రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో
అందుబాటులో మధుమేహ
నివారణ మందులు
సిఎంఎస్ కేంద్రాలలో 10 నెలలకు
సరిపడా మందుల నిల్వలు
ఎలాంటి అంతరాయం లేకుండా
నిరంతరం మందుల సరఫరా
టిజిఎంఎస్‌ఐడిసి ఎండి
జి.ఫణీంద్రరెడ్డి
మనతెలంగాణ కథనానికి
స్పందన
టిజిఎంఎస్‌ఐడిసి ఎండి జి.ఫణీంద్ర
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మధుమేహ నివారణ మందు లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డవలప్‌మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జి.ఫణీంద్రరెడ్డి వెల్లడించారు. పది నెలలకు సరిపడా యాంటి డయాబెటిక్ మందులు సెంట్రల్ మెడిసిన్ స్ట్రోర్స్(సిఎంఎస్) కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. మెట్‌ఫార్మిన్ 1000 ఎంజి, మెట్‌ఫార్మిన్ 500 ఎంజి, గ్లిమెపిరైడ్ 1 ఎంజి, మెట్‌ఫార్మిన్ 500 ఎంజి+గ్లిమిపిరైడ్ 1 ఎంజి మందులు 10 నెలలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండగా, గ్లిమెపిరైడ్ 2 ఎంజి ట్లాబ్లెట్లు నాలుగు నెలలకు సరపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించా రు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రులకు ప్రిమిక్స్ ఇన్సూలిన్ 30: 70(రెగ్యూలర్ + ఎన్‌పిహెచ్) సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు 33 జిల్లాల్లో 14,077 ఆరోగ్య కేంద్రాలకు 37 వేల వయల్స్ అందజేశామని అన్నారు. అదనంగా మరో 30 వేల వయల్స్ పంపిణీ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ ఔషధి ద్వారా ఆరోగ్య కేంద్రాలకు ఇచ్చే ఇండెంట్ ప్రకారం అన్ని మందులు సరఫరా చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో మందుల సరఫరాను నిత్యం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరాను నిత్యం సమీక్షిస్తూ అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.