నర్మెట్ట ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణం పనులు పూర్తవ్వాలి
టిజి ఆయిల్ ఫెడ్ పై మంత్రి తుమ్మల సమీక్ష
కార్పొరేషన్ కార్యాలయంను సందర్శించిన మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల కు స్వాగతం పలికిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి
ఖమ్మం జిల్లా మతికేపల్లి మార్కెట్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆయిల్ పాం నర్సరీల పర్యవేక్షణ సరిగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నర్సరీ స్థాయిలోనే మొక్కలను సరిగా గుర్తించాలని, అందుకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్ లోని తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ సంస్థ పనితీరు పై అధికారులతో చైర్మన్ జంగా రాఘవ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జూలై నాటికి సిద్ధిపేట జిల్లాలో నిర్మాణమవుతున్న నర్మెట్ట ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణం పనులు పూర్తవ్వాలని సూచించారు. ఆయిల్ ఫెడ్ సంస్ధ ఆర్ధికంగా బలోపేతమవుతూ రైతుకు లాభాలను గడించేలా నిబద్ధతతో పని చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు అంతర పంటల విషయంలో సరైన అవగాహన కల్పించాలని అందుకు వ్యవసాయ శాస్త్రవేత్తల సహాకారం తీసుకోవాలన్నారు. ఆయిల్ పాం పంటను పొత్సహించడంతో పాటు విస్తీర్ణం పెంచాలని, రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా ఆయిల్ ఫెడ్ సంస్థ పనిచేయాలన్నారు. వచ్చే దశాబ్ధానికి అన్ని విభాగాల్లో సరిపడా నూతన సాంకేతికత గల ఉద్యోగులను నియమించాలని, దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
సంస్థ ద్వారా ఆయిల్ ఫెడ్ ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసి ఆర్ధికంగా బలోపేతం చేసుకుని సంస్థను ప్రగతి పథంలో నడిపించాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఈడీ ప్రశాంత్ కుమార్, ఒఎస్‌డీ కిరణ్ కుమార్, జనరల్ మెనేజర్ సుధాకర్ రెడ్డి , ప్రాజెక్ట్ మెనేజర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఆర్ మెనేజర్ సత్యనారాయణ తదిరులు పాల్గొన్నారు. మతికేపల్లి మార్కెట్ యార్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మతికేపల్లి మార్కెట్ యార్డును ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, నేలకొండపల్లి మార్కెట్ యార్డుల విభజన ద్వారా చింతకాని , ముదిగొండ మండలాలతో మతికేపల్లి మార్కెట్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మార్కెట్ యార్డు సదుపాయం లేనందువల్ల, మొక్కజొన్న, పత్తి, ఇతర పంటలను రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకునేవారని, కానీ ఇప్పుడు మతికేపల్లి మార్కెట్ యార్డును ఏర్పాటు చేయడం ద్వారా రైతులు తమ పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తే ఖమ్మం, నేలకొండపల్లికి పోయే అవసరం తప్పుతుందని, దూరం తగ్గిపోవడం వల్ల రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి దళారుల వద్దకు వెళ్లడం తగ్గడమే కాకుండా రవాణా ఖర్చులు కూడా తప్పుతాయని అన్నారు. అలాగే మార్కెట్ యార్డు లో రైతులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ మార్కెట్ యార్డు ఏర్పాటు ద్వారా మొక్క జొన్న, పత్తి రైతులు గరిష్ట మద్దతు ధరకు అమ్ముకునే వీలు కలగడంతో పాటు రైతులు మంచి ఆదాయం పొందే అవకాశం కలుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.