భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో బెంబేలెత్తిపోతున్న పాకిస్తాన్‌కు నైరుతి ప్రాంతంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) నుంచి కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా స్వయంపాలన కోసం పోరాడుతున్న బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు అదను చూసి మరీ పాక్ సైన్యంపై దాడులను ఉధృతం చేస్తున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి ఇదే తగిన సమయమని భావించినవారు మరో అడుగు ముందుకువేసి తమ ప్రాంతాన్ని బలూచిస్థాన్ రిపబ్లిక్‌గా ప్రకటించుకున్నారు. పోరాటయోధుడు మిర్ యార్ బలూచ్ నేతృత్వంలో బలూచిస్థాన్ నేతలు ఈ నెల 9న పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు.
అంతేకాకుండా పాక్‌పై భారత్ చేస్తున్న దాడులకు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటుగా ఆ పోరాటానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. మరో వైపు బలూచిస్థాన్ రిపబ్లిక్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని, తమ దేశాల్లో బలూచిస్థాన్ దౌత్య కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలని ఐక్యరాజ్యసమితితో పాటుగా అన్ని ప్రపంచ దేశాలకు వారు విజ్ఞప్తి చేశారు కూడా. చూడడానికి ఇది ఓ మామూలు ప్రకటనగా కనిపిస్తున్నప్పటికీ దీని ప్రభావం పాకిస్తాన్ సుస్థిరతపైనా, అలాగే దక్షిణాసియా భౌగోళిక పరిస్థితులపైనా తీవ్ర ప్రభావం చూపించనుంది. ఎందుకంటే భౌగోళికంగా పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావియన్స్ అయిన బలూచిస్థాన్ గత కొన్ని దశాబ్దాలుగా అశాంతికి నిలయంగా కొనసాగుతోంది. పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటూ తమ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, ఇక్కడి ప్రజలను నిరుపేదలుగా మారుస్తోందని స్థానికులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.
అందుకే తమకు స్వయం పాలనాధికారం కావాలంటూ అక్కడి వారు పోరాటం చేస్తున్నారు. అంతేకాదు ఆ ప్రాంతంలో బలవంతపు కిడ్నాప్‌లు, చట్ట వ్యతిరేక హత్యలు లాంటివి ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో పెచ్చుమీరిపోయాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నివేదికలు చెబుతున్నాయి. వీటన్నిటినీ భరించలేని తిరుగుబాటుదారులు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) పేరిట గత కొంత కాలంగా పాకిస్తాన్ సైన్యమే లక్షంగా దాడులు కొనసాగిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పెద్ద సంఖ్యలో పాక్ సైనికులను మట్టుబెడుతూ పాక్ ఫెడరల్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. గత మార్చిలో క్వెట్టానుంచి పెషావర్‌కు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును బిఎల్‌ఎ తిరుగుబాటుదారులు హైజాక్ చేయడం వారి ఉద్యమంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ప్రయాణికులను విడిపించడానికి పాక్ సైన్యం బ్రహ్మప్రయత్నమే చేయాల్సి వచ్చింది.
పాక్ ప్రభుత్వం నిషేధిత ఉగ్రవాద సంస్థగా ముద్రవేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌లోని బలూచీ గిరిజన జాతుల విమోచన కోసం పోరాడుతోంది. పాకిస్తాన్‌లోని సింధీలు, పంజాబీలు నివసించే ప్రాంతాలు కొంత మేరకు అభివృద్ధి చెందినప్పటికీ వైశాల్యపరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన బలూచీస్థాన్ మాత్రం ఇప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతంగానే ఉంది. రాష్ట్రంలో అపారంగాఉన్న అరుదైన ఖనిజాలు, చమురు, సహజ వాయు నిక్షేపాలు లాంటి వాటిని తరలించుకుపోతున్న ఇస్లామాబాద్ ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే అసంతృప్తి స్థానిక ప్రజల్లో చాలా కాలంగా గూడుకట్టుకుని ఉంది. దీంతో ఈ ప్రాంతంలో చాలా కాలంగా తిరుగుబాటు ఉద్యమాలు బలపడ్డాయి. 2007లో బాలాచ్ మర్రి నాయకత్వంలో ఏర్పడిన బలూచీస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవలి కాలంలో బలమైన సంస్థగా ఎదిగింది. ఇటీవలి కాలంలో బిఎల్‌ఎ 70కి పైగా ప్రధాన దాడులు జరిపినట్లు అంచనా.
తాజాగా ఓ వైపు ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్న తరుణంలో పలు తిరుగుబాటు గ్రూపులు మూకుమ్మడిగా పాక్ సైన్యంపై పెద్ద ఎత్తున దాడి చేసి 16 మంది సైనికులను హతమార్చాయి. బలూచిస్థాన్‌లోని ప్రధాన నగరమైన క్వెట్టా ఇప్పుడు తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిఎల్‌ఎ పాకిస్థాన్ నుంచి విడిపోయి కొత్త దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ కోరడం భారత ప్రభుత్వానికి కొంత సంకట పరిస్థితిని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ప్రత్యేక బలూచిస్థాన్ ఏర్పాటు డిమాండ్‌ను సమర్థించినట్లయితే దౌత్యపరంగా అది పాక్‌ను మరింతగా బలహీనపరిచినట్లవుతుంది.
కానీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోవడానికి కారణమవుతుంది. అందుకే ఈ విషయంలో భారత్ మౌనంగా ఉండడం మంచి వ్యూహమేనని చెప్పాలి. మరో వైపు చైనా వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్న గ్వాడార్ పోర్టు, చైనాపాక్ ఆర్థిక కారిడార్ (సిపిఇసి) బలూచిస్థాన్ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే స్వతంత్ర బలూచిస్థాన్‌ను ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తిరుగుబాటుదారులు చేసిన ప్రకటనకు ప్రపంచ దేశాల నుంచి ప్రస్తుతానికి ఎలాంటి మద్దతూ లభించకపోయినప్పటికీ తమ ఉద్యమం ఆగిపోదని, మరింత బలపడుతుందనే సందేశాన్ని మాత్రం అది ఇచ్చింది. ఒకవేళ భారతదేశం డిమాండ్ చేస్తున్నట్లుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి అప్పగించడంతోపాటుగా అటు బలూచిస్థాన్‌ను కూడా కోల్పోవలసి వచ్చినట్లయితే పాక్ ముక్కలయినట్లేనని చెప్పాలి. తమ హక్కులకోసం బలూచీలు చేస్తున్న పోరాటం న్యాయమైనదే అయినప్పటికీ వారు ఎంచుకున్న మార్గం అంత సులువైనది, ఇప్పటికిప్పుడు నెరవేరేది మాత్రం కాదనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఒకవేళ తిరుగుబాటుదారులు తమ పోరాటంలో విజయం సాధించడమే జరిగితే దక్షిణాసియా భౌగోళిక స్వరూపమే మారిపోవడం ఖాయం.