పహల్గాం ఉగ్రదాడి పట్ల దేశమంతా పెల్లుబికిన ఆగ్రవేశాలకు సమాధానంగా భారత్ సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్తాన్ కుతంత్రాలకు ఓ నిర్ణయాత్మక సమాధానంగా నిలుస్తుంది. భారత సేనలు పాకిస్తాన్, ఆక్రమిత పాక్ భూభాగాలలోకి చొచ్చుకొనిపోయి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి జరపడం, ముఖ్యంగా కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలుగా పేరొందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ప్రధాన కార్యస్థానాలను ధ్వంసం చేయడాన్ని ఉగ్రవాదం పట్ల విసుగు చెందుతున్న మొత్తం ప్రపంచం హర్షించింది. అయితే, అర్ధాంతరంగా కాల్పుల విరమణ జరగడం, ఇటు భారత్‌లో, అటు పాకిస్తాన్‌లో అధికార పార్టీలు తమ రాజకీయ ప్రాబల్యాన్ని సుస్థిరం చేసుకొనే పనిలో పడిపోవడంతో అసలేమీ జరిగిందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సేనలు ఓ అంశాన్ని స్పష్టం చేశాయి.
తాము కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా మాత్రమే దాడులు జరిపామని, పాకిస్తాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై గాని, సాధారణ పౌరులపై గాని ఎటువంటి దాడి జరపలేదని తేల్చిచెప్పాయి. అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కట్టడి చేయడమే ఈ సైనిక చర్య ప్రధాన ఉద్దేశం అని స్పష్టం అవుతుంది. గతంలో 2016లో, 2019లో సైతం అటువంటి ఉద్దేశంతోనే భారత సేనలు మెరుపుదాడులు జరిపాయి. ఇటువంటి దాడులు ఏమేరకు ఉగ్రవాదాన్ని కట్టడిచేసేందుకు దోహదపడుతున్నాయి? అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. గతంలో జరిగిన మెరుపుదాడులు ఉగ్రవాదులను కట్టడి చేయడంలో ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటివి పైకి కనిపించేవి మాత్రమే. అసలు సూత్రధారులు, వారిని నడిపిస్తున్నది, వారికి అవసరమైన వనరులు సమకూరుస్తున్నది పాకిస్తాన్ సైన్యం అనేది బహిరంగ రహస్యమే.
పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని అక్కడి ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదంపై భారత్ నిబద్ధతను వెల్లడిస్తూ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రధాని మోడీ మూడు అంశాలను ప్రస్తావించారు. ఉగ్రదాడులపై నిర్ణయాత్మకంగా తిరగబడటం, పాకిస్తాన్ అణు బెదిరింపులను లెక్కచేయకపోవడం, ఉగ్రదాడులను ప్రభుత్వదాడులుగా పరిగణించడం అని తమ ప్రభుత్వ సరికొత్త విధానంగా చెప్పుకొచ్చారు. అదే నిజమైతే, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినా అక్కడి ప్రభుత్వ విధానంలో చెప్పుకోదగిన మార్పు కనిపించకుండా కాల్పుల విరమణకు ఏవిధంగా ఒప్పుకున్నారు? అనే ప్రశ్న తలెత్తుతుంది. పాకిస్తాన్ డిజిఎంఒ ఫోన్ చేసి, ఇక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోమని చెప్పారని అంటున్నారు. డిజిఎంఒ స్థాయి అధికారికి ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వ విధానం వ్యక్తం చేసే హోదా, అధికారం ఉంటుందా? ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన కారణంగా ఉగ్రవాదం కట్టడి అవుతుందని భావించలేం.
ఎందుకంటే, పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుండి భారత్ సేనలు దాడి చేయవచ్చనే సంకేతాలు వెలువడుతూ ఉండడంతో ముందుగానే ఉగ్రవాదులను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో కూడా ఈ విధమైన దాడులు చేస్తామని భారత్ స్పష్టం చేయడంతో ఆయా ప్రాంతాలను మతపరమైన కార్యకలాపాలకు ఉపయోగిస్తూ, భూగర్భంలో భారత్ దాడుల నుండి రక్షణ పొందే విధంగా సరికొత్త స్థావరాలను పాకిస్థాన్ సైన్యం సహకారంతో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
పైగా ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనిక అధికారులు, ప్రభుత్వ అధికారులు బహిరంగంగా హాజరవుతున్న చిత్రాలు మీడియాలో వచ్చాయి. అంటే ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఇంకా కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం భారతీయ సైనిక స్థావరాలపై దాడులకు విఫల ప్రయత్నం చేసింది. ఆ దాడులను భారతీయ సైన్యం దీటుగా ఎదుర్కొంది.
ఈ సందర్భంగా అంతర్జాతీయంగా భారతీయ సేనలు ప్రశంసలు పొందుతున్నాయి. ఈ దాడులలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు? రెండు దేశాలు సైనికులపరంగా, పౌరుల పరంగా, ఆయుధాలపరంగా ఏ మేరకు నష్టపోయాయి? అనే గణాంకాలు ఈ సందర్భంగా అప్రస్తుతం. ప్రధాన ప్రశ్న ఈ యుద్ధవాతావరణం ప్రభావం రెండు దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. పాకిస్తాన్ దీర్ఘకాలంలో పతనం అంచుకు చేరుకొనే అవకాశం ఉండగా, భారత్ అభివృద్ధి యాత్రకు తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఆత్మరక్షణలో పడటమే కాకుండా, సొంత ప్రజలనుండి నిరసనలు ఎదుర్కొంటున్న తమ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించడం ద్వారా అక్కడి పౌరప్రభుత్వం సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారామనే సంకేతం ఇచ్చింది.
పాకిస్తాన్‌లో పౌరప్రభుత్వాలు తరచుగా భారత్‌తో మంచి సంబంధాల కోసం కృషి చేస్తున్నా తమ ఆధిపత్యం కోసం సైన్యమే భారత్‌ను ఓ శత్రుదేశంగా చూపిస్తూ ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నది. భారత్‌తో మిత్రత్వం కోసం ప్రయాణించిన పాకిస్తాన్ నేతలు అందరూ అధికారం కోల్పోవడమో, హత్యలకు గురికావాల్సి రావడమో జరుగుతూవస్తోంది. మరోవంక, ఇదే సమయంలో భారత్ జపాన్‌ను త్రోసి వేసి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందుతున్నట్లు నీతిఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించిన విషయం ఘర్షణల వాతావరణంలో దేశప్రజల దృష్టిలో అంతగా పడినట్లు లేదు. పైగా, మరో రెండు, మూడేళ్ళలో మూడో స్థానంలోకి రాగలమని కూడా చెప్పారు. అంటే, ఆర్థికంగా భారత్ అగ్రగామిగా ముందడుగు వేస్తున్న తరుణంలో సరిహద్దుల్లో ఈ విధమైన ఘర్షణలు చెలరేగడం ప్రతికూల అంశమే కాగలదు. తిరిగి వెంటనే భారత్ పాకిస్థాన్ మరోసారి యుద్ధానికి దిగే పరిస్థితులు రాకపోయినా యుద్ధ వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఉద్రిక్తలు కొనసాగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో సరిహద్దుల్లో మన సైన్యాన్ని మోహరిస్తూ అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది.
అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవలసి వస్తుంది. అటువంటి ఉద్రిక్తమైన యుద్ధ వాతావరణం నెలకొన్న దేశంలో పెట్టుబడులకు భారీ కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపవు. చైనా నుండి కొన్ని సంస్థలు తమ ఉత్పత్తి సామర్ధ్యాలను భారత్ కు మార్చగలవని ఎదురు చూస్తున్న సమయంలో ఇటువంటి పరిణామం ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తుంది. పైగా, మన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ వస్తున్నప్పటికీ ఉత్పత్తి రంగంలో చెప్పుకోదగిన వృద్ధినమోదుచేసుకోలేకపోతున్నాం. భారత్‌లో ఉత్పత్తి కర్మాగారాలు నెలకొల్పేందుకు బహుళజాతి సంస్థలు చెప్పుకోదగిన ఆసక్తి చూపడం లేదు. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగకుండా ఉండాలని బలంగా కేవలం రెండు దేశాలు మాత్రమే కోరుకొంటున్నాయి. ఒకటి అమెరికా అయితే, మరొకటి చైనా. వ్యూహాత్మకంగా చైనాను కట్టడి చేసేందుకు అమెరికా భారత్‌కు స్నేహహస్తం చాపుతూ వస్తున్నప్పటికీ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడం అమెరికాకు ఇష్టం లేదనడంలో సందేహం లేదు.
అందుకనే భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలో రెండు దేశాలు తనకు సమానమే అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. పైగా, తానే ఒత్తిడి తెచ్చి వారు కాల్పుల విరమణకు దిగేటట్లు చేశానని చెప్పుకొంటున్నారు. కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే రెండు దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తామని బెదిరించినట్లు కూడా చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ సైతం మౌనం గా ఉండటం గమనార్హం. అంటే అమెరికా పాకిస్తాన్‌కు వ్యూహాత్మక మద్దతు అందజేస్తుందా? అనే అనుమానం కలుగుతుంది. ఈ ఘర్షణలో పాకిస్తాన్‌కు రెండు దేశాలు సైనికపరంగా ప్రత్యక్ష సహకారం అందించాయి. అవి చైనా, టర్కీ. ఆ రెండు దేశాలు అందజేసిన ఆయుధాలనే పాకిస్తాన్ ఎక్కువగా భారత్‌పై ప్రయోగించింది. టర్కీ ఆయుధాలు భారత్ ధాటికి నిలబడకపోయినప్పటికీ చైనా ఆయుధాలు బాగానే ఉపయోగపడిన్నట్లు కనిపిస్తున్నది.
మాటలలో కూడా పాకిస్తాన్‌కు అండగా నిలబడుతున్నట్లు చైనా నేతలు స్పష్టం చేస్తూ వచ్చారు. అమెరికాకు పోటీగా చైనా అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తున్నది. అయితే ఇటీవల కాలంలో చైనా ఆయుధాలను ఎక్కడా ఉపయోగించలేదు. దానితో వాటి సామర్థ్యం ఎవ్వరికీ తెలియదు. అమెరికాకు పోటీగా యుద్ధ విమానాలు, క్షిపణులను చైనా తయారు చేస్తున్నారు. వాటిని పాకిస్తాన్‌కు అందజేయడం ద్వారా ఒక విధంగా భారత్‌తో జరిగిన ఘర్షణలను ఓ ప్రయోగశాలగా మార్చుకున్నట్లు స్పష్టం అవుతుంది. ఈ విషయమై ప్రపంచంలో అనేక దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ఘర్షణలు జరగగానే చైనా యుద్ధ విమానాలు, క్షిపణులు తయారు చేసే కంపెనీల షేర్లు పెరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటి సామర్థ్యాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున కొనుగోలుకు పలు దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
మరోవంక, తైవాన్‌ను ఆక్రమించుకుంటానని చైనా బహిరంగంగానే చెబుతూ వస్తున్నది. మూడు నుండి ఐదేళ్లలో అందుకోసం సైనిక చర్య చేపట్టే అవకాశం ఉంది. తైవాన్ ఆక్రమణకు చైనా ప్రయత్నం చేస్తే అడ్డుకొనేందుకు అమెరికా సైతం తన సేనలు, ఆయుధాలను మోహరింప చేస్తున్నది. అంటే చైనా నేరుగా అమెరికాతో తలపడే అవకాశం లేకపోలేదు. అందుకనే ముందుగా, తన ఆయుధాలు ఏమేరకు అమెరికా అడ్డుకోగలనో అని పరీక్షించుకునేందుకు భారత్ – పాకిస్తాన్‌ల మధ్య ఘర్షణలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. వీటన్నింటికీ మించి దక్షిణాసియాలో భారత్‌ని ఏకాకిగా చేసి, తన ఆధిపత్యం పెంపొందింప చేసుకోవడంలో చైనా కొంతవరకు ముందడుగు వేయగలిగింది.
భారత్‌తో సన్నిహితంగా ఉండే బంగ్లాదేశ్ సైతం ఇప్పుడు పక్కలో బల్లెంగా మారింది. ఇక నేపాల్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలలో సైతం చైనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. చివరకు అఫ్ఘానిస్తాన్ సైతం చైనాకు దగ్గరవుతున్నది. ఈ పరిణామాలు భారత్‌కు భద్రతాపరంగానే కాకుండాఆర్థికాభివృద్ధిలో సైతం సవాళ్లు విసిరే అవకాశం ఉంది. ఆ విధంగా భారత్ వృద్ధిని కట్టడి చేసే చైనా వ్యూహంలో భారత్ పాక్ ఘర్షణలు కీలకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే భారత ప్రభుత్వం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం వెంపర్లాడకుండా స్పష్టమైన వ్యూహాత్మక నిర్ణయాలతో వ్యవహరించాల్సి ఉంది.
- చలసాని నరేంద్ర
98495 69050