Thursday, April 25, 2024

ఖేల్ రత్న పురస్కారాల ప్రదానం

- Advertisement -
- Advertisement -

Neeraj, Mithali receiving the Khel Ratna Award

ఖేల్ రత్నలకు పురస్కారాలు
అవార్డులు అందుకున్న నీరజ్, మిథాలీ

న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుతో పాటు అర్జున, లైఫ్ ఎచీవ్‌మెంట్ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి విజేతలకు అవార్డులను అందజేశారు. టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్, ఒలింపిక్ పతక విజేతలు రవికుమార్, లవ్లీనా, శ్రీజేష్ తదితరులు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక క్రీడా అవార్డులను అందుకున్నారు. ఈ క్రమంలో నీరజ్, రవికుమార్, లవ్లీనా బొర్గొహెన్, శ్రీజేష్, అవని లక్రా, సునీల్ ఛెత్రి, మన్‌ప్రీత్ సింగ్, కృష్ణ నగార్, సుమిత్, ప్రమోద్, మనీశ్, మిథాలీరాజ్‌లకు రాష్ట్రపతి ప్రతిష్టాత్మకమైన ఖేల్ రత్న పురస్కారాలతో సత్కరించారు. వీరంత అవార్డులతో పాటు ప్రశంస పత్రాలను స్వీకరించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 12 మంది క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డులను పొందిన వారిలో ఎక్కువ మంది టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారే ఉన్నారు. టోక్యో క్రీడల్లో జావెలిన్‌త్రో విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అతనికి ప్రతిష్టాత్మకమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారంతో సత్కరించారు. ఇక మహిళల క్రికెట్‌లో ఎన్నో చారిత్రక రికార్డులను సొంతం చేసుకున్న దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అంతేగాక భారత పురుషుల ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సునీల్ ఛెత్రికి కూడా ఖేల్ రత్న పురస్కారం దక్కింది. వీరంతా శనివారం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.

మరోవైపు క్రికెటర్ శిఖర్ ధావన్, బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్, దీపక్ పునియా (రెజ్లింగ్), అంకిత రైనా (టెన్నిస్), సందీప్ నర్వాల్ (కబడ్డీ), అభిషేక్ వర్మ (షూటింగ్) తదితరులు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డులను అందుకున్నారు. పారా అథ్లెట్లు, యోగేశ్ కతిరియా, నిషద్ కుమార్, ప్రవీణ్ కుమార్, సుహాస్ యతిరాజ్, సింగ్‌రాజ్ అదానా తదితరులకు అర్జున అవార్డులతో సత్కరించారు. మరోవైపు సుబ్రమణియన్ రామన్ (టిటి), జై ప్రకాశ్ (పారా షూటింగ్), టిపి జోసెఫ్ (అథ్లెటిక్స్), సర్కార్ తల్వార్ (క్రికెట్), అషాన్ కుమార్ (కబడ్డీ), తపన్ కుమార్ పాణిగ్రాహి (స్విమ్మింగ్), రాధాకృష్ణన్ నాయర్ (అథ్లెటిక్స్), సంధ్య (బాక్సింగ్), ప్రీతమ్ సివాచ్‌కి (హాకీ) తదితరులకు ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. కోచ్‌లుగా అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దినందకు వీరికి ఈ అవార్డులతో రాష్ట్రపతి సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News