Tuesday, June 18, 2024

పాక్‌లో ఉమ్మడి ప్రభుత్వం?

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ హంగ్ నేషనల్ అసెంబ్లీ నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తక్షణమే సాధ్యం కాలేదు. మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ -ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతుతో పోటీ చేసిన ఇండిపెండెంట్లు అత్యధిక స్థానాలు గెలుచుకోడంతో మిగతా అనేక పార్టీల ఐక్య సంఘటన రూపొందడానికి ఐదారు రోజులు పట్టింది. ఈ ఉమ్మడి శక్తి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి పిఎంఎల్ ఎన్ (ముస్లిం లీగ్ నవాజ్) పార్టీకి చెందిన మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఉంటారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 265 స్థానాలున్న నేషనల్ అసెంబ్లీలో 97 స్థానాలను పిటిఐ -ఇండిపెంట్లు గెలుచుకోగా, తరువాత అతిపెద్ద పార్టీగా పిఎంఎల్ ఎన్ 80 స్థానాలు గెలుచుకొన్నది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) 54 స్థానాల్లో విజయం సాధించింది. ఈ రెండు, ఇతర చిన్న చితక పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని సమాచారం. ఈ ఏర్పాటు ఎంత కాలం సజావుగా సాగుతుందోనన్న అనుమానాలు దేశంలో అస్థిరతను కొనసాగించడం సహజం.

తనను జైల్లో తోసినా, తన పార్టీ గుర్తును రద్దు చేసినా ఇండిపెండెంట్లను బరిలో దింపి తడాఖా చూపిన ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్రభుత్వానికి సవాలుగానే ఉంటాడు. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత 72 ఏళ్ల షెహబాజ్ షరీఫ్ ప్రధాని పదవిని చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయంగా అంతమొందించడానికి సైన్యం పన్నిన కుట్రలను పాక్ ప్రజలు సహించలేదని ఈ ఎన్నికలు చాటాయి. ముఖ్యంగా పాక్ యువత ఇమ్రాన్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. పిఎంఎల్ ఎన్, పిపిపిల ఐక్య సంఘటన పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అపూర్వ ఆర్ధిక సంక్షోభం నుంచి ఏ విధంగా గట్టెక్కిస్తుంది అనేది అతిపెద్ద ప్రశ్న. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి అతి తక్కువ విదేశీ మారకద్రవ్యంతో దినదిన గండంగా గడుపుతున్నది. అతి కష్టం మీద అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి తాజా రుణాన్ని సంపాదించగలిగింది. పరిశ్రమల మూసివేతతో, కొత్త పెట్టుబడులు రాకపోడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉచిత ఆహార శిబిరాల వద్ద తొక్కిసలాటలు, దుర్మరణాలు చోటు చేసుకొంటున్నాయి. లక్షలాది మంది బాలలు బడులు మానుకొంటున్నారు.

వీటన్నిటికి తోడు ఉగ్రవాద దాడులు సర్వసాధారణమైపోయాయి. చైనా, సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలు ఆదుకొంటున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు. ఈ సమస్యలను అతుకుల బొంత వంటి కొత్త ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించగలుగుతుందో చూడాలి. పాక్‌లో ఏ ప్రభుత్వం వచ్చినా సైన్యం చెప్పుచేతల్లో నడుచుకోడం దానికి తక్షణ అతి పెద్ద సవాలు అవుతుంది. సైన్యంతో పడకపోడం వల్లనే అనేక మంది ప్రధానులు పదవులు, అధికారాన్ని కోల్పోయారు. ఒక ప్రముఖ ప్రధాని ఉరికంబం ఎక్కారు. ఇమ్రాన్ ఖాన్ విషయంలోనూ సైన్యం కన్నెర్ర ఆయనను అనేక బాధలకు గురి చేస్తున్నది.సైనిక ప్రజాస్వామ్యంలో ప్రజలే పరాజితులు అవుతారు అనడానికి పాకిస్తాన్ ఒక ప్రబల నిదర్శనం. పాక్‌లో విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయింది. పదేళ్ల వయసు పిల్లల్లో 78% మంది ఆ వయసుకు ఉండాల్సిన చదువు లేదు. ఇరవై మిలియన్ల మంది బాలలు బడికి దూరంగా ఉన్నారు.

అక్షరం ముఖం ఎరుగరు. పాలకులు ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దలేకపోడం వల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గిపోయింది. ప్రస్తుత సంక్షోభం పాక్‌ను సమూల ఆర్ధిక సంస్కరణల వైపు మళ్ళించాలని నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి సాహస నిర్ణయాలు కొత్త ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. రాజకీయాల్లో సైన్యం జోక్యమే పాక్‌ను పీడిస్తున్న అతి పెద్ద రోగమని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి మారకపోతే దేశం అతి పెద్ద ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆయన అరెస్టు తర్వాత దేశంలో చెలరేగిన అల్లర్లు సైన్యానికి తల తీసినట్టు చేశాయి. 75 ఏళ్ల పాక్ చరిత్రలో దాదాపు సగ కాలం సైన్యం పరిపాలించింది. సీనియర్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, తాజా మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్ళీ ప్రధాని పదవిని చేపడితే బలవంతుల మెడలు వంచి సాధారణ ప్రజల ప్రయోజనాలు సాధించే విధంగా ఆర్థిక రంగాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారో. దేశాన్ని ఉగ్రవాద శిబిరంగా మార్చారు అనే వాస్తవం నుంచి ఎలా విముక్తిని సాధిస్తారో వేచి చూడవలసిన మహాద్భుతమే. పాకిస్థాన్ వ్యూహాత్మక స్థానంలో వుంది. ఒకప్పుడు అమెరికా అడ్డాలబిడ్డగా అసాధారణ ప్రయోజనాలు పొందింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News