Monday, July 15, 2024

‘ఎమర్జెన్సీ’ దాడి ఇంకెన్నాళ్లు?

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ప్రధాని మోడీ 50ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ పరిస్థితిని గుర్తుకు తెస్తూ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మాయని మచ్చగా పరోక్షంగా కాంగ్రెస్‌ను దృష్టిలో పెట్టుకుని ధ్వజమెత్తారు. అంతటితో ఆగలేదు. స్పీకర్, రాష్ట్రపతి నోట ‘ఎమర్జెన్సీ’ ప్రస్తావనే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తీసుకొచ్చారు. విపక్షనేతగా మొదటిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనేక అంశాలు సభ ముందు లేవనెత్తారు. మణిపూర్ రావణ కాష్ఠంలా రగులుతున్నా ప్రధాని మోడీ కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కానీ ఒక్కసారీ మణిపూర్‌ను ఎందుకు సందర్శించ లేదు అని ప్రశ్నించారు. హిందూమతం అంటే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కాదని గుర్తు చేశారు. అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టి యువత భవిష్యత్ అయోమయం చేశారని నిలదీశారు. నోట్ల రద్దు నుంచి పౌరసత్వ సవరణ చట్టంవరకు ఎన్నో సమస్యలను రాహుల్ నిక్కచ్చిగా సభ ముందుంచినా వీటిలో ఏఒక్కదానికి మోడీ సర్కారు నుంచి సమాధానం రాకపోవడం గమనార్హం. ఎమర్జెన్సీని పదేపదే తిట్టిపోసే ప్రధాని నరేంద్ర మోడీ తన హయాంలో అంతకు మించి దురహంకార,

దౌర్జన్యాలతో ప్రజల హక్కులను అణగదొక్కుతున్నారన్న విమర్శలు కొట్టి పారేయలేం. గురివిందగింజ తన నలుపెరగనట్టు తన పాలనలో ఎంత అరాచకం జరుగుతోందో మోడీ గమనించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని బలిపీఠంపై పెట్టి ప్రజల హక్కులను హరిస్తున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రజలకు వాస్తవ సమాచారం అందకుండా చేయడంలో మోడీ సర్కారు అందవేసిన చెయ్యిగా మేధావులు చెబుతున్నారు. ముఖ్యం గా తనకు వ్యతిరేకంగా ఉండే అభిప్రాయాలు, విశ్లేషణలు వార్తలకు ఎక్కనీయడం లేదు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టింగ్‌లను పరిశీలించి వాటిలో ఏదైనా నకిలీ లేదా అబద్ధపు వార్త (ఫేక్ న్యూస్)గా గుర్తించి దానిని తొలగించే పనిని కేంద్ర ప్రభుత్వం అధీనంలోని పిఐబి (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)కి దఖలు పర్చడం ఎంతవరకు న్యాయం? ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సమాచార సాంకేతిక విభాగం నిబంధనలను మార్చడానికి కూడా సిద్ధమైంది. ఇది ఆనాటి ఎమర్జెన్సీకి ఏ విధంగా విరుద్ధమైనదో, భిన్నమైనదో ఎవరైనా ఎలా చెప్పగలరు? ఎమర్జెన్సీ సమయంలో పత్రికల్లో వార్తలపై నియంత్రణ కత్తెర వేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కూడా అదే విధంగా మోడీ తమకు వ్యతిరేకంగా వచ్చిన వార్తలపై కత్తెర వేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను వినియోగించుకోడానికి ప్రయత్నించడం పరోక్షంగా ఎమర్జెన్సీయే కదా! అలాగే దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛను మేం కల్పించామని మోడీ రాజ్యసభలో బుధవారం గొప్పగా చాటుకున్నారు. అంటే దర్యాప్తు సంస్థలు విపక్షనేతలపై గురిపెట్టి కేసులు బనాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేనా? ఎన్‌ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసుల సంగతి అందరికీ తెలిసిందే. సుప్రీం ధర్మాసనం ఎన్నో సార్లు ఈ దర్యాప్తు సంస్థల కేసుల డొల్లతనం ఎండగట్టిన సంగతి కూడా తెలిసిందే. కేవలం ప్రతిపక్షాలను బోనుకెక్కించడానికే ఈ దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి తప్ప అధికార బిజెపి నేతలు ఎవరిపైనా కేసులు దాఖలు కాకపోవడం ఆక్షేపణలకు దారి తీస్తోంది. ఇటీవల పార్లమెంట్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసుల సంగతేమిటి? అన్ని ప్రశ్నించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ఎన్‌డిఎ కూటమిలో చంద్రబాబు భాగస్వామి కావడం కేసుల నుంచి ఆయనకు రక్షణ కలిగించిందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు.

17 వ లోక్‌సభలో ప్రతిపక్షాలను నోరెత్తనీయకుండా మోడీ సర్కారు ఏ విధంగా వ్యవహరించిందో తెలిసిందే. పౌరసత్వం సవరణ చట్టం, క్రిమినల్ కొత్త చట్టాలు, వ్యవసాయ చట్టాలు గురించి సభలో చర్చించాల్సిందేనని ఆనాడు పార్లమెంటులో ప్రతిపక్షాలు అరిచిగీపెట్టినా పాలకపక్షం ఆలకించలేదు. సరికదా దాదాపు 140 మంది ప్రతిపక్ష ఎంపిలను సభ నుంచి సస్పెన్షన్ చేయించింది. ఆనాడు చర్చకు నోచుకోని చట్టాలను బలవంతంగా ఇప్పుడు అమలులోకి తీసుకురావడం బుల్డోజ్ పాలన కిందకు రాదా? ఇదెంత వరకు ప్రజాస్వామ్య సంప్రదాయం?ఎమర్జెన్సీ బూచిని చూపించి కాంగ్రెస్‌పై పదేపదే ఎదురు దాడి చేస్తున్న ప్రధాని మోడీ ఇప్పుడు కూడా తానెంతవరకు ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. 400 స్థానాలు సాధిస్తామని, కాంగ్రెస్ నుంచి భారత్‌కు ముక్తి కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన మోడీ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. చీటికీ మాటికీ రాహుల్‌వి పిల్లచేష్టలని ఎద్దేవా చేసినంత మాత్రాన దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News