Wednesday, April 24, 2024

కెసిఆర్ సభకు డుమ్మాపై జవాబివ్వని నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

పాట్నా: తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో పాల్గొనకపోవడంపై బుధవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమాధానం దాటవేశారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సాధించేందుకు ఖమ్మంలో భారీ ర్యాలీకి ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునివ్వగా ఈ ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితర జాతీయ నాయకులు పాల్గొంటున్నారు.

దీనిపై మీరేం చెబుతారని విలేకరులు ప్రశ్నించగా నితీశ్ కుమార్ సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నారు. అక్కడే ఉన్న ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ చౌదరి మాత్రం స్పందిస్తూ తామంతా ఇక్కడే ఉండగా తెలంగాణలో ర్యాలీకి ప్రతిపక్ష నాయకులంతా వెళ్లారని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ప్రయత్నిస్తున్నారని మాత్రం తాను చెప్పగలనని, వారి ప్రయత్నాలలో నిజాయితీ ఉంటే 2024లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి రాదని చౌదరి అన్నారు. సమాధాన యాత్ర తర్వాత తాను అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాగొని దేశంలో ప్రతిపక్ష ఐక్యత కోసం బయల్దేరతానని నితీశ్ కుమార్ గతంలో అన్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో కెసిఆర్ బీహార్‌ను సందర్శించినప్పటికీ ప్రతిపక్షాల తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి గురించి మాత్రం సూటిగా సమాధానమివ్వలేదు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును జెడి(యు), ఆర్‌జెడి ప్రతిపాదిస్తున్నాయి. దీనిపై కెసిఆర్ కూడా స్పష్టంగా సమాధానమివ్వలేదు. ప్తిపక్షాలకు చెందిన నాయకులు కూర్చుని తమ ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటాయని మాత్రం కెసిఆర్ అప్పట్లో జవాబిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News