాలంలో ప్రకృతి విలయం తప్పదని చేస్తున్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

నేచర్ -2030 ప్రోగ్రామ్ అనేది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసియన్) అనే పర్యావరణసంస్థ ప్రవేశపెట్టిన ఒక బృహత్తరమైన ప్రకృతి సంరక్షణ కార్యక్రమం. ఐయుసియన్ అనేది 1400లకు పైగా ప్రభుత్వ, పౌరసమాజ సంస్థల సభ్యత్వం, 15000 లకు పైగా పర్యావరణ నిపుణులను కలిగిన ప్రపంచంలోని అతిపెద, అత్యంత వైవిధ్యమైన నెట్‌వర్క్ కలిగిన అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంది. ఈ సంస్థ ప్రతి నాలుగేండ్లకు ఒకసారి వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ( డబ్ల్యుసిసి) సమావేశాలను నిర్వహిస్తూ ప్రకృతి వనరులు జీవ వైవిధ్య సంరక్షణ, పునరద్ధరణలే లక్ష్యాలుగా పర్యావరణ వ్యూహాలను రూపొందిస్తూ ప్రపంచ దేశాలకు మార్గ నిర్దేశనం చేస్తుంది. ఒకే ప్రకృతి, -ఒకే భవిష్యత్తు (వన్ నేచర్ -వన్ ఫ్యూచర్ ) అనే నినాదంతో నేచర్ -2030 ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసి 2021-2030 కాలాన్ని ప్రకృతి పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది.

2020 తర్వాత వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ డైవర్సిటీ, సుస్థిరాభివృద్ధి అంశాల ప్రాతిపదికన నేచర్- 2030 ప్రోగ్రామ్ ఎజెండాను రూపొందించింది. ఈ పదేండ్ల కాల వ్యవధిలో 2030 నాటికి భూభాగం నీరు, సముద్రాలు, వాతావరణం, జీవ వైవిధ్యములను, మానవ ఆరోగ్యం, మానవ శ్రేయస్సులతో సమన్వయం చేసి సమగ్ర సుస్థిరాభివృద్ధి దిశగా ప్రోత్సహించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య లక్ష్యం. ఈ ప్రకృతి పరివర్తనాత్మక మార్పుకు రికగ్నైజ్, రిటేయిన్, రిస్టోర్, రిసోర్స్, రికనెక్ట్ అనే ఐదు (5 -ఆర్స్) క్రాస్ కటింగ్ వాహకాలు సహాయకారులుగా ఉపయోగపడుతాయి. ఈ నేచర్ -2030 ప్రోగ్రామ్ అజెండాలోని అంశాలను 2021 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌లోని మార్సెల్లిలో జరిగిన వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ సదస్సు ఆమోదించి ఈ ఎజెండా అంశాల అమలుకు ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాలని కోరింది.

ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవడంలో మానవుని ఘోర వైఫ్యల్యాన్ని నేటికీ పలు పరిశోధనలు, అధ్యయనాలు ఎత్తిచూపుతూనే ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం కంటే ముందు ఉష్ణోగ్రతతో పోలిస్తే సగటు ఉష్ణోగ్రత వచ్చే 2030 నాటికి 1.50 C మేర పెరిగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ ( డబ్లుయంఒ) తన ఆన్యువల్ క్లైమేట్ స్టాటస్ రిపోర్ట్- 2022లో పేర్కొంది. 2030 నాటికి భూభాగం, జల భాగాలలో కనీసం 30 శాతం భూభాగాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు 30 బై 30 ప్రణాళికను అమలు చేయాలని కెనడాలో జరిగిన మాంట్రియాల్ జీవ వైవిధ్య సదస్సు -2022 తీర్మానించింది. వాతావరణ దుష్ప్రభావం వల్ల ఎక్కువగా నష్టపోతున్న పేద, బలహీన దేశాలకు లాస్‌అండ్ డ్యామేజి ఫండ్‌ను అందించడం ద్వారా వాతావరణ న్యాయం కొరకు కృషి చేయాలని కూడా ఈ సదస్సు కోరింది.

Green India Challege by Joginapalli Santhosh Kumar

నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం వల్ల భూ ఉపరితలం వేడెక్కడమే కాకుండా సముద్రాల అడుగు భాగం కూడా వేడెక్కుతున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్ ఓషీయానిక్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ ( యన్‌ఒఎఎ) తన తాజా అధ్యయనం2023లో తెలిపింది. ఈ కారణంగా వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయని, కర్బన ఉద్గారాలైన కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్ హౌజ్ వాయువులు, ఉష్ణోగ్రతలు ఆందోళనకలిగించే స్థాయిలో పెరుగుతాయని, రుతువులు గతి తప్పుతాయని, సముద్ర మట్టాలు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సముద్రాలలో ఆమ్ల త్వం నానాటికీ పెరిగిపోయి దాదాపు 14% జీవులు అంతరించి పోతాయని ఆ నివేదిక తెలిపింది. భూతాపం హీట్ వేవ్స్ కారణంగా 2030 నాటికి ఆర్కిటిక్ మహాసముద్రం మంచు రహిత సముద్రం (ఐస్ ఫ్రీ ఓషన్) గా మారుతుందని లండన్ నుండి ప్రచురితమవుతున్న నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్, జూన్ 2023 సంచికలో పేర్కొంది.

ఫలితంగా భారీ ఎత్తున జీవులకు ముప్పు తప్పదని తెలుస్తోంది. ఈ భూగ్రహంపై ప్రకృతి వినాశనానికి మానవుడే ప్రధాన కారకుడని ఈ తాజా పరిశోధనలన్నీ కూడా తేటతెల్లంజేస్తున్నాయి. కనుక కనీసం 2050 నాటికైనా ప్రకృతితో సుస్థిరమైన సామరస్య జీవనం అనే ఆశయాన్ని సాధించుటకు 2030 సంవత్సరం నాటికి ప్రకృతి వనరుల విధ్వంసాన్ని, జీవ వైవిధ్య వినాశనాన్ని పూర్తిగా ఆపాలని అందుకు ప్రపంచ దేశాలన్నీ తగు కృషి చేయాలని యుఎన్‌ఒ ఇటీవల పిలుపునిచ్చింది. అందుకే ఇలాంటి ప్రకృతి విరుద్ధ వాతావరణ పరిస్థితులు మానవాళి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రస్తుత తరుణంలో మరింత అవగాహనతో పరిష్కార మార్గాలు కనబరచకపోతే ముందుతరాలు మనల్ని క్షమించవు.
ప్రకృతి మనల్ని రక్షించేది మాత్రమే కాదు, హద్దులు మీరితే ప్రకోపించి శిక్షిస్తుంది కూడా.

ఈ పర్యావరణ తాత్విక భావనను అర్థం చేసుకొని ప్రజలు, పాలకులు ప్రకృతి వనరుల శోషణకై తహతహలాడకుండా ప్రకృతి వనరుల పోషణకై తగు కృషి చేయాలి. ప్రపంచ దేశాలన్నీ పారిస్ పర్యావరణ ఒప్పంద ఒడంబడికలను అమలు పరచాలి. పేద, బలహీన దేశాలకు వాతావరణ న్యాయం (క్లైమేట్ జస్టిస్) కలుగుటకు తగు చర్య లు చేపట్టాలి. ప్రజల్లో శాస్త్రీయ సామాజిక బాధ్యతను (సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సీబిలిటీ) మరింత పెంచుటకు కృషి జరగాలి. అడవుల నరికివేతను, అటవి జంతువులను చంపటం అరికట్టాలి. చెట్లను విరివిగా నాటాలి. ఆదివాసీ చట్టాలను గౌరవించి చెట్ల పరిరక్షణ బాధ్యతను స్థానీకులకే అప్పగించాలి. వ్యవసాయంలో రసాయన ఎరువులు పెస్టిసైడ్స్, వీడిసైడ్స్‌లను విచ్చలవిడిగా వాడకుండా, సహజ ఎరువులు వాడి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.

పెరుగుచున్న జనాభాకు తగ్గట్టుగా సౌరశక్తి, పవనశక్తి, అలల శక్తి వంటి సాంప్రదాయేతర ఇంధన వనరులను అందుబాటులోకి తేవాలి. వాయు కాలుష్య నివారణకు పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉత్పత్తి చేయడం, వాడకంపై గల నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి. నీటి ఆహార వృథాను అరికట్టాలి. పర్యావరణ ఉద్యమాలలోని ప్రజా సంక్షేమ అంశాలకు తగ్గట్టుగా తగు నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు ప్రజలకు వన మహోత్సవం, స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ టైగర్ మాంగ్రూవ్స్ ఫర్ ఫ్యూచర్, ప్రాజెక్ట్ ఎలిఫాంట్ క్రోకడైల్ ప్రాజెక్ట్ సీటర్టిల్ ప్రాజెక్ట్ సహజ వనరుల పొదుపు, ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ కాలుష్యం వంటి ప్రకృతి సంరక్షణ అంశాలపై సదస్సులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

3 -ఆర్స్ సూత్రంలోని రెడ్యూస్, రియూజ్, రీ సైకిల్ పద్ధతులు మనిషి నిరంతర జీవితంలో భాగం కావాలి. రేకును తుంచి పువ్వు అందాన్ని ఎప్పటికీ ఆస్వాదించలేము అన్న ప్రముఖ భారతీయ తత్వవేత్త రవీంద్రనాథ్ టాగోర్ మాటలు ఎంత సత్యమో ప్రకృతి వినాశనానికి పాల్పడుతూ మానవుడు భద్రంగా జీవించలేడు అన్నది కూడా అంతే నిజం. కావున ‘ప్రకృతిని జయించాలి’ అనే ఆలోచనను మానుకొని నూతన హరిత సాంకేతిక ఆవిష్కరణలతో ప్రకృతి సంరక్షణకు, పర్యావరణ పునరుద్ధరణకు, పునఃప్రతిష్టకు పాటుపడుతూ ప్రకృతితో కలిసి సామరస్య జీవనం గడపటమే ప్రథమ కర్తవ్యంగా భావించి ఆచరించినపుడు మానవుడు ప్రకృతిలో సుదీర్ఘ కాలం భద్రంగా జీవించగలడు.

డా. భారత రవీందర్
9912536316

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News