Saturday, September 21, 2024

ఎన్నాళ్లీ మారణహోమం?

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: పాలస్తీనాకు చెందిన తీవ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి సరిగ్గా ఆరు నెలలు గడిచాయి. అప్పట్లో ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ తనకు తానుగా విధించుకున్న షరతులు రెండే రెండు. హమాస్‌ను సమూలంగా నిర్మూలించడం, మిలిటెంట్ల చెరలో ఉన్న బందీలను విడిపించడం. ఈ ఆరు నెలల కాలంలో హమాస్ తీవ్రవాదుల మాట అటుంచి, వేలాది అమాయక పౌరులు కన్నుమూశారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఈ మారణహోమంలో అసువులు బాసినవారి సంఖ్య అక్షరాలా 33 వేలు! ఎటు చూసినా మొండిగోడలు, ధ్వంసమైన రహదారులతో గాజా నగరం శ్మశానాన్ని తలపిస్తోంది. సుమారు పది లక్షల మంది పాలస్తీనా వాసులు క్షుద్బాధతో అలమటిస్తున్నారు. చిన్నారులు పట్టెడన్నం దొరక్క ఆకలితో కన్నుమూస్తున్నారు. యుద్ధోన్మాదంతో మిడిసిపడుతూ, కన్నూమిన్నూ గానకుండా ప్రవర్తిస్తున్న ఇజ్రాయెల్‌కు ఇవేమీ కనబడటం లేదు. ప్రధాని నెతన్యాహు వైఖరి చూస్తే హమాస్ తీవ్రవాదులే కాదు, గాజావాసులు కూడా ఎవరూ మిగలడానికి వీల్లేదని కంకణం కట్టుకున్నట్లుగా ఉంది.

ప్రజాస్వామ్యం ముసుగులో నియంతల ఏలుబడిలో ఉన్న ఓ దేశం ఇంతకంటే భిన్నంగా ప్రవర్తిస్తుందని, అమాయక పౌరుల పట్ల కరుణ చూపిస్తుందని ఎలా అనుకోవడం? గాజాను తుడిచిపెట్టిన ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యంగా రఫా నగరంపై దృష్టి సారించింది. గాజాను యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో లక్షలాదిమంది దక్షిణాన ఉన్న రఫాకు వలసపోయారు. ఇజ్రాయెల్ వైఖరి చూస్తుంటే అక్కడ కూడా వారిని బతికి బట్టకట్టనిచ్చేటట్లు లేదు. ఇజ్రాయెల్ యుద్ధోన్మాద వైఖరికి గాజాలో వరల్డ్ సెంట్రల్ కిచెన్ సిబ్బందిని బలిగొన్న సంఘటనను తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మానవతా సాయం అందకుండా స్వచ్ఛంద సంస్థలకు చెందిన వాహనాలను గాజా సరిహద్దులకు ఆవలే ఇజ్రాయెల్ నిలిపివేస్తోందంటూ ఐక్యరాజ్యసమితి సిబ్బందే స్వయంగా ఆరోపిస్తున్న వేళ.. ఏకంగా మానవతా సాయం అందజేస్తున్న ఏడుగురు సిబ్బందిపై డ్రోన్ దాడి జరిపి పొట్టన పెట్టుకోవడం ప్రపంచ దేశాలను విస్తుపోయేలా చేసింది. ఇదొక ఘోరమైన తప్పిదమంటూ ఇజ్రాయెల్ ప్రధాని మొసలి కన్నీరు కార్చినా, ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగినదేనని వరల్డ్ సెంట్రల్ కిచెన్ వ్యవస్థాపకుడు జోస్ ఆండ్రెస్ కుండబద్దలు కొట్టారు. అటు రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ను ఎగదోస్తున్న అగ్రరాజ్యం అమెరికా ఇటు ఇజ్రాయెల్‌కు మొదటి నుంచీ వంత పాడుతూనే ఉంది.

వరల్డ్ సెంట్రల్ కిచెన్ సిబ్బందిపై జరిగిన దాడిపై అమెరికా అధినేత కంటితుడుపుగా ‘తీవ్ర ఆగ్రహం’ వ్యక్తం చేసినా, అదే రోజు తన మిత్ర దేశానికి వేలాది బాంబులను, యుద్ధ విమానాలను అందించి, ఆర్థిక స్వప్రయోజనాలే తమకు ముఖ్యమన్న సంగతిని చెప్పకనే చెప్పారు. గాజాపై జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ వినియోగిస్తున్న ఆయుధాల్లో 70 శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. అలాంటప్పుడు యుద్ధ విరమణకు అమెరికా చిత్తశుద్ధితో కృషి చేస్తుందనుకోవడం అవివేకం. రంజాన్ మాసం నడుస్తున్నందున గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి చేసిన తీర్మానానికి మద్దతు ఇవ్వడంలోనూ అమెరికాది కప్పదాటు వైఖరే. ఓటింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా మిత్ర దేశాన్ని నొప్పించకుండా చూసుకోవడం..

ఇజ్రాయెల్ పట్ల ఆ దేశానికి గల అవ్యాజానురాగాలు ఏపాటివో చెప్పకనే చెబుతోంది. యుద్ధ విరమణ దిశగా సాగుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడానికి బందీల విడుదలలో ఏర్పడిన ప్రతిష్టంభన ప్రధాన కారణం. తన వద్ద ఇప్పటికీ బందీలుగా ఉన్న 130 మంది ఇజ్రాయెల్ వాసులను విడచిపెట్టేందుకు హమాస్ పలు షరతులు విధించింది. శాశ్వత కాల్పుల విరమణ, గాజా స్ట్రిప్ నుంచి శత్రుసేనలు పూర్తిగా వైదొలగడం, ఇళ్లూవాకిళ్లూ కోల్పోయి తలోదిక్కుకూ పోయిన నిరాశ్రయులు తిరిగి స్వస్థలాలకు చేరుకోవడం వంటివి వాటిలో కొన్ని.

అయితే తాత్కాలికంగా మాత్రమే యుద్ధ విరమణ ఉంటుందంటున్న ఇజ్రాయెల్, గాజాలో హమాస్‌ను తుడిచిపెట్టేంత వరకూ విశ్రమించబోమని తెగేసి చెబుతోంది. దీంతో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్ట్, ఖతార్ దేశాధినేతలు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు. హమాస్‌ను తప్పుపడుతున్న వివిధ దేశాల పెద్దలు.. ఇజ్రాయెల్ బందీలుగా చేసుకున్న వేలాది పాలస్తీనియన్ల గురించి, పాలస్తీనా మహిళలపై ఇజ్రాయెల్ సైనికులు సాగిస్తున్న అత్యాచారాల గురించి పెదవి విప్పడం లేదు. పైపెచ్చు శవాలపై పేలాలు ఏరుకుంటున్న చందంగా ఇంతటి మారణహోమంలోనూ తన ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న ఆమెరికా ధోరణే ఆరు నెలలుగా ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం కొనసాగడానికి కారణమని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News