Monday, November 11, 2024

రతన్ వారసుడిగా నోయెల్ టాటా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/ ముంబయి : రతన్ టాటా మరణం తరువాత టాటా గ్రూప్ నిర్వహణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా నియుక్తుడయ్యారు. శుక్రవారం ముంబయిలో జరిగిన బోర్డు సమావేశంలో కమిటీ సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నోయెల్ టాటా ప్రస్తుతం టాటా స్టీల్, టైటాన్ కంపెనీలకు వైస్ చైర్మన్‌గా ఉన్నారు. నోయెల్ టాటా 2000 ఆరంభంలో టాటా గ్రూప్‌లో ప్రవేశించారు. ఆ నాటి నుంచి టాటా గ్రూప్ పురోగమనంలో ఆయన కూడా కీలక వ్యక్తిగా కృషి చేస్తున్నారు. సర్త్రన్ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ల సమావేశం అనంతరం శుక్రవారం ఆయననను చైర్మన్‌గా ఎంపిక చేశారు. కాగా, దివంగత రతన్ టాటా సంప్రదాయ పార్శీ కుటుంబంలో జన్మించారు. అయితే, ఆయన పదవ ఏట తల్లిదండ్రులు నావల్ టాటా, సూనీ టాటా విడాకులు తీసుకున్నారు. దీనితో రతన్ టాటా తన అమ్మమ్మ వద్ద పెరిగారు.

తండ్రి రెండవ వివాహం చేసుకున్నారు. నోయెల్ టాటా తల్లి సిమోన్ టాటాయే రతన్ టాటాకు సవతి తల్లి. ఆమె ఒక ఫ్రెంచ్ స్విస్ కాథలిక్. ప్రస్తుతం ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఆమె చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇక రతన్ టాటా తమ్ముడు జిమ్మీ వ్యాపారంలో అడుగు పెట్టలేదు. ఆయన దక్షిణ ముంబయి కొలాబాలో నిరాడంబర జీవితం గడుపుతున్నారు. కేవలం రెండు బెడ్‌రూమ్‌లు ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆయన నివసిస్తున్నారు. కాగా, టాటా ట్రస్ట్ కింద మొత్తం 14 ట్రస్ట్‌లు ఉన్నాయి. అయితే, టాటా సన్స్ యాజమాన్యంలో ఎక్కువ భాగాన్ని సర్ రతన్ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌లే నిర్వహిస్తుంటాయి. ఆ రెండు ట్రస్ట్‌లు ఉమ్మడిగా 50 శాతం పైగా యాజమాన్యాన్ని కలిగి ఉన్నాయి. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా ట్రస్ట్‌కే అత్యధికంగా 66 శాతం వాటా ఉంది. అందువల్ల టాటా ట్రస్ట్‌కు చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు, వృద్ధి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. చైర్మన్ పదవి విషయంలో తొలుత వేర్వేరు పేర్లు వినిపించినప్పటికీ నోయెల్ టాటాకే పగ్గాలు అప్పగించడం విశేషం. టాటా ట్రస్ట్‌లో ప్రస్తుతం వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్, మెహ్లీ మిస్త్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News