Saturday, February 4, 2023

పాక్ పతనావస్థ!

- Advertisement -

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోడం ఆశ్చర్యపోవలసిన అంశం కాదు. అతి వేగంగా పురోగమిస్తున్నదనుకొన్న బంగ్లాదేశే ఆర్థిక కల్లోలాన్ని ఎదుర్కొంటుండగా సకల అరాచకాలు తాండవించే పాకిస్తాన్ కష్టాల పాలు కావడం విస్తుగొలపదు. దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గం.లకే మూసివేయాలని, పెళ్ళి మంటపాలు, ఫంక్షన్ హాల్స్ 10 గం.కే బంద్ చేయాలని పాక్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు అక్కడి గడ్డు పరిస్థితిని తెలియజేస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి, ఆ దిశగా విద్యుత్తును పొదుపు చేయడానికి ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దిగుమతి చేసుకొంటున్న ఆయిల్ మీద ఆధారపడి పాకిస్తాన్‌లో అత్యధిక భాగం విద్యుత్తును ఉత్పాదన చేస్తున్నారు. ఈ ఆయిల్ దిగుమతికి ఏటా 3 బిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు.

పాకిస్తాన్ వద్ద ప్రస్తుతమున్న విదేశీ మారక ద్రవ్యం కేవలం 6.72 బిలియన్ డాలర్లే. గత నాలుగేళ్ళలో ఈ నిల్వలు ఈ స్థాయికి పతనం కావడం ఇదే మొదటిసారి. గత జూన్‌లో వచ్చిన భారీ వరదలు దేశ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బ తీశాయి. ఈ వరదల వల్ల పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోయింది. వరదల్లో 16 వందల మంది చనిపోయారు. 3 కోట్ల 30 లక్షల మంది స్వస్థలాల నుంచి చెల్లాచెదురయ్యారు. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు మిన్నంటడం వల్ల దేశంలో వివిధ సరకుల రవాణా ఛార్జీలు ఎగబాకాయి. పర్యవసానంగా పాక్ ఆర్థిక కష్టాలు విపరీతమయ్యాయి. ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి పెరిగిపోయింది. ధరలు మండడం ప్రారంభించాయి. అసలే కోతి, ఆపైన కల్లు తాగిందన్నట్టు పాక్ తరచూ రాజకీయ సంక్షోభంలో మునిగిపోడం, పాలనా పరమైన అస్థిరత్వానికి గురి కావడం కూడా దాని ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బ తీసింది. పూర్వ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు దూరం కావడం, చైనాతో మరింతగా పూసుకోడం ఆయన పదవికి ముప్పు తెచ్చింది. ఈ పరిస్థితిని చక్కదిద్ది తిరిగి అమెరికాతో సాన్నిహిత్యాన్ని సాధించుకోడానికి ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రయత్నిస్తున్నారు. చైనాతో సంబంధాలు పాకిస్తాన్‌ను అప్పుల ఊబిలోకి నెట్టివేసిన మాట వాస్తవం.

దానితో కలిసి నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇస్లామాబాద్ శక్తికి మించినదైపోయింది. దీని కిందనే చైనాకు పాకిస్తాన్ 64 బిలియన్ డాలర్లు రుణపడింది. ఈ రుణం 2014లో 47 బిలియన్ డాలర్లు. సౌదీ అరేబియాతో గల సాన్నిహిత్యం కూడా ఈ సంక్షోభంలో పాక్‌కు ఉపయోగపడకపోడం గమనించవలసిన విషయం. 2021లో సౌదీ అరేబియా డెవెలప్‌మెంట్ ఫండ్‌తో 3 బిలియన్ డాలర్ల అప్పు కోసం పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకొన్నది. 2013, 2016, 2018లో ఐఎంఎఫ్, యుఎఇ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), చైనా నుంచి అప్పులు అర్థించింది. ఈ విధంగా బయటి నుంచి దొరికిన ప్రతి పైసా రుణాన్ని వాడుకొంటూ పాక్ పాలకులు కథ నడిపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా వున్నప్పుడు ఒక దశలో పాకిస్తాన్‌కు అదనంగా ఒక్క పైసా కూడా అప్పు ఇవ్వబోనని చైనా తెగేసి చెప్పింది.

పాక్ విదేశీ రుణాల్లో 25 శాతం మేరకు చైనా నుంచి తెచ్చుకొన్నవే. ఐఎంఎఫ్ రుణాలు అనేక షరతుల మీద మాత్రమే లభిస్తాయనే సంగతి తెలిసిందే. రుణ షరతుల సడలింపుపై ఐఎంఎఫ్‌తో పాక్ చర్చలు జరుపుతున్నది.ఈ నేపథ్యంలో విద్యుత్తు వినియోగంపై ఆంక్షలు విధించినట్టు అర్థమవుతు న్నది. దేశంలోని ఉన్నత వర్గాలు ఏటా 17.4 బిలియన్ల డాలర్ల మేరకు పన్ను రాయితీలు పొందుతున్నారు. ఇది సామాన్య ప్రజానీకం మీద విపరీతమైన భారం వేస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిన కష్టాలు మామూలే. విదేశీ రుణం ఏడాదికి 10.8 శాతం మేరకు పెరుగుతున్నదంటే పాక్ ఆర్థిక సంక్షోభం ఎంత లోతైనదో అర్థం చేసుకోవచ్చు. దేశ దుస్థితికి కారకుడు గత ప్రధాని ఇమ్రాన్ ఖానేనని షరీఫ్ ఆరోపిస్తున్నారు.

రాజకీయంలో ఇది మామూలే. అయితే భారీ రుణాల ద్వారా సేకరించిన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆయిల్ తదితర దిగుమతుల కింద ఖర్చు పెట్టి దేశాన్ని నడిపించడం ఏ పాలకులూ చేయదగిన పని కాదు. డాలర్ నిల్వలొక్కటే దేశ మనుగడకు ప్రధానమైనవి అనే పరిస్థితి ఎప్పుడూ కష్టాలనే తెస్తుంది. పాక్ ఎగుమతులు కురచ దిగుమతులు పొడవు. వర్ధమాన దేశాలు విదేశీ వాణిజ్య లోటులో ఉన్నంత కాలం రుణ ఊబిలో కూరుకుపోక తప్పదు. ప్రతి అవసరాన్ని ముఖ్యంగా ఇంధన డిమాండ్‌ను దేశీయ వనరుల ద్వారా తట్టుకోగలిగే స్థితిని సాధించడం తక్షణ అవసరం. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దిశగా ఏమి చేసి ఎలా విదేశీ మారక ఒత్తిడిని తట్టుకుంటుందో ఇక ముందు కూడా మరింతగా అప్పు చేసి పప్పు కూడు తింటుందో వేచి చూడవలసిన అంశం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles