Tuesday, April 30, 2024

17సార్లు ఎన్నికలు.. 9 మంది ఎంపిలు

- Advertisement -
- Advertisement -

హ్యాట్రిక్ వీరులు ముగ్గురే
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా ముగ్గురే మూడుసార్లు (హ్యాట్రిక్) విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటిదాకా 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటిదాకా 9 మంది లోక్‌సభ సభ్యులుగా పనిచేశారు. అందులో ముగ్గురే మూడుసార్లు ఎంపిగా గెలిచిన ఖ్యాతి పొందారు. ఇందులో జిల్లాకు చెందిన ఒక్కరే ఈ ఘనత సాధించారు. 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన హరీష్ చంద్ర హుడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన జిల్లాకు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ 1957, 1962 ఎన్నికల్లోనూ వరుసగా మూడుసార్లు ఎంపిగా గెలిపించారు.

నాలుగోసారి పోటీ చేసినప్పటికీ స్వతంత్ర అభ్యర్థి నారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎంపి ఓడిపోయాకా హుడా జిల్లా రాజకీయాల నుంచి తెరమరుగయ్యారు. 1971 జరిగిన ఎన్నికలో ఆయనకు అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. దీంతో జగిత్యాల ప్రాంతానికి చెందిన ఎం. రాంగోపాల్ రెడ్డి బోధన్‌లో ఎంఎల్‌ఎగా పోటీ చేశారు. కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా బరిలో దిగి భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన ఏకంగా 56 శాతం ఓట్లు సాధించారు. రాంగోపాల్ రెడ్డి 1977, 1980 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి రెండో హ్యాట్రిక్ నేతగా ఖ్యాతి పొందారు. నాలుగోసారి వయస్సు రీత్యా రాంగోపాల్ రెడ్డికి కూడా అధిష్ఠానం టికెట్ నిరాకరించింది.

రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఎల్లారెడ్డి ఎంఎల్‌ఎ టి. బాలాగౌడ్‌కు 1984లో టికెట్ ఇచ్చింది. కొద్ది కాలానికి రాంగోపాల్ రెడ్డి భిక్కనూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాలాగౌడ్ సైతం రెండుసార్లు గెలిచిన మూడోసారి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. 1991లో టిడిపి నుంచి బరిలో దిగిన కల్లు ముస్తేదారు కేశ్‌పల్లి గంగారెడ్డి గెలిచారు. కానీ మరుచటి ఎన్నికల్లో (1996) కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1998, 1999 ఎన్నికల్లో కేశ్‌పల్లి గంగారెడ్డి వరుసగా గెలిచి ఎంపిగా హ్యాట్రిక్ సాధించిన వారిలో మూడో వ్యక్తిగా నిలిచారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎంపిగా గెలిచిన మధుయాష్కి మూడోసారి ఎన్నికల్లో ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News