Monday, September 1, 2025

కవిత్వం మాత్రమే నిజం చెపుతుంది

- Advertisement -
- Advertisement -

రాజ్యం ఒక పెద్ద విరోధాభాస. అదొక పారడాక్స్. ప్రపంచంలో ఎక్కడైనా అది ఒకేలా స్పందిస్తుంది. పరిపాలనా రూపం ఏదైనా కావచ్చు. ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా, మత రాజ్యమా, అనే రూపాలతో పని లేదు. దాని స్వభావం ఒక్కటే. ఇండియా, అమెరికా, సౌదీ, సిరియా లాంటి దేశ నామాలతో పనిలేదు. దాని సారాంశం ఎక్కడైనా ఒక్కటే. అబద్దం నిజం అయిన చోట కేవలం కవిత్వం మాత్రమే, ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్ మాట్లాడుతుంది. ఈ ఎరుక, గ్రహింపు ఉన్నది కనుకనే మారం అల్ మాస్రి అనే సిరియన్ కవయిత్రి ‘A poem can make us more humane. It shares a side of truth that facts and numbers overwhelm, and which ignorance and fear prefer to exclude’ అని అనగలిగింది. అవును కవిత్వం మాత్రమే నిజం చెపుతుంది. అదీ సంక్షోభ సమయంలో వెలువడే కవిత్వం మాత్రమే ముసుగేసుకున్న నిజం వలువలు ఒలిచి అబద్దం స్వరూపాన్ని విప్పి చూపిస్తుంది.

మారం అల్ మాస్రి 1962లో సిరియాలో జన్మించింది. ఆమె చాలా చిన్న వయసులోనే కవిత్వం రాయడం మొదలు పెట్టింది. కవిత్వం ఎందుకు అంటే అప్పుడు ఆమె చెప్పిన జవాబు ‘ఇతరుల నుండి నన్ను నేను ప్రత్యేకంగా చూపించుకోవడానికి’. ఆమె కవితల ఆంగ్ల అనువాదాలు రెండు సంపుటాలుగా Red Cherry on a White Tile Floor, I look at you లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. చిన్న చిన్న ప్రతీకలతో రోజువారీ జీవితాన్ని, ఏ అలంకారాల అతిశయోక్తులు లేకుండా స్పష్టంగా, నగ్నంగా చూపించడం ఆమె కవిత్వ లక్షణం. భాష సరళంగా ఉండి వెంటనే హృదయంలోకి వెళ్లిపోతాయి ఆమె కవితలు. ది గార్డియన్ అనే పత్రిక ఆమెను ‘a love poet whose verse spares no truth of love’s joys and mercilessness’ అని అభివర్ణించింది.

ఇవాళ అరబ్ ప్రపంచంలో ఆమె కవిత్వ స్వరానికి తిరుగులేదు. మొదట్లో ప్రేమ కవిత్వం బాగా రాసినా.. సిరియన్ సంక్షోభం ఆమె కవిత్వ రచనలో చాలా మార్పు తెచ్చింది. ఆమె కవిత్వంలో వ్యంగ్యం, అధిక్షేపం అలా తళుక్కుమని మెరిసి క్షణంలో పాఠకుడిని వశపరచుకుంటాయి. మాస్రి చిన్నచిన్న కవితలు రాస్తుంది. అయినా వాటి ప్రభావం అపారం.
‘Liberty Walks Naked’ అన్న కవిత్వ సంపుటిలోని ఈ కవిత చూడండి
సుల్తాన్ దగ్గరకు వెళ్లి
ఒక మహిళా ఇలా ఫిర్యాదు చేసింది
‘సుల్తాన్ జీ!
నేను నిద్రిస్తున్నప్పుడు
మీ సైనికులు వచ్చి
నా గొర్రెలను దొంగతనం చేసారు’
‘గొర్రెలు ఉండగా నువ్వెలా నిద్రపోతావు?
వాటిని కాపాడుకోవలసిన బాధ్యత నీదే కదా’
అన్నాడు సుల్తాన్
అప్పుడు ఆమె వెంటనే ఇలా చెప్పింది
‘ఓ దయామయా!
మమ్మలందర్నీ మీరే కాపాడతారు అనుకుని
నేను నిద్రపోయాను’
కవిత చిన్నదే, కానీ.. దాని భావం మాత్రం చాలా పెద్దది. సుల్తాన్ అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఒక్క వాక్యంతో కడిగేసింది. దీనికి వేరే వ్యాఖ్యనాలు ఏమీ అవసరం లేదు. మాస్రి ‘Have you Seen Him?’ అన్న కవిత చదివినప్పుడు మనం దిగ్భ్రాంతి చెందుతాము. ఒక గగుర్పాటుకి గురి అవుతాము.
అతడిని చూశావా
పొత్తిళ్ళలో నవజాత శిశువును
పొదివి పట్టుకుని ముందుకు సాగుతున్న
అతడిని చూశావా
అలా పొత్తిళ్ళలో మెత్తగా పడుకుని
తన తండ్రి చేతులలో
భద్రంగా ప్రయాణిస్తున్నందుకు
ఆ నవజాత శిశువు గర్వపడుతుంది కదూ
బహుశా బతికివుంటే

తండ్రి చేతులలో అప్పుడే పుట్టి కన్నుమూసిన చిన్నారి శరీరాన్ని బతికి ఉన్న పసిపాపను తీసుకెళుతున్నంత జాగ్రత్తగా పదిలంగా తీసుకెళుతున్నాడు. నిజంగా ఆ పాపే కనుక బతికి ఉంటే ఎంత గర్వపడేది? తన తండ్రి చేతులలో గొప్ప రక్షణ వలయం మధ్య తాను ఉన్నందుకు. నిజానికి సిరియా అంతర్యుద్ధంలో ఎక్కువ చనిపోయింది ఎవరు అంటే పసిపిల్లలు. బహుశా ఒకతరం సిరియా ఆ పాపాన్ని అనుభవించాల్సే ఉంది.

నా లాంటి స్త్రీలకి
ఎలా మాట్లాడాలో తెలియదు
పదం ఒకటి గొంతులో
ఎప్పుడూ ముల్లులా
గుచ్చుకుంటూ ఉంటుంది
ఆ ముల్లును లోపలికి మింగడమా
బయటకు నెట్టేయడమా
అన్న ప్రశ్న వచ్చినప్పుడు
వాళ్ళు మింగడానికి ఇష్టపడతారు
నాలాంటి స్త్రీలకి
ఏడవడం తప్ప మరేమీ తెలియదు
ఎలాంటి ఏడుపు అది
హఠాత్తుగా తెగిపడిన ధమనుల నుండి
ముందుకు దూకిన నెత్తురులా
నాలాంటి స్త్రీలకి
దెబ్బలు తినడమే తెలుసు
వాటిని తిరిగి ఇవ్వడం ఎలాగో తెలీదు
వాళ్ళు ఆగ్రహంతో వణికిపోతారు
అంతలోనే మెత్తబడిపోతారు
బోనులో ఉన్న సింహంలా
నాలాంటి స్త్రీలు
స్వాతంత్య్రం గురించి
కలలు కంటారు స్త్రీల స్వభావాన్ని, వాళ్ళ కలల్ని, ఎంత ప్రతిభావంతంగా చెప్పిందో చూడండి. మాట్లాడాల్సిన మాట ఏదో గొంతులో ముల్లులా గుచ్చుకుంటూ ఉంటుందట. ఆ మాటని బయటకు నెట్టేయడమా? లోపలకు మిగేయడమా? అనే ప్రశ్న వచ్చినప్పుడు వందకు తొంభై తొమ్మిది మంది మాటను లోలోపలే దాచేసుకుంటారు. బోనులో ఉన్న సింహంలా ఆగ్రహంతో వణికిపోతారట. అంతలోనే మెత్తబడిపోతారట. వాళ్ళు స్వాతంత్య్రం గురించి ఎవరూ కనని కలలు కంటారు. ఆ స్వాతంత్య్రం కోసం ఎంత దూరం

ప్రయాణం చేస్తారు? ఎంత దూరమైనా చేస్తారు?

నిరంతరం అంతర్యుద్ధంలో
విలవిలలాడే ఆమె మాతృ దేశం
సిరియా తనకొక స్రవిస్తున్న గాయం
మరణశయ్య మీద ఉన్న తన కన్నతల్లి
గొంతు కోయబడిన తన పసి కూతురు
బయటనుండి చూస్తున్న వాళ్లకు సిరియాలో ఏవో గొడవలు మాత్రమే జరుగుతున్నాయి అన్న విషయం తెలుస్తుంది. మహా అయితే కొన్ని ప్రత్యేక కథనాలు. మరికొన్ని అంకెల లెక్కలు తెలుస్తాయి. కానీ నిజం ఏమిటి అనేది మాత్రం కేవలం ఆ కాలపు కవిత్వం ద్వారా మాత్రమే తెలుస్తుంది అనడానికి ఈ చిన్న కవిత ఒక పెద్ద ఉదాహరణ. ఆమె గొంతు విప్పవలసి వచ్చిన చోట గొంతు విప్పకుండా ఉండలేదు. సాహిత్యాన్ని తన డెవలప్‌మెంట్ కోసం ఎప్పుడూ వినియోగించుకోలేదు. ఒక అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఒక మాట అన్నది ‘The president‘s Family really took Syriya like a big chicken., and they eat alone’ ఈ శీర్షికతోనే ఆ పత్రిక ఆమె ఇంటర్వ్యూ ప్రచురించింది. కవిగా అది ఆమె ధైర్యం ‘To Love Homeland/is a death sentence’ అన్న ఆమె కవిత్వ వాక్యమే ఆమె కవిత్వ తాత్విక భూమిక

Also Read :కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ కెసిఆరే

  • వంశీ కృష్ణ
  • Only poetry tells truth
  • మారం అల్ మాస్రి
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News