2019లో నాగ్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికపై వచ్చిన కొన్ని ఆరోపణలను బొంబాయి హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీం కోర్టు బుధవారం ధ్రువీకరించింది. హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ 2021 ఫిబ్రవరి 26న జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నానా ఫల్గుణ్‌రావు పటోలె, నాగ్‌పూర్ వోటర్ నఫీస్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. గడ్కరీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి గెలిచారని, హైకోర్టు పేర్కొన్న కారణం సరైనదేనని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ‘హైకోర్టు ఉత్తర్వు విషయంలో జోక్యానికి మాకు ఏ కారణమూ కనిపించడం లేదు’ అని బెంచ్ స్పష్టం చేసింది. ఎన్నికల పిటిషన్లను కొట్టివేయడానికి హైకోర్టు తన ఉత్తర్వులో నిరాకరించింది. అయితే, కుటుంబ సభ్యుల ఆదాయం, వారి అధీనంలోని భూమికి సంబంధించి పిటిషన్లలో ప్రస్తావించిన కొన్ని అంశాలను హైకోర్టు కొట్టివేసింది.