మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో చదువుల్లో హేతుబద్ధమైన సంస్కరణలు రావాలి. నైపుణ్యమే ఉపాధికి కొలమాన్న సంగతిని గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఎండమావుల్లా తయారవడంతో చదువుకున్న వారి పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’ చందంగా మారింది. ఉద్యోగాలంటే సాఫ్ట్‌వేర్ రంగమే స్ఫురణకు రావడం సహజం. అయితే అదే సాఫ్ట్‌వేర్ రంగం అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నది. టెక్ కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్‌లు, పింక్ స్లిప్‌లతో వీడ్కోలు సందేశాలు పంపడమే ఇందుకు కారణం. అన్ని టెక్ కంపెనీలు ఇదే బాటలో పయనిస్తున్న కారణంగా ఒక కంపెనీలో ఉద్యోగం తొలగిస్తే, వేరే కంపెనీల్లో ఉద్యోగం లభిస్తుందన్న గ్యారంటీ లేదు.
టెక్‌హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో కూడా అనేక కంపెనీలు ఉద్యోగులకు శ్రీముఖాలు పంపిస్తూ, సెలవంటూ చల్లగా జారుకుంటున్నాయి. ఒక ఏడాదిలోనే అమెజాన్ నాలుగు (Amazon four) పర్యాయాలు ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 9 వేల మందికి ఉద్వాసన చెప్పాలని నిర్ణయించుకుంది. సుమారు 12వేల మందికి పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు టిసిఎస్ నోటీసులు పంపింది. గూగుల్, ఇంటెల్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు సిద్ధం చేసింది. దాదాపు 20 నుండి 25 లక్షల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్న హైదరాబాద్ టెక్‌హబ్ ఉద్యోగులను యుద్ధప్రాతిపదికన తొలగించడానికి సంసిద్ధంగా ఉంది. ఎఐ సృష్టించిన పెనుప్రకంపనల్లో సాఫ్ట్‌వేర్ రంగం కకావికలమైపోతున్నది.
ఇంకా చదువుకుంటున్న మన యువత అవగాహన లేకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం కలలు కనడం మానుకోవాలి. సాఫ్ట్‌వేర్ కల నెరవేరాలంటే అహరహం శ్రమించాలి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పట్ల శ్రద్ధ చూపాలి. గతంలో మాదిరిగా ప్రతిభ లేకున్నా ఫేక్ సర్టిఫికెట్లతో, ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉద్యోగాలు పొందాలను కోవడం ఇక జరగనిపని. పలు దేశాల్లో ఉద్యోగులకంటే స్వయం ఉపాధి ద్వారా అధిక సంపాదన చేస్తున్న వారెంతో మంది ఉన్నారు. దేశ యువత కూడా మూస ధోరణిలో పయనించకుండా సంపాదన కున్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. విద్యార్థి దశలోనే నైపుణ్యతకు సానబెట్టాలి. అత్యంత క్రమశిక్షణతో, నైపుణ్యతతో సాగిన ఒకప్పటి మన విద్యావ్యవస్థలోని అంకితభావం వర్తమానంలో అగుపించడంలేదనే విమర్శల్లో నిజంలేకపోలేదు. ఉద్యోగాల వేటలోపడిన యువత నైపుణ్యాన్ని అలవరచుకోకుండా ఇంకా డిగ్రీలను, బట్టీ చదువులను నమ్ముకోవడం వలన ఎలాంటి ప్రయోజనం చేకూరదు. విద్యావంతుల శాతం పెరుగుతున్నది.
ప్రభుత్వ ఉద్యోగాలు గగనకుసుమంలా మారిపోయాయి. ప్రైవేటు సంస్థలు కూడా అందరికీ ఉద్యోగాలిచ్చే పరిస్థితుల్లో లేవు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మరింత సన్నగిల్లే అవకాశాలు కనిపించడమే కాకుండా ఉద్యోగ భద్రత కూడా ప్రశ్నార్ధకం కావచ్చు. ఒకప్పుడు భారత్‌తో సహా అనేక ప్రపంచ దేశాలు నిరుద్యోగ సమస్యతో సతమతమైన విషయాన్ని మరువలేం. పెరిగిన అవసరాలు మానవ జీవితాలను దుర్భరం చేస్తున్న దశలో అనేక మంది మేధావులు, ఆర్థిక నిపుణులు ప్రపంచ వాణిజ్యాన్ని సరళతరం చేసారు. సరళీకృత ఆర్థిక విధానాలకు అంకురార్పణ గావించారు. గ్లోబలైజేషన్ వలన వివిధ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగైనాయి. సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచమంతా విస్తరించింది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. అనేక రంగాలు ప్రపంచంతో అనుసంధానించబడ్డాయి.
వ్యవసాయ ఆధారిత దేశాలు కూడా సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందాయి. వ్యవసాయమే ప్రధాన ఉపాధిగా జీవించే యువతకు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. నిరుద్యోగ సమస్య తీవ్రత తగ్గింది. అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి చేరడంతో ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడానికి యువతకు మార్గం సుగమం కాబడింది. విద్య, ఉద్యోగ రంగాల్లో పోటీతత్వం పెరిగిన కారణంగా ఉద్యోగాల్లో ప్రతిభ కీలకంగా మారింది. నైపుణ్యానికే అగ్రతాంబూల మిచ్చే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రతిభకు అర్థం మారింది. తాము చదివిన చదువుల్లో, చేస్తున్న ఉద్యోగాల్లో నైపుణ్యత అవసరం. మారుతున్న పరిస్థితులకు, సాంకేతిక ప్రపంచంలో వెల్లువెత్తుతున్న నూతన పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమను తాము ఎప్పటికప్పుడు మార్చుకోవాలి.కృత్రిమమేధ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కృత్రిమ మేధ వలన ప్రస్తుతమున్న ఉపాధి అవకాశాలకు గండి పడే అవకాశాలున్నాయి.
వందల సంఖ్యలో చేసే ఉద్యోగాలను కేవలం పదుల సంఖ్యలో పూర్తి చేసే సాంకేతిక పరిజ్ఞానం రావడంతో ఇక నుంచి ఉపాధి అవకాశాలు అందుకోవడం అంత సులభం కాదు. స్కిల్ డెవలప్‌మెంట్ వల్లనే ఉద్యోగాలు లభిస్తాయి. నైపుణ్యం ఉంటేనే ఉపాధి అవకాశాలు దరికి చేరతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు దొరకని నేపథ్యంలో కష్టమైనా ఇష్టంగా మలచుకుని సాఫ్ట్‌వేర్ ఆఫీసుల్లోనే పని చేయాలనే తత్వం నేటి యువతలో ప్రబలింది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగం అనేక ఒడిదుడుకుల మధ్య నడుస్తున్నది. కాబట్టి నైపుణ్యాల దిశగా యువతను నడిపించాలి. 2030వ సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని నేటి యువతలో సాంకేతిక, వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలి. ఏ దేశమైనా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ప్రతీ ఒక్కరూ చదువుకోవాలి. ఆ చదువు ద్వారా నైపుణ్యాన్ని అలవరచుకోవాలి. ప్రపంచమంతా యాంత్రీకరణ దిశగా, కృత్రిమ మేధ వైపు పయనిస్తుంటే ఇంకా చాలా దేశాలలో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు.
అరకొర సదుపాయాలతో, విద్యాప్రమాణాల లేమితో చదువుకున్నా, చదువుకొన్నా శూన్య ఫలితాలే వస్తున్నాయి. ఐరాస ఆశించిన ఫలితాలు రావాలంటే నాణ్యమైన విద్యతోపాటు, సాంకేతిక నైపుణ్యం యువతకు అందేటట్టు చూడాలి. గ్రామీణ ప్రాంత యువతలో ప్రస్తుత పరిస్థితి అధ్వానంగా ఉంది. ఆర్థిక అసమానత్వం వలనే యువతకు సరైన విద్య దొరకడం లేదు. ఆర్థిక స్తోమత కలవారు పట్టణాలకో, నగరాలకో వలసపోయి వృత్తిపరమైన, సాంకేతిక పరమైన నైపుణ్యాలను అలవరచుకుని ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఆర్థిక స్తోమత లేని వారంతా నైపుణ్యాలకు దూరమై, చదువుకున్నా, నిరక్షరాస్యులుగానే పరిగణింపబడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బాల్యం నుండే విద్యార్థులకు చదువుల్లో బలమైన పునాది పడాలి. సృజనాత్మకత, సునిశిత పరిశీలన, శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక పరమైన అంశాల్లో తగిన శిక్షణ నివ్వాలి. ఉన్నత విద్యలో నైపుణ్యత సాధిస్తేనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
- సుంకవల్లి సత్తిరాజు
97049 03463