Thursday, June 20, 2024

ఇమ్రాన్ గుగ్లీ.. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు

- Advertisement -
- Advertisement -

Pakistan National Assembly Cancelled

ఇమ్రాన్ గుగ్లీ
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు
అవిశ్వాస తీర్మానానికి తిరస్కరణ
డిప్యూటీ స్పీకర్ నిర్ణయం
3 నెలల్లో తాజా ఎన్నికలు
ఆదివారం హైడ్రామా ఉత్కంఠ
సుప్రీంకోర్టుకు ప్రతిపక్షాలు
విదేశీ కుట్రసాగదు: పిటిఐ
రాజ్యాంగ ఉల్లంఘన చెల్లదు: ప్రతిపక్షం
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)ని ఆదివారం రద్దు చేశారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం దశలో ఒక్కరోజులోనే అత్యంత వేగంగా కీలక పరిణామాలు జరిగాయి. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని దేశాధ్యక్షుడికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫార్సు చేశారు. ఆ తరువాత దేశాధ్యక్షులు అరిఫ్ అల్వీ ఓ ప్రకటన వెలువరిస్తూ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో మూడు నెలల్లో తాజాగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని ఇమ్రాన్ ఖాన తెలిపారు. అంతకు ముందు సభలో అత్యంత నాటకీయ పరిణామంగా పిటిఐ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. దీనిపై ప్రతిపక్షం మండిపడింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. సభలో ఇమ్రాన్‌పై బలపరీక్ష జరుగుతుందని, తమ సత్తా నిరూపించుకోవచ్చునని ప్రతిపక్షాలు ఆశిస్తూ వచ్చాయి.

క్రికెటర్‌గా పేరొందిన బౌలర్‌గా రికార్డులు ఉన్న ఇమ్రాన్ అనూహ్యంగా చివరి బంతిలో గుగ్లీకి దిగారు. అవిశ్వాస తీర్మానం చెల్లనేరదని, దీనిని తిరస్కరిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ క్వాసిం సూరి ప్రకటించారు. దేశ రాజ్యాంగం, పాకిస్థాన్ నిబంధనలను ఉల్లంఘించేదిగా ఉన్న తీర్మానానికి తాము అనుమతిని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. మరో వైపు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ అత్యంత ఆంతరింగికులతో సమావేశం అయిన తరువాత జాతీయ అసెంబ్లీని రద్దు చేసేందుకు దేశాధ్యక్షుడికి సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. విదేశీ శక్తులతో కలిసి తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సాగించిన కుట్రలు విఫలం అయ్యాయని, తన బలం ఏమిటనేది ప్రజలలోనే తేల్చుకుంటానని, ఎన్నికలకు వెళ్లుతున్నామని తెలిపారు. ఇక ప్రతిపక్షాలు ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తాయి? ప్రజా ఆందోళనలకు పిలుపు నిస్తాయా? అనేది తేలలేదు. ప్రధాని ఇమ్రాన్ ఆదివారం హుటాహుటిన జాతిని ఉద్ధేశించి టీవీల ద్వారా కొద్ది సేపు మాట్లాడారు. ప్రజులు ఇక ఎన్నికలకు సిద్ధం కావాలని, ఇదే ప్రజాస్వామ్య బలోపేతానికి మిగిలిన మార్గం అని తెలిపారు. తన ప్రభుత్వ పతనానికి జరిగిన కుట్ర విఫలం అయిందని, దీనిని తాము చిత్తు చేశామని తెలిపారు. జాతీయ అసెంబ్లీ రద్దు అయినట్లే, ఎన్నికలు మూడు నెలల్లో జరుగుతాయని ప్రకటించారు. ఆదివారం ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీ సమావేశానికి కూడా హాజరుకాలేదు. మరో వైపు ఆయన పిలుపు మేరకు మద్దతుదార్లు వీధుల్లోకి వచ్చి ఇమ్రాన్‌కు అనుకూలంగా ప్రజల సమీకరణకు యత్నించారు. పాకిస్థాన్ వెలుపల నుంచి ఇమ్రాన్ కూల్చివేతకు కుట్ర జరుగుతోందని, దీనిని దేశ ప్రజలు సహించరాదని, శాంతియుతంగా నిరసనలకు దిగాలని ఇమ్రాన్ మద్దతుదార్లు పిలుపు నిచ్చారు. పలు ప్రాంతాలలో ఈ పరిణామాలతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పలు కీలక పరిణామాల తరువాత దేశంలో అనిశ్చిత పరిస్థితి నెలకొనకుండా ఉండేందుకు ఆపద్ధర్మ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ కొనసాగుతారని అధ్యక్ష భవనం నుంచి ప్రకటన వెలువడింది. దీనితో అధికార పగ్గాలు ఇప్పటికీ ఇమ్రాన్ గుప్పిట్లోనే భద్రంగానే ఉన్నాయి.
రాజ్యాంగ ఉల్లంఘనే: ప్రతిపక్షం
అవిశ్వాస తీర్మానాన్ని ఈ దశలో తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం అని దేశంలోని సమైక్య ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేసింది. సభలో అవిశ్వాస తీర్మానానికి అనుమతిని ఇవ్వడం ప్రజాస్వామ్య యుతం. దీనిని ఏ కారణంతో కాదంటారని నిలదీశారు. తాము పార్లమెంట్‌లోనే భైఠాయిస్తామని, న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని తెలిపారు. తమ లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వెళ్లుతున్నారని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) నేత బిలావల్ భుట్టో జర్దారీ తెలిపారు.
అమెరికానే అసలు విలన్: ఇమ్రాన్
దేశ అంతర్గత రాజకీయాలలో దేశ వ్యవహారాలలో అమెరికా జోక్యం మితిమీరిందని, దీనిని తాము సహించేది లేదని ఇమ్రాన్ ఖాన్ అంతకు ముందు హెచ్చరించారు. అమెరికా వర్గాలతో ఇక్కడి ప్రతిపక్షం కుమ్మక్కు అయింది. తనను గద్దెదింపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తాను పలు కీలక విషయాలలో అమెరికా, యూరప్‌లకు సాయం చేయకపోవడంతో వారు అక్కసు పెంచుకున్నారని విమర్శించారు. ప్రపంచ సమస్యలపై రష్యా చైనాలకు వ్యతిరేకంగా తాను స్పందించకపోవడం అమెరికా ఆగ్రహానికి కారణం అని ఇమ్రాన్ తెలిపారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (పిటిఐ)కి ఇటీవలి పరిణామాలతో బలం తగ్గింది. అవిశ్వాసానికి వెళ్లితే ప్రభుత్వ పతనం ఖాయం అని స్పష్టం అయింది. ఈ దశలో ఇప్పుడు ఏకంగా అవిశ్వాస తీర్మానం ప్రసక్తే లేకుండా పోవడంతో ప్రతిపక్షాలు కంగుతిన్నాయి.

Pakistan National Assembly Cancelled

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News