తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, తన ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక వారసత్వంతోపాటు, విద్యా దేవత శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి కొలువై ఉన్న పుణ్యభూమి. అయితే, దశాబ్దాలుగా ఈ ప్రాంతం ఉన్నత విద్యావకాశాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటోంది. ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా కాకుండా, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, జ్ఞాన ఆధారిత సమాజ నిర్మాణం, ముఖ్యం గా ఏజెన్సీ ప్రాంతంలోని బడుగు, బలహీన వర్గాలు, ఆదివాసుల ఆత్మగౌరవానికి సంబంధించిన కీలక అంశంగా పరిగణించాలి. ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు, ముఖ్యంగా ఆదివాసీ, బిసి, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉన్నత చదువులకోసం ఇతర జిల్లాలకు, నగరాలకు వెళ్లడం వారి కుటుంబాలపై తీవ్ర ఆర్థికభారాన్ని మోపుతోంది.
ప్రయాణ ఖర్చులు, వసతి, ఇతర జీవన వ్యయాలు గ్రామీణ, పేదకుటుంబాలకు పెనుభారంగా మారి, చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. నిర్మల్ జిల్లా పాలకుల నిర్లక్ష్యం (Negligence Nirmal district administration) వల్ల, ఉన్నత విద్య బడుగు బలహీన వర్గాలకు అందనంత దూరంలో కనుమరుగవుతోంది. ఇది కేవలం ఆర్థిక భారం మాత్రమే కాదు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఇతర విశ్వవిద్యాలయాల్లో చేరడం వల్ల, వారి మేధస్సు, నైపుణ్యాలు స్థానిక అభివృద్ధికి కాకుండా ఇతర ప్రాంతాలకు ఉపయోగపడుతున్నాయి. ఇది జిల్లాకు ఉండాల్సిన మానవ వనరుల సంపదను కోల్పోవడానికి దారితీస్తోంది. ఉన్నత విద్యా సంస్థల లేమి పరిశోధన, ఆవిష్కరణలకు అడ్డుకట్ట వేస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారానికి, వనరుల సద్వినియోగానికి అవసరమైన నూతన ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం లేదు.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రత్యేకతలు, సంస్కృతి, భాష, జీవన విధానాలపై పరిశోధనలు జరగకపోవడం వల్ల అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. స్థానికంగా ఉన్నత విద్య లేకపోవడం వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా లభిస్తున్నాయి. ఇది నిరుద్యోగానికి, యువతలో అసంతృప్తికి దారితీస్తోంది. ఆదివాసీ, బహుజన యువతకు విద్య ద్వారా లభించాల్సిన అవకాశాలు దూరమవుతున్నాయి. రాష్ట్రంలోనే కొన్నిప్రాంతాలు విద్యాపరంగా అభివృద్ధి చెందుతుండగా, ఆదిలాబాద్ వంటి జిల్లాలు వెనుకబడిపోవడం ప్రాంతీయ అసమానతలను పెంచుతోంది. ఇది బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోంది. ఒక విశ్వవిద్యాలయం కేవలం విద్యను అందించే కేంద్రం మాత్రమే కాదు. అది జ్ఞాన ఉత్పత్తి కేంద్రం; పరిశోధనలు, కొత్త ఆలోచనల ద్వారా జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది.
ఆధునిక అవసరాలకు తగిన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తుంది. ఇది ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుంది; స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది, ఉద్యోగాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా గిరిజన యువతకు స్థానికంగా నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం కల్పిస్తుంది. విశ్వవిద్యాలయం సామాజిక చైతన్యాన్ని పెంచుతుంది; చర్చలు, మేధోమథనంద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఇది సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తుంది; స్థానిక గిరిజన కళలు, సంస్కృతి, భాష, చరిత్రపై పరిశోధనలు చేసి వాటిని పరిరక్షిస్తుంది. ఇది వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటుతుంది. గిరిజన విద్యార్థులు తమ సొంత సంస్కృతి, చరిత్రను అధ్యయనం చేయడానికి, దానిని భవిష్యత్ తరాలకు అందించడానికి ఈ విశ్వవిద్యాలయం ఒక వేదిక అవుతుంది.
ఆదిలాబాద్ జిల్లాకు విశ్వవిద్యాలయం అనే డిమాండ్ నేటిది కాదు, దశాబ్దాలుగా ఇది ఒక ఆకాంక్షగా కొనసాగుతోంది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి నిర్మల్ పీజీ కళాశాలను శ్రీజ్ఞాన సరస్వతీ విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరించడానికి నిధులు మంజూరు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. అయితే, దురదృష్టవశాత్తు, ఆయన అకాల మరణం, తదనంతర స్వార్థ రాజకీయాలు ఈ ఆశలను అడియాశలు చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, ఈ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, స్థానిక నాయకుల ఒత్తిడితో స్థలం మార్చడం, ఆపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ప్రతిపాదన వెనక్కి పంపబడింది. ఇది కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, స్థానిక ప్రజల ఆకాంక్షలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం. పదేళ్లకాలంలో రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడినా, ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు కాకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా పర్యటనల్లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క, అధికారులకు ఆదేశాలు జారీచేయడం ఆశలు రేకెత్తించాయి. అయితే, ఖమ్మం లో మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరించే ప్రక్రియ వేగంగా జరుగుతుండగా, ఆదిలాబాద్ విషయంలో జాప్యం జరగడం జిల్లాపట్ల కొనసాగుతున్న వివక్షను, బహుజనుల అభివృద్ధిని అడ్డుకుంటున్న పాలకుల వైఖరిని స్పష్టం చేస్తోంది. నిర్మల్ పట్టణంలోని ప్రస్తుత పిజి కళాశాల భవనాలు, 25 ఎకరాల అందుబాటులో ఉన్న స్థలం నూతన విశ్వవిద్యాలయానికి అనుకూలమైన ప్రదేశం. ఇది మౌలిక సదుపాయాల కల్పనకు తక్కువ సమయం, వ్యయం తీసుకుంటుంది. శ్రీ జ్ఞాన సరస్వతీ విశ్వవిద్యాలయం కేవలం ఒక విద్యా సంస్థ కాదు, అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల, ముఖ్యంగా గిరిజనుల, బడుగు బలహీనవర్గాల ఆత్మగౌరవానికి, భవిష్యత్తుకు ప్రతీక.
ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. లేనిపక్షంలో శ్రీజ్ఞాన సరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ఉద్యోగులు, విపక్ష నాయకులతో కలిసి జిల్లావ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం అనివార్యం. గిరిజనుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఈ ఉద్యమం సాగుతుంది. మంజూరు జరిగి, నిధులు విడుదలై, పనులు ప్రారంభమై, విశ్వవిద్యాలయం ఏర్పడే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటం ద్వారా, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తమ భవిష్యత్తును తామే రాసుకోవడానికి, జ్ఞాన ఆధారిత సమాజ నిర్మాణంలో, ఆదివాసీల, బహుజనుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి సంకల్పించారు. ప్రభుత్వం ఈ ఆకాంక్షను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకుంటుందా, లేక ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాలుస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
- వెంకగారి భూమయ్య, 98485 59863