హైదరాబాద్: సినిమా వాళ్లకు రెండు తెలుగు ప్రభుత్వాలు ఎంతో ముఖ్యమని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) అన్నారు. గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో నెలకొన్న వివాదంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ మేలు కోసం ఎపి డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ ఎంతో చేశారని పేర్కొన్నారు. ఛాంబర్ నుంచి సిఎంను కలిసేందుకు వెళ్ధామనే విషయం అందరూ కలిసి ఆలోచించలేదు కానీ.. ఎవరికివారే వారి సినిమా గురించి అడుగుతున్నారని మండిపడ్డారు.
‘‘కరోనా సమయంలో తప్పితే థియేటర్లు ఎప్పుడూ మూయలేదు. థియేటర్లు మూసుకుంటే ఎగ్జిబిటర్లకే నష్టం కదా.!. బంద్ అనే మాట లేకుండా సమస్య పరిష్కరించాలని కోరాం. అసలు విషయాన్ని పవన్ సినిమాపైకి పక్కదారి పట్టించారు. పవన్‌కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరు. ఎపి ప్రభుత్వానికి రాంగ్ కమ్మూనికేషన్ వెళ్లింది.. అందుకే మంత్రి స్పందించారు. జూన్‌లో పవన్ సినిమా సహా పలువురి సినిమాలు ఉన్నాయి. సినీ పరిశ్రమకు ఏప్రిల్, మే నెలలు చాలా కీలకం. సినీ పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే మన ఆలోచన కావాలి. తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన చిన్న విషయాన్ని రాష్ట్రమంతా ప్రచారం చేశారు’’ అని దిల్ రాజు (Dil Raju) పేర్కొన్నారు.
సినీ పరిశ్రమకు కొత్త టాలెంట్‌ను పరిచయం చేయాలనేదే తన లక్ష్యమని. అందుకోసం దిల్‌రాజు డ్రీమ్స్ అనే కంపెనీ ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. ‘‘అల్లు అరవింద్‌పై కూడా అనేక విషయాలు దుష్ప్రచారం చేశారు. మాకు ఏదైనా సమస్యలు వస్తే ప్రభుత్వాలే పరిష్కరించాలి. పర్సంటేజ్, రెంట్ అంటూ మాలోనే విభేదాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్‌కు ఇప్పటికైనా తెరదించాలని కోరుతున్నా. నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ప్రభుత్వాలతో పని ఉంటుంది. వారి సమస్యలపై ప్రభుత్వాలతో మాట్లాడతాం. సినీ పరిశ్రమపై నెగెటివ్ ప్రచారం చేయవద్దని అందరినీ కోరుతున్నాం. సమస్యలను మా వద్దకు తీసుకొస్తే ఛాంబర్ అధ్యక్షుడిగా స్పందిస్తా. సమస్యల పరిష్కారానికి ఛాంబర్ అనేది కీలకం. ఏ విషయంపై అయినా ఏకాభిప్రాయం ఉండదు భిన్నాభిప్రాయాలు సహజం’’ అని దిల్ రాజు తెలిపారు.