పహల్గాం ఉగ్రఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం పాఠం ఉంటుందని భారత్ ఆశించింది. కానీ తీర్మానం ఎవరికీ ఏమాత్రం నొప్పి కలగని రీతిలో మొక్కుబడి తంతుగా ముగిసింది. “ అంతర్జాతీయ శాంతిభద్రతలకు తీవ్రమైన ప్రమాదం కలిగించే బహు రూపాల్లో, వ్యక్తీకరణల్లో ఉగ్రవాదం నెలకొంది. ఉగ్రవాద మూకలను, వారిని పెంచి పోషిస్తున్న బాధ్యులను చట్టం ముందుకు తీసుకురావలసిన అవసరం ఉంది” అని తీర్మానం ప్రకటించింది. ఈ ప్రకటనలతో ఎలాంటి ఫలితం ఉండదన్న సంగతి అందరికీ తెలిసిందే. పహల్గాం దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టిఆర్‌ఎఫ్) మొదట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ టిఆర్‌ఎఫ్ పేరు తీర్మానంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే టిఆర్‌ఎఫ్ వంటి ఉగ్రవాద పిల్ల సంస్థలకు మూలవేరుగా పేర్కొనే లష్కర్ ఇ తొయిబాను ఉగ్రవాద సంస్థగా భద్రతా మండలి ఎప్పుడో గుర్తించింది.
పహల్గాం దాడి వెనుక లష్కర్ ఇ తొయిబా ప్రేరణ ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లష్కర్ ఇ తొయిబా పేరు కానీ, దీంతో సంబంధం ఉన్న గ్రూపుల విషయం కానీ తీర్మానంలో ఎక్కడా పేర్కొనక పోవడం విశేషం. ముస్లిమేతరులను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదుల గురించి కానీ, మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించే లక్షం పెట్టుకున్న విద్రోహ చర్య గురించి కానీ, తీర్మానంలో రేఖామాత్రమైనా ప్రస్తావించలేదు. ఉగ్రవాద నిర్మూలన ప్రయత్నంలో గతంలో మాదిరిగా భారత ప్రభుత్వంతో అన్ని దేశాలూ సహకరించాలన్న సూచన కూడా తీర్మానంలో చోటు చేసుకోలేదు. ఇదివరకటి తీర్మానాలతో పోలిస్తే ఇప్పటి తీర్మానం భాష ముసాయిదా పూర్తిగా నీరు కారిపోయినట్టు స్పష్టమవుతోంది. రాజీ పూర్వకంగా అందరికీ ఆమోదయోగ్యమైన భాషను ఉపయోగించినట్టు తెలుస్తోంది. దీని వెనుక పాకిస్థాన్, చైనా దేశాల ప్రభావం ఉన్నట్టు చెప్పవచ్చు.
భద్రతా మండలికి శాశ్వతేతర సభ్య దేశంగా ఈ ఏడాదే పాకిస్థాన్ ఎన్నికైంది. పాకిస్థాన్‌కు సర్వకాల మిత్రదేశం చైనా. పాకిస్థాన్‌ను ఇరకాటంలో పెట్టే సంక్లిష్టమైన తీర్మానాలను తీసుకురాకుండా చూడడంలో చైనా హస్తం ఉంది. గతంలో కూడా అనేకసార్లు పాకిస్థాన్ పక్షాన చైనా నిలిచిన ఉదంతాలు ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడిపై తమపై వచ్చిన ఆరోపణలపై ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ ఎంతో ప్రయత్నిస్తోంది. దానికి చైనా, అమెరికా సాయం కోరుతోంది. ఈ సందర్భంలో పహల్గాం దాడిపై నిష్పాక్షిక దర్యాప్తును వేగవంతం చేయాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది. దానికి చైనా వంత పాడుతోంది. అమెరికా, రష్యా, బ్రిటన్ దేశాలైనా సరే పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఏ తీర్మానం తీసుకువచ్చినా ఆమోదం లోకి తీసుకురావద్దని ప్రస్తుత భద్రతా మండలి అధ్యక్షుడు , ఫ్రాన్స్ దౌత్యవేత్తకు పరోక్షంగా చైనా సంకేతాలందిస్తోంది.
ఫలితంగా భద్రతా మండలి తీర్మానం పసలేక మెత్తగా వెలువడింది. తీర్మానంలో టిఆర్‌ఎఫ్ పేరు లేకుండా చేయడంలో అమెరికాతో కలిసి చైనా లాబీ చేయడంలో కృతకృత్యురాలైంది. ఎలాంటి సాక్షాధారాలు లేవని టీఆర్‌ఎఫ్‌ను తప్పించింది. దీంతో టీఆర్‌ఎఫ్ తన ఇదివరకటి ప్రకటనను ఉపసంహరించుకుంది. టీఆర్‌ఎఫ్ పేరును తొలగించి భద్రతా మండలి తుది తీర్మానం ఖరారు చేసిన తరువాత పాకిస్థాన్ విధానపరమైన వైఖరికి అనుకూలంగా తనకు తాను మలచుకుంది. పాకిస్థాన్ సార్వభౌమత్వాన్ని , భద్రతను చైనా సమర్ధిస్తుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఝూ ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం. పాకిస్థాన్‌లో వివిధ ప్రాజెక్టుల్లో కొన్ని వేల మంది చైనా జాతీయులు పనిచేస్తున్నారు. మిత్రదేశమైన పాకిస్థాన్‌ను ఉగ్రవాద విషయంలో తూర్పారపట్టితే పాక్‌తో వైరం కొని తెచ్చుకోవలసి వస్తుందని, పాక్ లోని చైనా జాతీయులకు రక్షణ లేకుండా పోతుందని చైనా ముందుచూపుతో వ్యవహరిస్తోంది. భద్రతా మండలి వ్యవహారం భారత్‌కు అసంతృప్తి కలిగిస్తోంది.
ఉగ్రవాదాన్ని ఖండిస్తూ అత్యంత కఠినమైన పదజాలంతో తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలన్న ఆలోచనలో భారత్ ఉంది. పాకిస్థాన్ స్థావరంగా ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఇ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ నిర్వాకాన్ని పుల్వామా దాడి తరువాత భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. పహల్గాం దాడికి బాధ్యులైన టిఆర్‌ఎఫ్ వంటి ఉగ్రసంస్థలను ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాలకు నిరూపించాలన్న పట్టుదలతో భారత్ ఉంది. 2008 లోముంబై, 2019 లో పఠాన్‌కోట్, 2019లో పుల్వామా ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో అలాంటి ఉగ్రదాడులకు వీలు కల్పించకుండా ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని పాకిస్థాన్ గతంలో అనేక సార్లు భారత్‌కు ద్వైపాక్షిక చర్చలో హామీలు ఇచ్చింది. కానీ ఏవీ నెరవేర్చలేకపోయింది. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు కూడా సరిగ్గా సాగించడం లేదు.
పాకిస్థాన్ ఆర్థిక మూలాలపై వేటు వేయాలన్నది భారత్ ప్రధాన లక్షం. ఉగ్రసంస్థలకు పాకిస్థాన్ నిధులు అందిస్తోందన్న కారణం చూపించి ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ముందు పాక్‌ను నిలబెట్టాలని భారత్ సిద్ధమవుతోంది. 2012 నుంచి 2015,2018 నుంచి 2022 సమయాల్లో పాకిస్థాన్‌ను గ్రే లిస్టులో ఫైనాన్షియల్ టాస్క్‌ఫోర్సు ఉంచిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రపంచ వేదిక సాక్షిగా ఉగ్రవాద నిర్మూలనకు బహుముఖ ప్రయత్నాలు చేయాలని భారత్ యోచిస్తోంది. ముంబై ఉగ్రదాడుల్లో కీలక పాత్ర వహించిన ఉగ్రవాది తహవూర్ రాణాను అమెరికా నుంచి బహిష్కరింప చేసి ఏ విధంగా భారత్ తన చట్టం ముందుకు తీసుకు రాగలిగిందో అదే విధంగా పహల్గాం ఉగ్రదాడి ముష్కరులను న్యాయస్థానం ముందు నిలబెట్టగలిగితేనే పహల్గాం దాడిలో అమరులైన వారికి ఆత్మశాంతి లభిస్తుంది.